English | Telugu

ప్ర‌కాశ్‌రాజ్‌ను ఎస్వీ రంగారావుతో పోల్చిన రామ్‌చ‌ర‌ణ్‌!

ప్ర‌కాశ్‌రాజ్‌ను ఎస్వీ రంగారావుతో పోల్చిన రామ్‌చ‌ర‌ణ్‌!

 

నేడు దేశంలోని ప్ర‌తిభావంతులైన న‌టుల్లో ప్ర‌కాశ్‌రాజ్ ఒక‌ర‌ని అంద‌రూ ఒప్పుకుంటారు. ఎలాంటి పాత్ర‌నైనా త‌న న‌ట‌న‌తో ఎలివేట్ చేసే ఆర్టిస్టుగా ఆయ‌న పేరు తెచ్చుకున్నారు. ఏ పాత్ర‌కు ఓవ‌ర్ యాక్టింగ్ చేయాలో, ఏ క్యారెక్ట‌ర్‌ను అండ‌ర్ యాక్టింగ్‌తో మెప్పించాలో ఆయ‌న‌కు బాగా తెలుసు. అలాంటి ప్ర‌కాశ్‌రాజ్‌ను ఈ కాల‌పు య‌స్వీ రంగారావుగా అభివ‌ర్ణించాడు రామ్‌చ‌ర‌ణ్‌. తెలుగు సినిమా గ‌ర్వించ‌ద‌గ్గ న‌టుడిగా ఎస్వీఆర్ కీర్తి ప్ర‌తిష్ఠ‌లు అసామాన్యం. 'న‌ర్త‌న‌శాల‌'లో కీచ‌కుడిగా ఆయ‌న ప్ర‌ద‌ర్శించిన అభిన‌యం ప్ర‌పంచ ఖ్యాతి తెచ్చిపెట్టింది. ఇటు ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌నైనా, అటు సాత్విక పాత్ర‌నైనా సునాయాసంగా, సులువుగా అభినయించేయ‌డం ఆయ‌న‌కే చెల్లు. ఆయ‌న న‌ట‌న‌లో తెచ్చిపెట్టుకున్న కృత్రిమ‌త్వం క‌నిపించ‌దు. అందుకే మ‌హాన‌టుడిగా, విశ్వ‌న‌ట చ‌క్ర‌వ‌ర్తిగా గొప్ప పేరును ఎస్వీఆర్ సంపాదించుకున్నారు. అలాంటి నటుడితో ఎవ‌రినీ పోల్చ‌లేం. కానీ ప్ర‌కాశ్‌రాజ్‌ను ఆయ‌న‌తో పోల్చాడు చ‌ర‌ణ్‌. 2014లో వ‌చ్చిన 'గోవిందుడు అంద‌రి వాడేలే' సినిమాలో ప్ర‌కాశ్‌రాజ్‌, రామ్‌చ‌ర‌ణ్ తాతామ‌న‌వ‌ళ్లుగా న‌టించారు. ఆ సంద‌ర్భంలోనే ప్రకాశ్‌రాజ్‌ను ఎస్వీఆర్‌తో చ‌ర‌ణ్ పోల్చాడు.

నిజానికి కృష్ణ‌వంశీ డైరెక్ట్ చేసిన 'గోవిందుడు అంద‌రి వాడేలే' సినిమాకు సంబంధించి ఓ కాంట్ర‌వ‌ర్సీ ఉంది. ఆ సినిమాలో మొద‌ట తాత పాత్ర‌కు త‌మిళ న‌టుడు రాజ్‌కిర‌ణ్‌ను తీసుకున్నారు. ఓ షెడ్యూల్ అంతా ఆయ‌న‌తోటే తీశారు. కానీ ర‌ష్ చూశాక చిరంజీవికి తాత పాత్ర‌లో రాజ్‌కిర‌ణ్ అంత‌గా రాణించ‌లేద‌ని అనిపించింది. ఆ పాత్ర‌కు ప్ర‌కాశ్‌రాజ్ అయితే బాగా ఎలివేష‌న్ వ‌స్తుంద‌ని ఆయ‌న భావించారు. ఇదే విష‌యాన్ని కృష్ణ‌వంశీతో పంచుకోవ‌డంతో, ఆయ‌న కూడా స‌రేన‌ని, అప్ప‌టిక‌ప్పుడు డెసిష‌న్ తీసుకొని ప్ర‌కాశ్‌రాజ్‌ను తెచ్చుకున్నారు. దీనిపై ఆ త‌ర్వాత రాజ్‌కిర‌ణ్ త‌న ఆవేద‌న‌ను వ్య‌క్తం చేయ‌డం, త‌న‌కు క‌నీసం చెప్ప‌కుండా ప్ర‌కాశ్‌రాజ్‌ను తీసుకున్నార‌ని ఆరోపించ‌డం మ‌న‌కు తెలుసు.

"రాజ్‌కిర‌ణ్ బ‌దులు ప్ర‌కాశ్‌రాజ్ రావ‌డం వ‌ల్ల 'ఫీల్ ఆఫ్ ద ఫిల్మ్' పూర్తిగా మారిపోయింది. ప్ర‌కాశ్ రావ‌డం వ‌ల్ల ఇంకా ఎన్నో సీన్లు చెయ్య‌డానికి స్కోప్ వ‌చ్చింది. కొత్త సీన్లు రాశాం. ఆయ‌న కూడా చాలా ఇన్‌పుట్స్ ఇచ్చారు. సినిమా మొద‌టి షెడ్యూల్ అయిన‌ప్పుడు నాన్న‌గారు, నేను ర‌షెస్ చూశాం. సినిమాతో స‌రిగా క‌నెక్ట్ కాలేక‌పోయాం. రాజ్‌కిర‌ణ్ కూడా చాలా పెద్ద న‌టుడు. కానీ ఎక్క‌డో మ‌న‌కు క‌నెక్ట‌వ‌లేదు. అందుకే ఆయ‌న బ‌దులు ప్ర‌కాశ్‌రాజ్ అయితే బాగుంటుంద‌ని అనుకొని ఆయ‌న‌ను అప్రోచ్ అయ్యాం. ఆ కాలంలో ఎస్వీ రంగారావు ఎలా ఉండేవారో, ఈ కాలానికి ప్ర‌కాశ్‌రాజ్ అలా ఉన్నార‌నేది నో డౌట్‌. ఆయ‌న‌ను మ‌నం స‌రిగా వాడుకోలేదు. ఆయ‌న న‌ట‌నా సామ‌ర్థ్యం ఏమిటో ఈ సినిమాతో తెలుస్తుంది." అని అప్ప‌టి ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పాడు రామ్‌చ‌ర‌ణ్‌. 

అయితే రాజ్‌కిర‌ణ్ బ‌దులు ప్ర‌కాశ్‌రాజ్ వ‌చ్చినా 'గోవిందుడు అంద‌రి వాడేలే' సినిమా ఆశించిన రీతిలో ఆడ‌లేదనేది వేరే విష‌యం.