గుప్పెడు మట్టి... చెంబుడు నీళ్లు... ఏపీకి మిగిలిందిదే
posted on Oct 23, 2015 10:12AM
.jpg)
జరుగుతున్నది చరిత్రాత్మక ఘట్టం, వస్తున్నది దేశ ప్రధాని, అందుకే ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, అమరావతి వేదికగా నరేంద్రమోడీ... కచ్చితంగా వరాలు ప్రకటిస్తారని, రాష్ట్ర విభజనతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న నవ్యాంధ్రప్రదేశ్ కి ప్రాణవాయువు లాంటి ప్రత్యేక హోదా ప్రకటించి ఆదుకుంటారని భావించారు, కానీ ప్రజలు ఆశించినట్లుగా ఇవేమీ జరగలేదు... కేవలం పార్లమెంట్ ప్రాంగణం నుంచి మట్టి, యమునా నది నుంచి జలాలను మాత్రమే తీసుకొచ్చిన మోడీ... తన ప్రసంగంతో ఆంధ్రులను ఉసూరుమనిపించారు. ఇటు ముఖ్యమంత్రి గానీ, అటు ప్రధానమంత్రి గానీ.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్న ఒక్క మాట చెప్పకుండానే అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని, తమ ప్రసంగాలను పూర్తి చేసేశారు.
పార్లమెంట్ ప్రాంగణం నుంచి గుప్పెడు మట్టిని, యమునా నది నుంచి చెంబుడు నీటిని తీసుకొచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. తన ప్రసంగంలో ఎక్కడా ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తామని, విభజన చట్టంలోని హామీలన్నింటినీ నెరవేర్చుతామని చెప్పిన మోడీ, స్పెషల్ స్టేటస్, వరాలపై మాత్రం నోరు మెదపలేదు. పునర్విభజన చట్టంలో ఉన్న ప్రతి అక్షరాన్ని దాని అసలైన స్ఫూర్తితో అమలుచేస్తామన్నారు గానీ.. అసలు విషయం గురించి మాత్రం మరిచిపోయారు. దాంతో ప్రధాని నరేంద్రమోడీపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం నీరుగారిపోయారు.
అస్తవ్యస్తంగా రాష్ట్రాన్ని విభజించారని... రెండు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాలని నాలుగు మంచి మాటలు చెప్పారే గానీ, నవ్యాంధ్రప్రదేశ్ కి ప్రాణవాయువులాంటి ప్రత్యేక హోదా గురించి ఒక్క మాటంటే ఒక్క మాట కూడా చెప్పలేదు. రాష్ట్ర విభజన చట్టంలోని హామీలన్నింటినీ నెరవేర్చి...ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరిస్తామని ప్రధాని మోడీ క్లారిటీ ఇచ్చేయడంతో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వనట్లేనని తేలిపోయింది.