బాబు, మోడీ స్పీచ్ లతో ఇబ్బందిపడ్డ కేసీఆర్
posted on Oct 23, 2015 8:52AM

అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు, తెలుగు మాట్లాడేవారంతా కలిసి పనిచేసుకుంటే సమస్యలు పరిష్కారమవుతాయన్న చంద్రబాబు... తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అందుకు సానుకూలంగా ఉన్నారని అన్నారు, సమస్యలు ఎప్పుడూ ఉండేవేనని... కానీ సామరస్యంగా పరిష్కరించుకుంటూ ముందుకెళ్తే తెలుగు రాష్ట్రాలు దూసుకెళ్తాయని బాబు అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్... అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరవడం తనకు ఎంతో సంతోషంగా ఉందని... ముందు ముందు ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తామని, పరస్పరం సహకరించుకుంటూ ముందుకెళ్తామని ఆకాంక్షించారు.
అయితే ప్రతి సందర్భంలోనూ రాష్ట్ర విభజన గురించి మాట్లాడే ఏపీ సీఎం చంద్రబాబునాయుడు... అమరావతి శంకుస్థాపనలో సైతం ప్రస్తావించారు, అది కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందే రాష్ట్ర విభజన అస్తవ్యస్తంగా జరిగిందని మాట్లాడారు, రాష్ట్ర విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటోందని, వాటిని అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు, దాంతో వేదికపైనున్న కేసీఆర్ ఇబ్బందిపడినట్లు కనిపించారు, అయితే కేసీఆర్ ఎంతో హుందాగా మాట్లాడారని, చంద్రబాబు కూడా అలాగే మాట్లాడి ఉంటే బాగుండేదని, ఇలాంటి సందర్భంలో అదీ కేసీఆర్ ను ప్రత్యేక ఆహ్వానించాక కూడా రాష్ట్ర విభజన గురించి మాట్లాడటం సరికాదనే అభిప్రాయం అక్కడున్నవారిలో వ్యక్తమైంది
ప్రధాని మోడీ కూడా అదే అంశంపై ఎక్కువగా మాట్లాడటంతో ఆ సమయంలో కేసీఆర్ ముభావంగా కనిపించారు, వాజ్ పేయి ప్రధానిగా ఉండగా మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేశారని, కానీ ఎలాంటి విద్వేషాలు లేకుండా చేశారని అన్నారు, యూపీఏ ప్రభుత్వం మాత్రం ఆంధ్రప్రదేశ్ విభజనను అస్తవ్యస్తంగా చేసిందని, ప్రజల మధ్య విద్వేషాలు పెంచేలా ప్రవర్తించిందని మోడీ అన్నారు. పైగా రాజకీయ లబ్ధి కోసం ఇష్టమొచ్చి రాష్ట్ర విభజన చేయడంతో రెండు రాష్ట్రాల్లోనూ అస్తవ్యస్త పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు.
అయితే చారిత్రాత్మక ఘట్టం జరుగుతున్న సమయంలోనూ రాష్ట్ర విభజన గురించి ప్రస్తావించడం, అస్తవ్యస్తంగా జరిగిందంటూ పాత గాయాన్ని రేపే ప్రయత్నం చేయడం అంత బాగోలేదని అక్కడున్నవారిలోనూ వ్యక్తమైంది.