వెనక్కితగ్గిన శివప్రసాద్

చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ వెనక్కితగ్గారు. ప్రభుత్వాన్ని కార్నర్‌ చేయడమే కాకుండా, నేరుగా  చంద్రబాబుపైనే విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టిన శివప్రసాద్‌‌కి ఎట్టకేలకు ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్‌ దొరికింది. తన వ్యాఖ్యలపై చంద్రబాబు సీరియస్‌గా ఉండటమే కాకుండా, క్రమశిక్షణా చర్యలు తీసుకోబోతున్నారని తెలుసుకున్న శివప్రసాద్‌... యాక్షన్‌ లేకుండా కూల్‌ చేసేందుకు రాయబారాలు పంపినట్లు చెబుతున్నారు. అయితే శివప్రసాద్‌ వ్యవహారశైలిపై గుర్రుగా ఉన్న చంద్రబాబు శాంతించలేదని, ఎన్నో వినతుల తర్వాతే అపాయింట్‌మెంట్‌ ఇచ్చారని తెలుస్తోంది.

 

ఎట్టకేలకు చంద్రబాబును కలిసిన శివప్రసాద్‌.... తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. అంతేకాదు పార్టీకి నష్టం కలిగించేలా మాట్లాడినందుకు క్షమాపణలు కోరినట్లు తెలుస్తోంది. అయితే శివప్రసాద్‌‌ను... చంద్రబాబు గట్టిగానే మందలించినట్లు టాక్ వినిపిస్తోంది. మరోసారి పార్టీకి ఇబ్బంది కలిగించేలా మాట్లాడితే చర్యలు తప్పవని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని, మీడియాకి ఎక్కి ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఇకపై సహించేది లేదని వార్నింగ్‌ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బాధ్యతగా ఉండాల్సిన సీనియర్‌ నేతలే ధిక్కారస్వరం వినిపిస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని, ఇకపై జాగ్రత్తగా ఉండాలని శివప్రసాద్‌కి చంద్రబాబు సూచించారు.

 

గీత దాటే నేతలను ఇకపై ఉపేక్షించే ప్రసక్తే లేదని చంద్రబాబు తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. హెచ్చరించి వదిలేస్తుంటే అలుసుగా తీసుకుంటున్నారని, ఇకపై కట్టుదాటే నేతలపై వేటు వేయడం ఖాయమని పార్టీ శ్రేణులకు చంద్రబాబు సంకేతాలు పంపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu