గులాబీ గూటిలో ఉపఎన్నికల గుబులు


 


తెలంగాణలో తమకు ఎదురే లేదన్నట్లుగా ఏకఛత్రాధిపత్యంగా దూసుకుపోతున్న గులాబీ పార్టీకి అడ్డుకట్టపడేటట్లే కనిపిస్తోంది. కేసీఆర్ పైనా, టీఆర్ఎస్ ప్రభుత్వంపైనా ప్రజలు పెట్టుకున్న నమ్మకం మెల్లగా కరిగిపోతుందని, త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో గులాబీ పార్టీకి దిమ్మదిరిగే షాక్ ఖాయమని అంటున్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో పదేపదే ఉపఎన్నికల అస్త్రాన్ని ప్రయోగించి, ప్రత్యర్ధి పార్టీలను ముప్పుతిప్పలు పెట్టిన టీఆర్ఎస్ కు ఇప్పుడవే ఉపఎన్నికలు తలనొప్పిగానూ, సవాలుగానూ మారాయంటున్నారు.

ప్రస్తుత పరిస్థితులు టీఆర్ఎస్ కు ఏమాత్రం అనుకూలంగా లేవని గులాబీ శ్రేణులు కూడా అంగీకరిస్తున్నాయి. రైతు ఆత్మహత్యలతో ప్రభుత్వ ప్రతిష్ట దిగజారిందని, మరోవైపు రుణమాఫీపై రైతుల్లో అసంతృప్తి, బ్యాంకు రుణాలు అందకపోవడం, పెన్షన్ లబ్దిదారుల ఎంపికలో కిరికిరి, చీప్ లిక్కర్ తేవాలన్న ప్రయత్నాలు ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చాయని అంగీకరిస్తున్నారు. పైగా అధికారంలోకి వచ్చి 15 నెలలు అయినా, కొన్ని హామీల విషయంలో ఇంకా అడుగు ముందుకు పడలేదని, డబుల్ బెడ్ రూం ఇళ్లు, ఇందిరమ్మ బిల్లులు చెల్లించకపోవడం వంటి అంశాలు ఎన్నికల్లో ప్రభావితం చేసే అవకాశాలున్నాయని అంటున్నారు.

ఒకవేళ ఉపఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వస్తే, ప్రభుత్వ ప్రతిష్ట మరింత దిగజారడం ఖాయమని టీఆర్ఎస్ నేతలు భయపడిపోతున్నారట. అందుకే అభ్యర్ధులెవరనే దాని కంటే, ప్రతికూల అంశాలు ఏంటనే దానిపైనే టీఆర్ఎస్ లో చర్చ నడుస్తోందట. అసలు విపక్షాలు ఏఏ అంశాలపై ప్రధానంగా ఫోకస్ పెట్టాయి, వాటిని ఎలా ఎదుర్కోవాలనే దానిపై కసరత్తు చేస్తున్నారట. వరంగల్ పార్లమెంట్ స్థానంతోపాటు నారాయణఖేడ్ ఉపఎన్నిక విషయంలోనూ టీఆర్ఎస్ లో ఆందోళన చెందుతోందని, అయితే కిష్ణారెడ్డి కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు ఏకగ్రీవమయ్యేటట్లు అన్ని పార్టీలూ నిర్ణయం తీసుకుంటాయా? లేక పోటీ చేస్తారా అన్నది తేలాల్సి ఉందని అంటున్నారు.

అయితే టీఆర్ఎస్ నేతల దురుసు ప్రవర్తన, పార్టీ ఫిరాయింపుల వ్యవహారం, కేసీఆర్ ఒంటెద్దు పోకడలు, విద్యార్ధుల్లో, యువతలో ప్రభుత్వంపై పెరిగిన వ్యతిరేకత...తమకు కలిసొస్తాయని విపక్షాలు భావిస్తున్నాయి. టీఆర్ఎస్ సర్కార్ పై భ్రమలు తొలగిపోతున్నాయని, ఉప ఎన్నికల్లో కేసీఆర్ కు ప్రజలు షాకివ్వడం ఖాయమంటున్నారు. అయితే ప్రతిపక్షాలు అంచనా వేస్తున్నట్లు జరుగుతుందా? లేక ఉప ఎన్నికల గండం గట్టెక్కి...మరోసారి అందరికీ టీఆర్ఎస్ షాకిస్తుందో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu