English | Telugu
లూజర్ అంటూ అభిమన్యుకు వేద దిమ్మదిరిగే షాక్
Updated : Apr 12, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `ఎన్నెన్నో జన్మల బంధం`. గత కొంత కాలంగా స్టార్ మా లో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటూ విజయవంతంగా ప్రసారం అవుతోంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9:30 గంటలకు ప్రసారం అవుతోంది. నిరంజన్, డెబ్జాని మోడక్ ప్రధాన జంటగా నటించారు. బేబీ మిన్ను నైనిక, ప్రణయ్ హనుమండ్ల, బెంగళూరు పద్మ, జీడిగుంట శ్రీధర్ కీలక పాత్రల్లో నటించారు. పాలకుర్తి సురేష్ దర్శకుడు.
గత కొన్ని వారాలుగా ఆకట్టుకుంటున్న ఈ సీరియల్ తాజాగా కీలక మలుపు తిరిగింది. ఎలాగైనా యష్ ని దెబ్బకొట్టాలని అభిమన్యు - మాళవిక ప్లాన్ ప్రకారం ఖుషీ తనకు పుట్టిన కూతురు కాదని యష్ కు చెప్పేస్తారు. అప్పటి నుంచి యష్ ఖుషీని తన కూతురిగా అంగీకరించలేక.. కాదన లేక నరకం అనుభవిస్తూ వుంటాడు. ఈ విషయం గమనించిన వేద .. యష్ ని నిలదీస్తుంది. తప్పతాగి మాళవిక బెడ్రూమ్ లో యష్ వీరంగం వేయడం..దాన్ని అడ్వాంటేజీగా తీసుకుని మాళవిక నానా మాటలు అనడంతో ఆగ్రహానికి లోనైన వేద ఏం జరుగుతోందో నాకు తెలియాలని పట్టుబడుతుంది. దీంతో యష్ తనతో అభిమన్యు అన్న మాటల్ని చెబుతాడు.
విషయం తెలిసి షాక్ అయిన వేద ఇక నుంచి యష్ కు భార్యగా అండగా వుండాలని నిర్ణయించుకుంటుంది. ఇక ఇద్దరు కలిసి ఇంటికి వస్తారు. బెడ్ పై ఖుషీ నిద్రపోతుంటే యష్ దీనంగా పాప వంక చూస్తూ నిలబడిపోతాడు. అది గమనించిన ఖుషీ లేచి ఎక్కడికి వెళ్లావు డాడీ అంటూ యష్ ని కౌగిలించుకుంటుంది. బెడ్ పై పడుకుని వేదనతో ఆలోచిస్తున్న యష్ కు వెళ్లి మంచినీళ్లు తెచ్చిస్తుంది. ఆ తరువాత యష్ పై పడుకుని నిద్రపోతుంది. కట్ చేస్తే.. యష్ ని వేదిస్తున్నామని పండగ చేసుకుంటున్న అభిమన్యు, మాళవికల ఇంటికి వెళ్లి వేద వారికి దిమ్మదిరిగే షాక్ ఇస్తుంది.
ఖుషీ తండ్రి యష్ అని నిరూపిస్తానని ఛాలెంజ్ చేస్తుంది. అది జరిగే పనికాదని హేళన చేస్తాడు అభిమన్యు.. చేసి చూపిస్తా లూజర్ అని వేద అనడంతో అభిమన్యు, మాళవిక ఒక్కసారిగా షాక్ అవుతారు. మంగళ వారం ఎపిసోడ్ ఎలా వుండోతోంది? యష్ తో కలిసి వేద వేసే ఎత్తులకు అభిమన్యు - మాళవిక చిత్తు అవుతారా? అన్నది చూడాల్సిందే.