తెలంగాణ కంటే 11 రెట్లు ఏపీనే బెటర్
posted on Sep 15, 2015 1:18PM

నవ్యాంధ్రప్రదేశ్ మరో అరుదైన ఘనతను సాధించింది. రాష్ట్ర విభజనతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నా, భారతదేశంలో వ్యాపారాలకు అనువైన రాష్ట్రాల్లో మాత్రం రెండో స్థానం దక్కించుకుంది. హైదరాబాద్ లాంటి మహానగరం...ఆంధ్రప్రదేశ్ లో లేకపోయినా, పెట్టుబడులకు సెకంట్ బెస్ట్ ప్లేస్ అంటూ ప్రపంచ బ్యాంక్ తేల్చిచెప్పింది.పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విధానం, పరిశ్రమల సమాఖ్యలైన సీఐఐ, ఫిక్కీ, కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీతో కలిసి జాబితాను రూపొందించిన ప్రపంచ బ్యాంక్...రాష్ట్రాలకు ర్యాంకింగ్ లు ఇచ్చింది.
అయితే భారత్ లో వ్యాపారాలు చేయడం కష్టమని, అనేక సంస్కరణలు చేపట్టాల్సిన అవసరముందన్న వరల్డ్ బ్యాంక్... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా సంస్కరణలు అమలు చేయాలని సూచించింది. వ్యాపారాలకు అనుకూలమైన 182 దేశాల జాబితాలో భారత్ దాదాపు అట్టడుగున 142వ స్థానంలో ఉందన్న ప్రపంచ బ్యాంక్ డైరెక్టర్ రుహల్...నిర్మాణ అనుమతుల వంటి అంశాల్లోనైతే... ఏకంగా చివరి పది దేశాల్లో ఉందన్నారు.
ఇక టాప్ ఫైవ్ రాష్ట్రాల్లో నాలుగు బీజేపీ పాలిత రాష్ట్రాలు కాగా, రెండో స్థానంలో నిలిచిన ఏపీలో మిత్రపక్షం టీడీపీ అధికారంలో ఉండటం విశేషం, ఈ లిస్ట్ లో గుజరాత్ మొదటి టాప్ ప్లేస్ లోనూ, జార్ఖండ్ మూడో స్థానంలో నిలవగా, మిజోరాం, జమ్మూకాశ్మీర్, మేఘాలయ, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ లు అట్టడుగున ఉన్నాయి, అన్ని వనరులూ కలిగి హైదరాబాద్ రాజధానిగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం...13వ స్థానంతో సరిపెట్టుకుంది. అయితే పెట్టుబడులను ఆకర్షించడంలో రాష్ట్రాల మధ్య పోటీ వాతావరణాన్ని పెంచడానికే ఈ జాబితా రూపొందించినట్లు ప్రపంచ బ్యాంక్ ప్రకటించింది. ల్యాండ్ అలాట్ మెంట్, కార్మిక సంస్కరణలు,పర్యావరణ అనుమతులు, ఇన్ ఫ్రా వంటి మొత్తం 8 అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ జాబితా తయారు చేసినట్లు తెలిపారు.
పెట్టుబడులు, వ్యాపారాలకు అనుకూలమైన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కి రెండో స్థానం లభించడం శుభపరిణామమని, ప్రపంచ బ్యాంక్ నివేదిక నవ్యాంధ్ర అభివద్ధికి తోడ్పడుతుందని ప్రభుత్వ వర్గాలు సంతోషం వ్యక్తంచేస్తున్నాయి