గవర్నర్ బదిలీపై చంద్రబాబు భిన్నాభిప్రాయం?

 

ఇంతకు ముందు గవర్నర్ నరసింహన్ పై తెదేపా నేతలు, మంత్రులు నిప్పులు కక్కడం, అందుకు కారణాలు కూడా అందరికీ తెలిసిందే. ఒకానొక సమయంలో కేంద్రం గవర్నర్ ని మార్చబోతోందని, కాదు..ఆయనే రాజినామాకు సిద్దపడ్డారని వార్తలు వినిపించాయి. కానీ రెండు తెలుగు రాష్ట్రాల సమస్యలు, రాజకీయ పరిస్థితుల గురించి మంచి అవగాహన ఉన్న కారణంగా కేంద్రం ఆయననే కొనసాగించదలచుకొన్నట్లు ఆ తరువాత స్పష్టమయింది.

 

బహుశః అదే విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ నిన్న కలిసినప్పుడు స్పష్టం చేసారో ఏమో తెలియదు కానీ ఆయన తరువాత మీడియాతో మాట్లాడుతూ గవర్నర్ మార్పుతో సమస్యలన్నీ పరిష్కారంకావని అన్నారు. కానీ సెక్షన్: 8 అమలు చేయాలని అలాగే రెండు రాష్ట్రాల మధ్య తలెత్తుతున్న సమస్యలు వివాదాల పరిష్కారానికి ఆయన మధ్యవర్తిత్వం వహించాలని కోరారు. కొన్ని రోజుల క్రితం గవర్నర్ నరసింహన్ని హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ అత్యవసరంగా డిల్లీకి పిలిపించుకొని ఆయనతో సమావేశమయినప్పుడు, వారు సెక్షన్: 8 అమలు గురించే చర్చించారని వార్తలు వచ్చేయి. కానీ ఆయన డిల్లీ నుండి తిరిగి వచ్చిచాలా రోజులే అయినప్పటికీ సెక్షన్: 8 అమలు గురించి ఎటువంటి ప్రయత్నమూ చేయలేదు. తెరాస నేతలెవరూ కూడా ఇప్పుడు దాని గురించి అసలు మాట్లాడకపోవడం గమనిస్తే దానిని ఆయన అమలు చేయబోవడం లేదనే విషయం అర్ధమవుతోంది. కనుక చంద్రబాబు నాయుడు దాని గురించి ఆయనని ఒత్తిడి చేసినా ఎటువంటి ప్రయోజనము ఉండకపోవచ్చును. కానీ ఇరు రాష్ట్రాల మధ్య తలెత్తుతున్న సమస్యల పరిష్కారానికి ఆయన చొరవ తీసుకోవాలని చంద్రబాబు నాయుడు చేసిన విజ్ఞప్తిని ఆయన పట్టించుకోకుండా ఉండలేరు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu