English | Telugu
బిగ్‌బాస్ 'వీజే'త సన్నీకి దక్కింది ఎంత?
Updated : Dec 20, 2021
బిగ్‌బాస్ సీజన్ 5 మొత్తానికి ముగిసింది. ఈ సీజన్ లో గత రెండు మూడు వారాలుగా విజేత ఎవరన్నది ముందుగానే తెలిసిపోయింది. నవరసాలని పండించి.. అనుభవించిన వాడిదే పరిపూర్ణ జీవితం అంటారు. బిగ్‌బాస్ జర్నీలో సన్నీ ఆట తీరుని గమనిస్తే అదే కనిపించింది. అందుకే అతను విజేతగా నిలిచాడు. అంతే కాకుండా తన ప్రవర్తనతో కప్పు తో పాటు కోట్ల మంది హృదయాల్ని గెలుచుకున్నాడు. అంతే కాకుండా భారీ స్థాయిలో ప్రైజ్ మనీని కూడా సొంతం చేసుకున్నాడు.
గత సీజన్‌ల తో పోలిస్తే తాజా సీజన్ విజేతగా వీజే సన్నీ దక్కించుకుందే ఎక్కువగా కనిపిస్తోంది. ప్రైజ్ మనీ కింద 50 లక్షలతో పాటు సువర్ణభూమి వారి 300 గజాల స్థలం, టవీఎస్ స్పోర్ట్స్ బైక్.. అలాగే డైలీ ఇచ్చే రెమ్యునరేషన్ అంతా కలిపి చూస్తే భారీగానే సన్నీకి అందినట్టుగా తెలుస్తోంది. దాదాపుగా కోటికి మించే సన్నీకి అందినట్టుగా అర్థమవుతోంది. ఇలా ఇంత వరకు ఓ కంటెస్టెంట్ ఈ స్థాయిలో ప్రైజ్ మనీని అందుకున్న దాఖలాలు లేవు. టైమ్... మానవ ప్రయత్నం.. దానికి దైవం అండగా నిలిస్తే అనుకున్నది సాధించవచ్చని పక్కవారు ద్వేషిస్తున్నా...వారికి ప్రేమని పంచి వారి హృదయాల్ని గెలుచుకోవాలని బిగ్‌బాస్ వేదికగా వీజే సన్నీ నిరూపించాడు.
అందుకే 19 మంది కంటెస్టెంట్ లతో మొదలైన ఈ షోలో ఫైనల్ గా ఆల్ ఎమోషన్స్‌ని పండించిన వ్యక్తిగా నిలిచి సన్నీ విజేత అయ్యాడు. విజేతగా సన్నీని ప్రకటించిన వేళ అతనిలో వున్న చిన్న తనం బయటికి వచ్చి గెంతులేసింది. పక్కన నాగ్ సర్ వున్నాడన్న విషయాన్ని మరిచి తన్మయత్వంతో సాధించానన్న సంబరం సన్నీ కళ్లల్లో కనిపించింది. కప్పు ముఖ్యం బిగులూ.. అప్నా టైమ్ ఆయేగా ... మచ్చా.. అంటూ సన్నీ పలికిన మాటలే బిగ్‌బాస్ ఫైనల్ లో అక్షర సత్యాలుగా నిలవడం.. ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంది.