నంద్యాల బైపోల్ తో...ఒకే దెబ్బకు రెండు పిట్టలు
posted on Sep 15, 2015 3:11PM

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకోవాలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. హోదా కోసం జరుగుతున్న పోరాటానికి నాయకత్వం వహించి క్రెడిట్ కొట్టేయాలనుకుంటున్న ఆయన... అందుకు అనువైన వాతావరణాన్ని సృష్టించుకొనే పనిలో పడ్డారు. ఇలాంటి సమయంలో ఏవైనా ఎన్నికలు జరిగితే, అధికార పార్టీకి కనువిప్పు కలిగేలా ప్రజాగ్రహం బయటపడుతుందని,అందుకు నంద్యాల ఉప ఎన్నికే సరైన ఆయుధమని జగన్ భావిస్తున్నారట.
ఈ నేపథ్యంలోనే నంద్యాల ఎంపీ స్థానానికి ఉపఎన్నిక జరగాలని జగన్ బలంగా కోరుకుంటున్నారట. ఫ్యాను గుర్తుపై గెలిచి, వారం తిరక్కుండానే టీడీపీ కండువా కప్పుకున్న ఎస్పీవై రెడ్డికి బుద్ధి చెప్పినట్లూ ఉంటుంది, అటు తెలుగుదేశం పార్టీకి వైసీపీ సత్తా చాటినంటూ ఉంటుందని లెక్కలేసుకుంటున్న జగన్, ఎలాగైనా ఎస్పీవై రెడ్డిపై అనర్హత వేటు పడేలా స్పీకర్ పై ఒత్తిడి పెంచాలని పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారట. ప్రస్తుత పరిస్థితుల్లో నంద్యాల ఉపఎన్నిక జరిగితే, మనమేంటో నిరూపించుకోవచ్చని, ప్రజల అటెన్షన్ ను
కూడా తమవైపు తిప్పుకోవచ్చని జగన్ భావిస్తున్నారట.
అయితే అరకు ఎంపీ కొత్తపల్లి గీత కూడా వైసీపీకి షాకిచ్చి...ఫ్యాన్ ను గాలికి వదిలేసినా, అధికారికంగా టీడీపీలో చేరలేదని, ఎస్పీవై రెడ్డి అయితే...గెలిచి వారం రోజులకే చంద్రబాబును కలిసి పార్టీలో చేరారని, దాంతో అనర్హత వేటు పడటం ఖాయమని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే పార్టీ ఫిరాయింపుల చట్టం కింద...ఎస్పీవై రెడ్డిపై ఫిర్యాదు చేసి, పదిహేను నెలలు దాటిపోతున్నా, స్పీకర్ ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంపై పార్టీ ఎంపీలతో జగన్ చర్చించారట.
ఎలాగైనా నంద్యాలలో బైపోల్ జరగాలని కోరుకుంటున్న జగన్... ఎస్పీవై రెడ్డిపై వేటు పడేలా స్పీకర్ పై ఒత్తిడి పెంచాలని పార్టీ నేతలకు సూచించారు పార్ఠీ ఫిరాయించిన ఎంపీల అనర్హత వేటుపై మొన్నటివరకూ పెద్దగా పట్టించుకోని జగన్...నంద్యాల ఎంపీపైనే ఫోకస్ పెట్టడానికి మరో కారణం కూడా ఉందంటున్నారు. నంద్యాల పార్లమెంట్ స్థానంలో వైసీపీకి పట్టుందని, ఒకవేళ ఉప ఎన్నిక జరిగినా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని, అందుకే జగన్ నంద్యాలను ఎంచుకున్నారని చెబుతున్నారు.