కరణం బలరాంను సైడ్ ట్రాక్ చేస్తున్నదెవరు?
posted on Oct 6, 2015 5:17PM

చంద్రబాబుకు మిత్రుడు, సమకాలీకుడైన కరణం బలరాం రాజకీయ భవిష్యత్ ఎందుకు అయోమయంలో పడింది, ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఒకప్పడు చక్రం తిప్పిన నాయకుడు ఎందుకు కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది, ఏళ్లతరబడి తెలుగుదేశం పార్టీనే నమ్ముకున్నా కరణంను అధిష్టానం ఎందుకు పక్కనబెడుతోంది? కరణం బలరాం ప్రతిష్ట మసకబారడానికి కారణమెవరు? చంద్రబాబా? చినబాబా? లేక తన పతనాన్ని తానే స్వయంగా బలరాం కోరి తెచ్చుకున్నాడా?
పీవీ హయాంలో ఒకసారి కాంగ్రెస్ లోకి వెళ్లొచ్చినా తెలుగుదేశం పార్టీనే నమ్ముకున్న నాయకుడు కరణం బలరాం, ఒకప్పుడు ప్రకాశం జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన కరణం... ఎక్కువగా గ్రూప్ లను ప్రోత్సహించేవారని ఆరోపణలున్నాయి, బలరాం నడిపిన వర్గ రాజకీయాలతోనే ప్రకాశం జిల్లాలో టీడీపీ దెబ్బతిందంటారు, కరణం వ్యవహారశైలి కారణంగా ఎంతోమంది నాయకులు, కార్యకర్తలు పార్టీని వీడిపోయారని అతని ప్రత్యర్ధులు చెబుతుంటారు. ఒకప్పుడు కరణం బలరాం నడిపిన గ్రూప్ రాజకీయాలే చివరికి అతని రాజకీయ పతనానికి దారితీశాయని, ఎంతో ఎత్తుకు ఎదిగిన బలరాం... అదేరీతిలో కిందికి పడ్డారని అంటున్నారు.
కరణం బలరాం తీరుతో విసిగివేసారిపోయిన చంద్రబాబు... కావాలనే అతడ్ని పక్కనపెట్టారని టీడీపీ నేతలు చెబుతుంటారు, కరణం వ్యవహార శైలి కారణంగానే ప్రకాశం జిల్లాలో పార్టీ దెబ్బతిందని హైకమాండ్ భావించిందని, అందుకే బలరాం వ్యతిరేకించినప్పటికీ లోకేష్ పట్టుబట్టిమరీ దామరచర్ల జనార్దన్ ను జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా నియమించారని చెబుతున్నారు, ఒకవేళ బలరాం గెలిచుంటే మంత్రి పదవి ఇవ్వాల్సి వచ్చేదని, దాంతో ప్రకాశం జిల్లా టీడీపీ... గ్రూపు రాజకీయాలతో సతమతమయ్యేదని, కానీ కరణం ఓటమితో ఆ బాధ కూడా తప్పిందని అధిష్టానం భావిస్తున్నట్లు టాక్.
అయితే ప్రకాశం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని గుర్తించిన లోకేష్... అజాత శత్రువు, సీనియర్ లీడరైన మాగుంట శ్రీనివాసులురెడ్డిని టీడీపీలోకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారని, మాగుంటకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం ద్వారా జిల్లాలోని రెడ్డి కమ్యూనిటీకి దగ్గరయ్యే ప్రయత్నం చేశారని చెప్పుకుంటున్నారు. కరణం బలరాంను సైడ్ ట్రాక్ చేసి, మాగుంటను మెయిన్ ట్రాక్ ఎక్కించడంలో లోకేష్ తెలివైన నిర్ణయమే తీసుకున్నాడని పార్టీ వర్గాలు అంటున్నాయి
కరణం బలరాం రాజకీయ పతనానికి ఆయనే కారణమని, బలరాం నడిపిన గ్రూపు రాజకీయాలే చివరికి ఆయన్ని దెబ్బతీశాయని ప్రకాశం జిల్లా టీడీపీ నేతలంటున్నారు, తన వ్యవహార శైలితో తన రాజకీయ పతనాన్ని తనే కొనితెచ్చుకున్నాడని సన్నిహితులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు, టీడీపీ హైకమాండ్ కూడా కరణంతో విసిగిపోయే పక్కనబెట్టిందంటున్నారు