ఆ పదవి కోసం ఎంపీ పదవికి రాజీనామా చేస్తారట..ఇంతకు ఆ పదవి ఏంటీ
posted on May 2, 2017 6:01PM
.jpg)
రాయపాటి సాంబశివరావు..పరిచయం అక్కర్లేని పేర్లు..ప్రత్యక్ష ఎన్నికల్లో ఓటమిని ఎరుగుని వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నుంచి 5 సార్లు, తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఒకసారి మొత్తం ఆరుసార్లు ఎంపీగా గెలిచిన వ్యక్తి. ప్రతి మనిషికి జీవితంలో తీరని కోరిక ఒకటి ఉంటుంది. అలాగే రాయపాటికి కూడా ఒక తీరని కోరిక ఉంది. అదే టీటీడీ ఛైర్మన్ పదవి. తిరుమల శ్రీవారికి వీర భక్తుడైన రాయపాటికి జీవితంలో ఒకసారైనా టీటీడీ ఛైర్మన్‌గా ఆ స్వామి సేవలో తరించాలని కోరిక. దాని కోసం ఆయన ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో టీటీడీ ఛైర్మన్ గిరి కోసం రాయపాటి రెండు సార్లు ప్రయత్నించారు.
అయితే అప్పట్లో ఆదికేశవులు నాయుడు ఒకసారి, కనుమూరి బాపురాజు మరోసారి ఆ పదవిని తన్నుకుపోయారు. రాష్ట్ర విభజన తర్వాత టీడీపీలో చేరి నరసరావుపేట ఎంపీగా గెలుపొందిన ఆయన టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబుతో సన్నిహితంగా మెలుగుతున్నారు. టీడీపీ హయాంలోనైనా ఈ పదవి కోసం ప్రయత్నించగా..అదృష్టం చదలవాడ కృష్ణమూర్తిని వరించింది. అయితే ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాకూడదని గట్టిగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ రెండు పదవులు ఉండకూడదని పార్టీ భావించిన పక్షంలో ఎంపీ పదవిని వదులుకునేందుకు కూడా సిద్ధమని సీఎంకు లేఖ రాసినట్లు టీడీపీలో చర్చించుకుంటున్నారు. మరి ఈ సారైనా ఆయన కోరిక తీరుతుందో లేదో వేచిచూడాలి.