English | Telugu

ఆర్మీ ఆఫీస‌ర్లు కూడా సోను సూద్‌నే న‌మ్ముకుంటున్నారు!

గ‌త ఏడాది కొవిడ్ మ‌హ‌మ్మారి వ‌ల్ల దేశంలో ఏర్ప‌డిన సంక్షోభంతో జ‌న జీవితం అస్త‌వ్య‌స్త‌మైంది. అప్ప‌ట్నుంచీ క‌ష్టాల్లో ఉన్న‌వారికి ఆప‌ద్బాంధ‌వుడిలా మారాడు న‌టుడు సోను సూద్‌. దేశ‌వ్యాప్తంగా ఎవ‌రు ఏ క‌ష్టంలో ఉన్నార‌న్నా అక్క‌డ‌కు త‌న బృందాన్ని పంపిస్తూ, వారి క‌ష్టాలు తీరుస్తూ వ‌స్తున్నాడు. దీంతో సోను సూద్‌ను చూసి నేర్చుకోమంటూ సినిమా స్టార్ల‌ను, టాప్ పొలిటీషియ‌న్ల‌నూ జ‌నం విమ‌ర్శిస్తూ వ‌స్తున్నారు. నిజం చెప్పాలంటే ఇప్పుడు ప్ర‌భుత్వాల క‌న్నా సోను సూద్‌ను న‌మ్ముకోవ‌డం మంచిద‌ని చాలా మంది భావిస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది.

తాజాగా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన ఓ లెట‌ర్ దీనికి నిద‌ర్శ‌నం. కొవిడ్‌-19 ఫెసిలిటీ కోసం సామ‌గ్రి కావాలంటూ సోను సూద్‌ను రిక్వెస్ట్ చేస్తూ జైస‌ల్మేర్ (రాజ‌స్థాన్‌) లోని ఒక ఇన్‌ఫాంట్రీ బెటాలియ‌న్‌కు చెందిన క‌మాండింగ్ ఆఫీస‌ర్ రాసిన లెట‌ర్ అది. అయితే ఆ ఉదంతం ఆర్మీలోని సీనియ‌ర్ ఆఫీస‌ర్ల‌కు నచ్చిన‌ట్లు లేదు.

మే 13న రాసిన‌ట్లున్న ఆ ఉత్త‌రంలో జైస‌ల్మేర్ మిలిట‌రీ స్టేష‌న్‌లో ఒక 200 బెడ్ల కొవిడ్ కేర్ సెంట‌ర్ సౌక‌ర్యాన్ని ఆర్మీ ఏర్పాటు చేస్తోంద‌ని ఆ క‌మాండింగ్ ఆఫీస‌ర్ వెల్ల‌డించారు. ఆ సెంట‌ర్‌కు నాలుగు ఐసీయు బెడ్లు, ప‌ది ఆక్సిజ‌న్ కాన్స‌న్‌ట్రేట‌ర్స్‌, ప‌ది జంబో ఆక్సిజ‌న్ సిలిండ‌ర్స్‌, ఒక ఎక్స్‌-రే మెషీన్‌, రెండు 15కెవి జ‌న‌రేట‌ర్ సెట్లు అవ‌స‌ర‌మ‌ని సోను సూద్‌కు ఆయ‌న చెప్పారు.

ఆ ఉత్త‌రం సోను సూద్‌కు రాసిన‌దేన‌ని న్యూఢిల్లీలోని ఆర్మీ హెడ్‌క్వార్ట‌ర్స్ కు చెందిన ఓ సీనియ‌ర్ ఆఫీస‌ర్ ధ్రువీక‌రించారు. అయితే అత్యుత్సాహంతోనే ఆ లెట‌ర్‌ను ఆ కమాండింగ్ ఆఫీస‌ర్ రాసిన‌ట్లు క‌నిపిస్తోంద‌ని అన్నారు.