నిలదీసే హక్కు ప్రజలకు లేదా?

Publish Date:Jun 29, 2013

.....సాయి లక్ష్మీ మద్దాల

 

 

 

ఓట్లు అడిగేవాళ్ళు ఓటర్లకు తమను నిలదీసే హక్కు లేదంటున్నారు. రాజకీయ పార్టీలు ప్రజలకు తమను నిలదీసే హక్కు ఇవ్వబోరట. ప్రజాస్వామ్యంలో వ్యవస్థను నడిపించేది రాజకీయ పార్టీలే. ఎన్నికల వేళ ఆయా రాజకీయ పార్టీలు ఎన్నో వాగ్దానాలు చేసి,మేనిఫెస్టో ప్రకటించి అందలమెక్కుతాయి. ఆ తరువాత వాటిలో అమలు కానివే ఎక్కువగా ఉంటాయి. వీటిపై ఆయా పార్టీలను నిలదీసే హక్కు ప్రజలకు ఉంది. అది ఇపుడు చట్టబద్డంకూడా అయ్యింది. కాని సమస్యల్లా సమాచార కమిషన్ ముందు జనానికి సమాచార హక్కు ఇవ్వటం చట్ట వ్యతిరేకమని ప్రధాన పార్టీలు వాదిస్తున్నాయి. అధికారంకోసం అబద్ధపు వాగ్ధానాలు చేసి వాటిని నిలబెట్టుకోకుండా ప్రజలను మోసం చేస్తే ప్రజలు ఏం చేయాలి?ఆయా పార్టీలను నిలదీయటం తప్పంటే ఎలా ?

 

 ఏ  పార్టీ అయిన సరే అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అది చేసే విరాళాలు,వసూళ్లు, ఆయా పార్టీలలో ఉన్న అభ్యర్ధులు పాల్పడిన అవినీతి,దానికి సంబంధిత పార్టి వారిపై తీసుకొనే చర్యలు, ఎన్నికల సంస్కరణలకు సంబందించి ఆయా పార్టీలు చేసే సూచనలు...... తదితర వివరాలతో ఏవైనా సరే ప్రజలు అడిగిన తక్షణం సమాచారం ఇవ్వటానికి పార్టీలు సిద్ధంగా ఉండాలి. ఇలాంటి వివరాలకు సుభాష్ చంద్ర అగర్వాల్ బి.జె. పి,కాంగ్రెస్,సి . పి ఐ, సి. పి.ఎమ్,బి . ఎస్ . పి ,ఎన్. సి. పి  లను లిఖిత పూర్వకంగా అడిగారు. దానికి ఆయా పార్టీలు తాము ఆర్ . టి . ఐ  కిందికి రామని,తాము పబ్లిక్ అధారిటీలము కాదు కనుక అడిగిన సమాచారం ఇవ్వబోమని జవాబిచ్చాయి.

                

ఇది ఎంతవరకు సమంజసం?ప్రజల విరాళాలతో,వివిధ సంస్థల విరాళాలతో నడిచే స్వచ్చంద సంస్థలు ఆర్ . టి . ఐ  పరిధిలో ప్రజలకు సమాధానం చెప్పటానికి సిధంగా ఉన్నపుడు ప్రజాధనం తో నడిచే ఆయా రాజకీయ పార్టీలు ప్రజలకు ఎందుకు సమాధానం చెప్పరు?ప్రజాస్వామ్యం లో ఆయా రాజకీయపార్టీలు వారి పారసర్సాకతను నిరూపించు కోవాలంటే ప్రజలకు ఎప్పుడు జవాబుదారిగానే ఉండాలి. వారసత్వ సంప్రదాయమే నేటికి భారత రాజకీయ పార్టీలలో కొనసాగుతున్నపుడు ఆ పార్టీల ఆర్ధిక వ్యవహారాలు ఆ పార్టీలోని సభ్యులకైన ఎంతవరకు తెలిసే అవకాశం ఉంది. అటువంటపుడు ప్రజలకు తెలిసే అవకాశం ఇంకెక్కడుంది?ఈ సమాచార హక్కు చట్ట పరిధిలోనికి అన్ని రాజకీయ పార్టీలు వస్తేనే నేడు వినబడుతున్న క్విట్ ప్రోకో పద్ధతి మాటున ఎంత అవినీతి జరుగుతుందనేది ప్రజలకు అర్ధమవుతుంది. ఎందుకంటే నేడు ఏ పార్టీ ఐనా ఒక వ్యక్తి నాయకత్వం లోనే నడుస్తోంది కనుక. 

కోట్ల రూపాయల ఆదాయం ఉన్న పార్టీలు కూడా ప్రభుత్వం నుండి ఆదాయపు పన్ను మినహాయింపు పొందుతూ,సదరు పార్టీల  m.l.a,m.p లు ప్రభుత్వం నుండి జీతాలు తీసుకుంటూ,ప్రజల నుండి పార్టీ నిధులు వసూలు చేస్తూ,అధికారం ప్రజల కోసమే వినియోగిస్తున్నామంటూ,పబ్లిక్ అధారిటి కాదంటున్నారు. ప్రజలకు జవాబుదారి కాదంటున్నారు. రాజకీయ పార్టీలు,లెజిస్లేచర్ పార్టీలు అన్ని కూడా పబ్లిక్ అధారిటీలె అని సుప్రీం కోర్టు అంగీకరిస్తూ  c.i.c  తీర్పును సమర్ధించినా,పబ్లిక్ అధారిటి నిర్వచనానికి లోబడి ప్రజలకు జవాబుదారిగా ఉండేందుకు ఏ ప్రభుత్వానికి కాని,ఏ పార్టీకి కాని ధైర్యం లేదు. రాజకీయ పార్టీలు ఎన్నటికి పబ్లిక్ అధారిటీలు కావని c.i.c చట్టాన్ని సవరించే ప్రమాదము లేకపోలేదు.