ఇది చదివితే మీకు నిద్రపట్టకపోవచ్చు...
posted on May 10, 2015 10:55PM

మీరు మీ ఇంట్లో గుండెల మీద చేయి వేసుకుని హాయిగా నిద్రపోతున్నారా? అయితే ఈ వాస్తవాలు చదివిన తర్వాత మీకు నిద్రపట్టకపోవచ్చు. మనం గుండెల మీద చేతులు వేసుకుని హాయిగా నిద్రపోగలుగుతున్నామంటే ప్రధాన కారణం సరిహద్దుల్లో నిరంతరం పహారా కాస్తూ వుండే మన సైనికులే. అయితే మారిన పరిస్థితుల్లో వారి పహారా మనకు ఎంతవరకు రక్షణ కల్పిస్తుందో చెప్పలేని పరిస్థితి. ఈ విషయంలో మన సైనికుల శక్తి సామర్థ్యాల విషయంలో మనం ఎలాంటి సందేహాలు వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. వారి దగ్గర వున్న ఆయుధ సంపత్తి విషయంలోనే మనం భయపడాల్సి వస్తోంది. ఇప్పటికప్పుడు ఏ శత్రుదేశమో మన సరిహద్దులను దాటడానికి భారీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తే, మన సైనికులు వారిని కేవలం 10 రోజులు మాత్రమే నిలువరించగలరు. ఆ తర్వాత చేతులు ఎత్తేయడం మినహా వారు చేయగలింది ఏమీ వుండదు. గతంలో అయితే 40 రోజులపాటు ఏకధాటిగా యుద్ధం చేయడానికి సరిపడే ఆయుధ సామగ్రి సరిహద్దుల్లో సైనికుల దగ్గర వుండేది... ఇప్పుడు ఆ ఆయుధాల నిల్వ సామర్థ్యం 10 రోజులకు పడిపోయింది. ఈ విషయాన్ని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) వెలుగులోకి తెచ్చింది.
ఈ సమస్య భారత సైనికులను 1999 నుంచి వేధిస్తోంది. మందుగుండు నిల్వలను పెంచుకోవాలని అప్పటి నుంచి సైన్యం ప్రయత్నిస్తున్నా ఇప్పటి వరకు సైన్యానికి పూర్తిస్థాయి నిల్వలు సమకూరలేదు. ఇంతే కాకుండా, ఇప్పుడు మన సైన్యం దగ్గర ఉన్న చాలా ఆయుధాలు ఔట్ డేటెడ్ అయిపోయాయి. వాటిని ప్రస్తుతం ఉపయోగించే పరిస్థితులు లేవు. అలాగే అనేక ఆయుధాలు, మందుగుండు సామగ్రిని పేల్చడానికి ఉపయోగించే పరికరాలు రిపేరుకు వచ్చాయి. వేల కోట్ల రూపాయల ఖరీదైన ఈ పరికరాలకు రిపేర్ చేయించకపోవడం వల్ల అవన్నీ మూలన పడి వున్నాయి. ఇండియన్ ఆర్మీలో వున్న ఇలాంటి పరిస్థితులను తక్షణం సరిదిద్దాల్సిన అవసరం వుందని కాగ్ సూచించింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం హాయిగా నిద్రపోగలమా?