బీజేపీని సైడ్‌లైన్ చేస్తోన్న టీఆర్‌ఎస్... ప్రోటోకాల్‌పై కమలం కన్నెర్ర
posted on May 1, 2017 4:42PM

కేసీఆర్ సర్కార్‌ను తెలంగాణ బీజేపీ మరోసారి కార్నర్ చేసింది. ప్రజావ్యతిరేక నిర్ణయాలపై పోరాటం చేస్తూనే.... తాజాగా ప్రోటోకాల్ వివాదాన్ని తెరపైకి తెచ్చింది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం.... కేంద్ర మంత్రులను అవమానించేలా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు. మేడే ఉత్సవాలకు కేంద్ర కార్మికశాఖ మంత్రి దత్తాత్రేయను ఆహ్వానించకపోవడాన్ని తప్పుబడుతోంది.
ఇటీవల రాజ్‌భవన్ క్వార్టర్స్ ప్రారంభోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డిని ఆహ్వానించలేదని... అలాగే బన్సీలాల్‌పేట్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల శంకుస్థాపనకు స్థానిక ఎంపీ, కేంద్ర మంత్రి దత్తాత్రేయను పిలవకుండానే కార్యక్రమం నిర్వహించారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. టీఆర్‌ఎస్ నేతలకు ఎందుకింత అభద్రతా భావం అంటూ ప్రశ్నిస్తున్నారు.
కేంద్ర మంత్రులను ఆహ్వానిస్తే... బీజేపీకి ఎక్కడ పేరు వస్తుందోనని, తమను పిలవడం లేదని కమలం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అందుకే ప్రోటోకాల్ సైతం పాటించకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, ఇవన్నీ ప్రజలు చూస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కి కచ్చితంగా బుద్ధి చెబుతారని హెచ్చరిస్తున్నారు.