English | Telugu
రాజమౌళి సార్.. గర్వంగా ఉంది.. రేణు దేశాయ్ ఎమోషనల్
Updated : Aug 19, 2023
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళిపై నటి, దర్శకురాలు.. పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి రేణు దేశాయ్ ప్రశంసల వర్షం కురిపించారు. తన సోషల్ మీడియా మాధ్యమంలో ఓ ఎమోషనల్ పోస్ట్ కూడా చేశారు. అసలామె అంతలా జక్కన్నను ఉద్దేశించి భావోద్వేగ పోస్ట్ చేయటం వెనుకున్న కారణమేంటి? అనే వివరాల్లోకి వెళితే, తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి బాహుబలి చిత్రంతో చాటారు రాజమౌళి. ఆ సినిమా ఏకంగా రూ.2000 కోట్లకు పైగానే వసూళ్లను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత మరోసారి RRRలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్ ను సాధించి మరింత గర్వాన్ని చేకూర్చారు. తాజాగా రేణు దేశాయ్ తన కొడుకు అకీరా నందన్ తో కలిసి నార్వేకు వెళ్లారు. అక్కడ స్టావెంజర్ నగరంలోని ఓ థియేటర్ లో బాహుబలి సినిమాను ప్రదర్శించారు. ఆ సినిమాకు రేణు, అకీరా కూడా వెళ్లారు. సినిమాను తెరకెక్కించిన విధానం దానికి వచ్చిన రెస్పాన్స్ చూసి రేణు దేశాయ్ ఎమోషనల్ అయ్యారు.
తన భావోద్వేగాన్ని ఆమె నోట్ రూపంలో రాసి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. "రాజమౌళి సర్.. ఆడియెన్స్ కోసం మీరు సృష్టించిన అద్భుతాన్ని వర్ణించటానికి నోట మాట రావటం లేదు. స్టావెంజర్ లో బాహుబలి సినిమా చూసిన అనుభూతి గురించి ఎంత చెప్పినా తక్కువే. నాకు మాటలు రావటం లేదు. ఓ భారతీయ సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు దక్కటం ఎంతో గర్వంగా ఉంది. ఈ సినిమాను చూడటానికి అకీరా నందన్ ను ప్రత్యేకంగా ఆహ్వానించిన శోభు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు'' అని ఆమె తన ఆనందాన్ని, భావోద్వేగాన్ని పేర్కొన్నారు.
ప్రభాస్, అనుష్క, రమ్యకృష్ణ, సత్యరాజ్, రానా దగ్గుబాటి తదితరులు నటించిన బాహుబలి సినిమా రెండు భాగాలుగా రూపొందింది. బాహుబలి పార్ట్ 1 2015లో విడుదల కాగా.. బాహుబలి పార్ట్ 2 2017లో రిలీజైంది. రూ.400 కోట్లకు పైగా ఖర్చు పెట్టి ఈ సినిమాను శోభు యార్టగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించారు.