కృష్ణ, గోదావరి నదుల అనుసంధానం నేడే
posted on Sep 16, 2015 9:02AM

దేశంలో నదుల అనుసంధానం చేయాలని కేంద్రప్రభుత్వం ఆలోచనకు అనుగుణంగా ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా, గోదావరి నదులను అనుసంధాన కార్యక్రమాన్ని చెప్పట్టింది రాష్ట్ర ప్రభుత్వం. అందులో తొలి ప్రయత్నంగా పట్టిసీమ ప్రాజెక్టును నిర్మించి దాని ద్వారా సముద్రంలోకి వృధాగా పోతున్న గోదావరి నదీ జలాలను కృష్ణా జిల్లా మీదుగా మళ్ళించి కృష్ణానదితో అనుసంధానం చేయబోతున్నారు. తద్వారా వేలాది ఎకరాలలో ఏడాదికి మూడు పంటలు సాగుచేసుకొనే అవకాశం ఏర్పడుతుంది.
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టుకు మార్చి 29న శంఖుస్థాపన చేసారు. నాటి నుండి ప్రతిపక్షాల తీవ్ర విమర్శలను, ఆరోపణలను ఎదుర్కొంటూనే ఈ ప్రాజెక్టు శరవేగంగా పూర్తిచేస్తున్నారు. మూడు-నాలుగు రోజుల క్రితమే తాటిపూడి ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదల చేసి చూసారు. ఇవ్వాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టుని ఆరంభించబోతున్నారు.
ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి-కృష్ణా నదులను ఏవిధంగా అనుసంధానం చేస్తారంటే: తాటిపూడి ప్రాజెక్టు నుండి గోదావరి నీటిని పోలవరం కుడి కాలువకి పంపింగ్ చేస్తారు. ఆ నీళ్ళు వెలగలేరు గ్రామం వద్ద గల భలేరావు చెరువుకి చేరుకొంటాయి. అక్కడి నుండి బుడమేరు కాలువకి మళ్ళిస్తారు. బుడమేరు ద్వారా గోదావరి నీళ్ళు ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణానదిలో కలుస్తాయి. పట్టిసీమ వద్ద నీటిని విడుదల చేసిన తరువాత కృష్ణా, గోదావరి రెండు నదులు సంగమించే ఇబ్రహీం పట్టణం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బహిరంగ సభ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి ‘కృష్ణాగోదావరి పవిత్ర సంగమం’ అని ప్రభుత్వం నామకరణం చేసింది.
ఈ ఏడాది నవంబర్ లోగా కనీసం 13-15 టి.యం.సి.ల గోదావరి జలాలను కృష్ణకు తరలించడానికి అవసరమయిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే మొత్తం 80 టి.యం.సి.ల నీళ్ళు కృష్ణా నదికి తరలివెళతాయి. దీని కోసం మొత్తం 24 పంపులను ఏర్పాటు చేస్తున్నారు. వాటిలో ఒక పంపు ద్వారా ఇవ్వాళ నీటిని పంపింగ్ చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరంభించబోతున్నారు. ఈ నెలాఖరులోగా మరో మూడు పంపులు పనిచేయడం ఆరంభిస్తాయి. నవంబర్ నాటికి మరో 6 పంపులు పనిచేయడం ఆరంభిస్తాయి.