ఎన్నికలంటే టీఆర్ఎస్‌కి భయమా?
posted on May 10, 2015 10:14PM

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉప ఎన్నికలంటే, జీహెచ్ఎంసీ ఎన్నికలంటే టీఆర్ఎస్ భయపడుతోందా? ఠాఠ్... అలాంటిదేమీ లేదు... టీఆర్ఎస్ పాలన చూసి ప్రజలు మురిసిపోయి ముగ్ధులైపోతున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం తమ పూర్వ జన్మ సుకృతమని ప్రజలు భావిస్తున్నారు. ఏ ఎన్నికలు జరిగినా టీఆర్ఎస్‌ని గెలిపించేస్తారు అని టీఆర్ఎస్ నాయకులు పైకి చెబుతూ వుండొచ్చుగానీ, వాస్తవ పరిస్థితి వారు చెబుతున్నట్టుగా లేదని, అందుకే ఉప ఎన్నికలకు, జీహెచ్ఎంసీ ఎన్నికలకు సిద్ధం కావడానికి టీఆర్ఎస్ వెనుకడుగు వేస్తోందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
జీహెచ్ఎంసీ ఎన్నికలతోపాటు పలు నియోజకవర్గాలకు ఉప ఎన్నికలను టీఆర్ఎస్ ఎదుర్కోవలసి వుంది. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారు హైదరాబాద్‌లో ఎక్కువగా వుండటం వల్ల ఇక్కడ టీఆర్ఎస్ విజయం అంత సులభం కాదు. అయినప్పటికీ ఆక్రమించుకున్న స్థలాలను క్రమబద్ధీకరించడం, ముస్లింలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేయడం, ఎంఐఎంతో దోస్తీ చేయడం తమకు ఉపయోగపడుతుందని టీఆర్ఎస్ నేతలు పైకి చెబుతున్నప్పటికీ లోపల ఏవో సందేహాలు వారిని పీడిస్తున్నాయి. సీమాంధ్రులను దువ్వే ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఫలించిన దాఖలాలు కనిపించడం లేదు. అందుకే జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం వెనుకాడుతూ వచ్చింది. అయితే కోర్టు ఆదేశాల కారణంగా ఎన్నికలు జరపక తప్పని పరిస్థితి వచ్చింది.
అలాగే టీడీపీ నుంచి టీఆర్ఎస్‌లోకి చేరిన తలసాని వంటి ఎమ్మెల్యేలు, ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కడియం శ్రీహరి కూడా తన ఎంపీ స్థానానికి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవాల్సి వుంది. అలాగే కడియం రాజీనామా చేసిన ఎంపీ స్థానానికి కూడా ఉప ఎన్నిక జరపాల్సి వుంది. అలాగే అవసరమైతే టీఆర్ఎస్‌లో చేరిన ఇతర పార్టీల ఎమ్మెల్యేల స్థానాలకు కూడా ఉప ఎన్నికలు జరపాల్సి వుంటుంది. ఈ ఎన్నికలలో ఏ స్థానంలో అయినా టీఆర్ఎస్ ఓడిపోయిన పక్షంలో అది టీఆర్ఎస్‌కి షాక్ ఇచ్చే అవకాశం వుంది. అందుకే అసలు ఉప ఎన్నికలు జరగకుండా తప్పించుకునే మార్గాలను టీఆర్ఎస్ అన్వేషిస్తున్నట్టు తెలుస్తోంది. ఇవన్నీ చూస్తుంటే ఎన్నికలంటే టీఆర్ఎస్ భయపడుతోందని భావించాల్సి వస్తోందని పరిశీలకులు అంటున్నారు.