మావోలకి మోడీ సందేశం వేస్ట్
posted on May 10, 2015 10:36PM

మావోయిస్టుల సిద్ధాంతానికి, రాజకీయ నాయకుల సిద్ధాంతానికి చాలా తేడా, దూరం వున్నాయి. ఈ రెండు వ్యవస్థలూ ఎప్పటికీ కలవని రైలు పట్టాల్లాంటివి.ఈ విషయం గతంలో ఎన్నోసార్లు రుజువైంది. మావోయిస్టులను జన జీవన స్రవంతిలో కలవాలని ఎన్నో వందలమంది రాజకీయ నాయకులు పిలుపులు ఇచ్చారు. ఏవేవో ఆశలు చూపించారు. అయితే అవి ఎప్పుడూ సత్ఫలితాన్ని ఇవ్వలేదు. చివరికి కొన్ని సందర్భాలలో మావోయిస్టులు ఆయుధాలని వదలాలని అనుకుంటే, అవి వారికే బెడిసికొట్టి భారీ నష్టాలను మిగిల్చాయి. మొత్తమ్మీద ఇప్పుడున్న పరిస్థితుల్లో మావోయిస్టులు - రాజకీయ నాయకులకు సయోధ్య కుదిరే అవకాశమే లేదు. ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఈ విషయం తెలియదని అనుకోలేం. అయితే ఆయన ఛత్తీస్‌గఢ్ పర్యటన సందర్భంగా మావోయిస్టులు ఆయుధాలను వదిలి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని పిలుపు ఇచ్చారు. ఆయన పిలుపు అయితే ఇచ్చారుగానీ, ఆ పిలుపు ఫలించడం మాత్రం కలలో మాట.
మావోయిస్టులకు ప్రథమ శత్రువులు రాజకీయ నాయకులు. అలాంటి నాయకులుచెప్పిన మాటలు విని మావోయిస్టులు తుపాకులను వదిలేసే ప్రసక్తే వుండదు. వారు తుపాకులు వదిలేసి, ప్రభుత్వాలతో చర్చలు జరిపిన ప్రతిసారీ నష్టపోతూనే వచ్చారు. ఏపీ విషయానికి వస్తే, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పిలుపు మేరకు తుపాకులు విడిచిపెట్టి చర్చలకు వచ్చిన మావోయిస్టులు ఘోరంగా దెబ్బతిన్నారు. ఏపీలో మావోయిస్టులు దాదాపుగా తుడిచిపెట్టుకుని పోవడానికి ఆ సందర్భం ముఖ్య కారణంగా మారింది. ఇలాంటి పాఠాలు గతంలో కూడా మావోయిస్టులు నేర్చుకున్నారు. అందుకే మరోసారి అలాంటి పొరపాటు చేయరు. రాజకీయ, మావోయిస్టు వ్యవస్థల మధ్య నిరంతర ఘర్షణ అలా కొనసాగాల్సిందే. మోడీ ఛత్తీస్‌గఢ్ పర్యటనను పురస్కరించుకుని 250 మందిని మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. ఒకరిని చంపేశారు. అదృష్టం బాగుండి కిడ్నాప్ చేసిన మిగతా వారిని విడిచిపెట్టేశారు. ఇలా ప్రభుత్వాలకు సవాల్ విసురుతున్న మావోయిస్టులకు మోడీగారు శాంతిపాఠాలు నేర్పించే ప్రయత్నాలు చేయడం, శాంతి సందేశాలు ఇవ్వడం వేస్ట్.