‘లెటర్ అంట్ స్పిరిట్‘ అంటూ ‘హోదా‘పై మోడీ క్లారిటీ

 

ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వలేమంటూ పార్లమెంట్ సాక్షిగా కేంద్రం ఎన్నోసార్లు క్లారిటీ ఇచ్చినా... మోడీపై నమ్మకంతో ఇన్నాళ్లూ ఆగారు, హోదా ఇవ్వడానికి ఏపీకి ఎలాంటి అర్హతలు లేవంటూ కేంద్ర మంత్రులు పలుమార్లు చెప్పినా... ప్రధాని మోడీ నిర్ణయం తీసుకుంటే ఆగుతుందా అంటూ సరిపెట్టుకున్నారు, అయితే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న చరిత్రాత్మక ఘట్టం అమరావతి శంకుస్థాపనకు వచ్చిన మోడీ కచ్చితంగా హోదాపై ప్రకటన చేస్తారని, ఏపీకి వరాలు జల్లు కురిపిస్తారని ఆశించారు, కానీ ప్రజల నమ్మకం వమ్మయింది, ముసుగులో గుద్దులాట లేకుండా నరేంద్రమోడీ కూడా క్లారిటీ ఇచ్చేశారు...ప్రత్యేక హోదా విషయాన్ని తన ప్రసంగంలో నేరుగా ప్రస్తావించకుండానే... లెటర్ అంట్ స్పిరిట్ అంటూ స్టేటస్ పై తేల్చిచెప్పేశారు.


ప్రత్యేక హోదానే కాదు కనీసం ప్యాకేజీపై కూడా నోరు మెదపని మోడీ... ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తామని, విభజన చట్టంలోని హామీలన్నింటినీ నెరవేర్చుతామని ఒకటికి రెండుసార్లు చెప్పారు, అయితే లెటర్ అంట్ స్పిరిట్ ప్రకారం పునర్విభజన చట్టంలో ఉన్న ప్రతి అక్షరాన్ని దాని అసలైన స్ఫూర్తితో అమలుచేస్తామన్నారు. అంటే మోడీ మాటల ప్రకారం విభజన చట్టంలో ఏమైతే ఉందో దాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తామని హామీ ఇచ్చారు, ఈ లెక్కన విభజన చట్టంలో లేని ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశమే లేదు, అందుకే మోడీ తెలివిగా రాష్ట్ర విభజన చట్టంలోని హామీలన్నింటినీ నెరవేర్చి...రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తామంటూ మాట్లాడారు.

పునర్విభజన చట్టంలోని ప్రతి అక్షరాన్ని అసలైన స్ఫూర్తి(లెటర్ అండ్ స్పిరిట్)తో అమలు చేస్తామంటూ మోడీ క్లారిటీ ఇచ్చేయడంతో ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా రానట్లేనని విశ్లేషకులు అంటున్నారు, స్టేటస్ ఇచ్చే ఉద్దేశం లేదు కాబట్టే... ప్రధాని ప్రత్యేక హోదా అంశాన్నే ప్రస్తావించలేదని గుర్తుచేస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu