భోగాపురం భూముల్లో 80 శాతం రియల్ ఎస్టేట్ వ్యాపారులవేనట!
posted on Oct 6, 2015 9:28AM
.jpg)
విజయనగరం జిల్లాలో భోగాపురం వద్ద విమానాశ్రయం నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణకు పూనుకొంది. దానిని స్థానిక రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కనుక వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వారికి మద్దతుగా నిలబడి పోరాడేందుకు నిన్న అక్కడికి వెళ్ళారు. ఆ సందర్భంగా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఆంద్రప్రదేశ్ తెదేపా అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావు స్పందిస్తూ జగన్ పై ప్రతివిమర్శలు చేసారు. “భోగాపురంలో నిజమయిన రైతులెవరూ ధర్నాలు చేయడం లేదు. ఎందుకంటే ఆ ప్రాంతంలో సుమారు 80 శాతం భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల చేతుల్లో ఉంది. మిగిలిన 20 శాతం భూములు మాత్రమే స్థానిక రైతుల చేతుల్లో ఉన్నాయి. భోగాపురానికి 45కిమీ దూరంలో జగన్మోహన్ రెడ్డికి ఉన్న 125 ఎకరాలను ఈడీ అధికారులు అటాచ్ చేసారని పత్రికలలో వార్తలు వచ్చేయి. అది కాక జగన్మోహన్ రెడ్డి భోగాపురంలో కూడా బినామీ పేర్లతో ఇంకా ఏమయినా భూములు ఉన్నాయేమో తెలియదు. వాటిని కాపాడుకోనేందుకే ఆయన భూసేకరణను వ్యతిరేకిస్తున్నారని అనుమానం కలుగుతోంది. రాజధాని ప్రాంతంలో భూసేకరణకు అడుగడుగునా అడ్డుపడిన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇప్పుడు ఉత్తరాంధ్ర జిల్లాలు అభివృద్ధి కూడా అడ్డుపడుతున్నారు. ఉత్తరాంధ్రాలో మూడు జిల్లాలకి ప్రయోజనం కలిగించాలనే ఉద్దేశ్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం భోగాపురం వద్ద విమానాశ్రయం ఏర్పాటు చేయాలనుకొంటోంది. రాష్ట్రంలో జగన్ అభివృద్ధి నిరోధకుడిగా తయారయ్యారు,” అని విమర్శించారు.
కిమిడి కళా వెంకటరావు చెప్పినట్లు భోగాపురంలో 80 శాతం భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతులోనే ఉన్నట్లయితే ఇక భూసేకరణకు సమస్యే ఉండదు. ప్రభుత్వం వారితో మాట్లాడుకొని భూసేకరణ చేసుకోవచ్చును. కానీ రెవెన్యూ అధికారులు భోగాపురంలో భూములను సర్వే చేయడానికి వెళ్ళినప్పుడు స్థానిక రైతులు వారిని అడ్డుకొన్నారు. కిమిడి కళా వెంకటరావు వారందరూ స్థానిక రైతులు కారని అంటున్నారు. భోగాపురంలో భూముల వివరాలేవీ రహస్య విషయం కాదు. అక్కడ రైతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులలో ఎవరెవరి పేరిట ఎంత భూమి ఉందనే విషయం రెవెన్యూ రికార్డ్స్ లో ఉంటుంది. ఆ విషయం తెలుసుకోకుండానే జగన్ వెళ్లి అక్కడ ధర్నా చేసాడని అనుకోలేము. కనుక జగన్మోహన్ రెడ్డిని విమర్శించే ప్రయత్నంలో సున్నితమయిన ఈ అంశం మీద వెంకటరావు ఈవిధంగా మాట్లాడటం వలన సమస్య మరింత జటిలం అవుతుందే తప్ప పరిష్కారం కాదని గ్రహించాలి.