ప్రక్షాళన ఎందుకంట?

 

 

 

పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ భలే వెరైటీగా మాట్లాడుతూ వుంటాడు. అంతలోనే కామెడీ చేస్తుంటాడు. అంతలోనే సీరియస్ అయిపోతూ వుంటాడు. తెలంగాణ ఇస్తే తప్పేంటంటాడు.. అంతలోనే సమైక్యాంధ్ర అని నినాదిస్తాడు. కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నానంటాడు. మళ్ళీ తానే అధిష్ఠానాన్ని ఎదిరించేవాళ్ళని పార్టీలోంచి తరిమేస్తానంటాడు.

 

 

ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్టు.. ఆయనగారు సభ్యుడిగా వున్న కాంగ్రెస్ పార్టీనే ఒక విచిత్రమైన సంస్థ.. అందులో వున్న ఆయన విచిత్రంగా వుండక మరెలా వుంటారు? తాజాగా బొత్సగారికి కాంగ్రెస్ పార్టీలోనే వుంటూ అధిష్ఠానాన్ని విమర్శిస్తున్న వాళ్ళ మీద పీకలదాకా కోపం వచ్చేసింది. వెంటనే ఆయన అలాంటి వాళ్ళు 26 మందితో ఒక లిస్టు తయారు చేశారు. వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తానని హూంకరించారు. అలాంటి వాళ్ళందర్నీ పార్టీలోంచి తరిమేసి పార్టీని ప్రక్షాళనం చేస్తానని ప్రతిజ్ఞ చేసేశారు. అయితే రాజకీయ విమర్శకులు మాత్రం బొత్సకి అంత శ్రమ అవసరం లేదని సూచిస్తున్నారు.



త్వరలో కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రలో ఎలాగూ ఖాళీ అయిపోతోబోతోంది. ఇప్పటికే చాలామంది కాంగ్రెస్ నాయకులు పార్టీ మారిపోయారు. ఇంకా చాలా మంది కాంగ్రెస్‌కి గుడ్ బై చెప్పడానికి సిద్ధంగా వున్నారు. ఇంకా నెలా రెండు నెలలు ఆగితే సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి కార్యకర్త అనేవాడు కూడా మిగలకుండా ఖాళీ అయిపోతుంది. అప్పుడు సీమాంధ్రలోని పార్టీ ఆఫీసులన్నిటికీ తాళాలు వేసి ఆ తాళాలు సోనియా చేతిలో పెట్టవచ్చు కదా అని బొత్సకి సూచిస్తున్నారు. ఈ కొద్దికాలం భాగ్యానికి ప్రక్షాళన లాంటి పెద్దమాటలు ఉపయోగించడం అనవసరం అని సూచిస్తున్నారు.