English | Telugu

అఖండ2 టికెట్‌ ధరలపై తెలంగాణ ప్రభుత్వం జీ.ఓ.. పెంచిన టికెట్‌ రేట్లు ఇవే!

గాడ్‌ ఆఫ్‌ మాసెస్‌ నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన 'అఖండ2 తాండవం' చిత్రం ఎట్టకేలకు డిసెంబర్‌ 12న థియేటర్లలోకి రాబోతోంది. గత కొన్ని రోజులుగా ఈ సినిమా విడుదలపై నెలకొన్న సస్పెన్స్‌ తొలగిపోయి ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌కి సిద్ధమైంది. డిసెంబర్‌ 11న ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్స్‌ పడనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం 'అఖండ2' ప్రీమియర్స్‌, టికెట్‌ ధరల పెంపుకు సంబంధించిన జీ.ఓ.ను విడుదల చేసింది.


డిసెంబర్‌ 11 రాత్రి 9 గంటలకు ప్రీమియర్స్‌ ప్రదర్శించేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అలాగే టికెట్ల ధరలను ఏమేరకు పెంచుకోవచ్చు అనే విషయాలను కూడా అధికారికంగా ప్రకటించింది. డిసెంబర్‌ 12 నుంచి 14వ తేదీ వరకు అంటే మూడు రోజులపాటు పెంచిన టికెట్‌ ధరలు అమలులో ఉంటాయి. ప్రీమియర్స్‌కి సంబంధించిన టికెట్‌ ధరను రూ.600గా నిర్ణయించింది. సింగిల్‌ థియేటర్లు, మల్టీప్లెక్స్‌లలో పెంచిన టికెట్‌ ధరలను కూడా ప్రకటించారు. మల్టీప్లెక్స్‌లలో రూ.100 రూపాయలు, సింగిల్‌ స్క్రీన్స్‌లో రూ.50లు పెంచుకునే వెసులుబాటు కల్పించారు.


తెలంగాణ ప్రభుత్వం ముందుగా సూచించిన విధంగా పెంచిన ధరలకు సంబంధించిన మొత్తంలో 20 శాతం సినీ కార్మికుల సంక్షేమానికి వినియోగించాలని జీ.ఓ.లో పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఫిలిం డెవలప్‌ కార్పొరేషన్‌ ఒక ప్రత్యేక ఖాతాను తెరవనుంది. లేబర్‌ కమిషనర్‌తో కలిసి ఎఫ్‌డిసి ఈ సెపరేట్‌ ఎకౌంట్‌ను ఆపరేట్‌ చేస్తారని ప్రకటించారు.