ఉత్తర కొరియాకి భారత్ స్నేహ హస్తం!

 

ఇంచుమించు ప్రపంచ దేశాలన్నిటితో కూడా దక్షిణ కొరియాకి మంచి సత్సంబందాలున్నాయి. కానీ సైనిక పాలనలో కొనసాగుతున్న ఉత్తర కొరియాకి మాత్రం చైనా, పాకిస్తాన్ వంటి కొన్ని దేశాలతోనే సంబంధాలున్నాయి. భారత్-దక్షిణా కొరియాల మధ్య ఉన్నసత్సంబందాల కారణంగా భారత్ మార్కెట్లలో దక్షిణ కొరియాకు చెందిన మొబైల్ ఫోన్లు మొదలుకొని కార్ల వరకు విస్త్రుత వ్యాపారావకాశాలను అందిపుచ్చుకొని లబ్ది పొందగలుగుతోంది. ఇది గమనించిన ఉత్తర కొరియా కూడా భారత్ తో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరుచుకొనేందుకు ప్రయాత్నాలు ప్రారంభించింది. గతేడాది ఏప్రిల్ నెలలో ఆ దేశ విదేశాంగ మంత్రి రి సు యంగ్ డిల్లీ పర్యటన చేసారు. భారత్ కూడా అందుకు చాలా సానుకూలంగానే ప్రతిస్పందించింది. ఇటీవల డిల్లీలో ఉత్తర కొరియా రాయబార కార్యాలయంలో నిర్వహించిన ఆ దేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరెన్ రిట్జు భారత ప్రభుత్వం తరపున హాజరయ్యారు.

 

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఇదేదో హడావుడిగా తీసుకొన్న నిర్ణయం కాదు. భారత్-ఉత్తర కొరియా దేశాల మధ్య మళ్ళీ ద్వైపాక్షిక సంబంధాలు బలపరుచుకొనే ఉద్దేశ్యంతోనే ఈ కార్యక్రమానికి హాజరయ్యాను. మిగిలిన దేశాలలాగే ఉత్తర కొరియా కూడా ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం కలిగి ఉంది. కనుక మిగిలిన దేశాలతో భారత్ ఏవిధంగా మైత్రిని కోరుకొంటుందో అదేవిధంగా ఉత్తర కొరియాతో కూడా స్నేహ సంబంధాలు కలిగి ఉండాలని భావిస్తోంది. గత సమస్యలను, అవరోధాలను అన్నిటినీ పక్కనబెట్టి ఉత్తర కొరియాతో మళ్ళీ సత్సంబంధాలు నెలకొల్పుకొనేందుకు మా ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తుంది,” అని అన్నారు.

 

ఉత్తర కొరియా భారత్ కంటే చైనా, పాకిస్తాన్ దేశాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నందున భారత్ కూడా దానితో ఇంతకాలం అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తోంది. కానీ మోడీ ప్రభుత్వం ఉత్తర కొరియాను దూరం పెట్టడం కంటే తన వైపు త్రిప్పుకోవడం మంచిదని భావించడంతో ఈ అడుగు వేసింది. మోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకి చైనా కూడా సానుకూలంగానే స్పందిస్తోంది. కానీ పాకిస్తాన్ మాత్రం ఒకవైపు భారత్ తో చర్చలు సమావేశాలు అంటూనే సరిహద్దుల వద్ద కాల్పుల అతిక్రమణకు పాల్పడుతూ, భారత్ లోకి ఉగ్రవాదులను ప్రవేశ పెట్టేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తోంది. పాకిస్తాన్ ఒంటరి చేసేందుకే మోడీ ప్రభుత్వం ఉత్తర కొరియాతో స్నేహ సంబందాలు బలపరుచుకోవాలని ప్రయత్నిస్తోందేమో? లేకుంటే అమెరికా యూరప్ దేశాల దృష్టిలో దూర్తదేశంగా ముద్ర వేసుకొన్న ఉత్తర కొరియాతో స్నేహసంబంధాలు పెంచుకొనే ప్రయత్నాలు చేసి ఉండదు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu