ఈ విషాద సంఘటనలు ఇంకెన్నాళ్ళు సాగుతాయో?

 

నరహంతకులయిన ఐసిస్ ఉగ్రవాదుల భయంతో లిబియా తదితర దేశాల నుండి నిత్యం వేలాది మంది ప్రజలు టర్కీ తదితర యూరోపియన్ దేశాలకి వలసలు వెళ్ళిపోతున్నారు. వారు తమ ప్రాణాలు కాపాడుకోవడానికే ఆ దేశాలకి వెళుతున్నప్పటికీ అన్ని లక్షల మంది శరణార్ధులకు ఆశ్రయం కల్పించలేక ఆ దేశాలు చేతులు ఎత్తేస్తున్నాయి. అయినప్పటికీ నిత్యం వేలాది మంది చిన్న చిన్న నాటు పడవలలో, మర బోట్లలో యూరప్ దేశాలలోకి ప్రవేశించడానికి బయలుదేరుతూనే ఉన్నారు. ఆ ప్రయత్నంలో వారు దళారులకు, స్మగ్లర్లకు తమ కష్టార్జితాన్ని చివరికి తమ విలువయిన వస్తువులని కూడా సమర్పించుకొని ఈ దుస్సాహసానికి ఒడిగడుతున్నారు. ఆ ప్రయత్నంలో నిత్యం వందల మంది సముద్రంలో పడి శవాలుగా ఒడ్డుకు కొట్టుకువస్తున్నారు.

 

కొన్ని రోజుల క్రితం సిరియా దేశానికి చెందిన మూడేళ్ళ వయసు గల అయ్లాన్ కుర్ది అనే ముద్దులొలికే ఒక చిన్నారి బాలుడి శవం టర్కీలో బోడ్రం బీచ్ ఒడ్డుకి కొట్టుకు వచ్చినపుడు అది చూసి యావత్ ప్రపంచం కన్నీరు పెట్టుకొంది. కానీ అంతటితో అటువంటి దుర్ఘటనలు ఆగిపోలేదు. నేటికీ వందల శవాలు ఏదో ఒక దేశ సముద్రం ఒడ్డుకి కొట్టుకొని వస్తూనే ఉన్నాయంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్ధం అవుతుంది. ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోయే ప్రయత్నంలోనే వారు ప్రాణాలు పోగొట్టుకోవడం చూస్తుంటే మానవత్వం ఉన్న ప్రతీ మనిషి కంట కన్నీరు రాక మానదు.

 

లిబియాలో ట్రిపోలీ మరియు సబ్రత్ సముద్ర తీరాలకి గత వారం రోజుల్లో మొత్తం 85మంది శవాలు కొట్టుకు వచ్చినట్లు రెడ్ క్రేసెంట్ అనే స్వచ్చంద సంస్థకి చెందిన అధికార ప్రతినిధి మహమ్మద్ అల్- మిస్రతి చెప్పారు. వారిలో చిన్నారులు మొదలు మొదలు వృద్ధుల వరకు అన్ని వయసులు వారి శవాలు ఉన్నట్లు తెలిపారు. వాటిలో చాల శవాలు పూర్తిగా పాడయిపోయిన స్థితిలో ఒడ్డుకు కొట్టుకు వచ్చేయని తెలిపారు. చిన్న చిన్న రబ్బరు బోట్లలో ప్రయాణిస్తూ నడి సముద్రంలో మునిగిపోవడానికి సిద్దంగా ఉన్న 212 మందిని రక్షించి ఒడ్డుకు తెచ్చినట్లు తెలిపారు.

 

ఐసిస్ ఉగ్రవాదుల అరాచాలకి భయపడే ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని ఇటువంటి సాహాసం చేస్తున్నవారు కొందరయితే, లిబియా, ఆఫ్రికా దేశాలకి చెందిన యువతీ యువకులు, ఉపాధి కోసం లిబియాకి కేవలం 300 కిమీ దూరంలో ఉన్న ఇటలీ దేశానికి చెందిన లంపేదుశ దీవులకి చేరుకొనే ప్రయత్నంలో ప్రాణాలు పోగొట్టుకొంటున్నారు. అటువంటి వారిని రక్షించడం లేదా ఒడ్డుకు కొట్టుకు వచ్చిన వారి శవాలకు అంత్యక్రియలు చేయడం తమకిప్పుడు నిత్యక్రుత్యమయిపోయిందని రెడ్ క్రేసెంట్ ప్రతినిధి తెలిపారు. ఈ సమస్య తీవ్రతని ప్రపంచ దేశాలు ఎప్పటికి గుర్తించి పరిష్కారానికి ప్రయత్నిస్తాయో తెలియదు కానీ అంతవరకు ఇంకా ఎన్ని వేలమంది దీనికి బలయిపోతారో?

Online Jyotish
Tone Academy
KidsOne Telugu