English | Telugu

అఫిషియ‌ల్‌.. కంగ‌న 'సీతావ‌తారం'!

కంగ‌నా ర‌నౌత్ టైటిల్ రోల్ చేసిన 'త‌లైవి' ఇటీవ‌లే థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. ఆ మూవీలో త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి దివంగ‌త జ‌య‌ల‌లిత పాత్ర‌ను ఆమె చేశారు. కాగా ఆమె త్వ‌ర‌లో సీతాదేవి పాత్ర‌ను పోషించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. అలౌకిక్ దేశాయ్ డైరెక్ట్ చేసే 'సీత‌.. ది ఇన్‌కార్నేష‌న్' (సీతావ‌తారం) మూవీలో ఆమె టైటిల్ రోల్ చేయ‌నున్నారు. ఈ విష‌యాన్ని నిర్మాత స‌లోనీ శ‌ర్మ ఓ స్టేట్‌మెంట్ ద్వారా ధ్రువీక‌రించారు. "మా వీఎఫ్ఎక్స్ మాగ్న‌మ్ ఓప‌స్ 'ది ఇన్‌కార్నేష‌న్ సీత‌'లో న‌టించేందుకు మిస్ కంగ‌నా ర‌నౌత్‌ను ఆహ్వానించ‌డానికి ఒక స్త్రీగా చాలా ఆనందిస్తున్నాను. భ‌య‌మెరుగ‌ని, సాహ‌సోపేత‌మైన భార‌తీయ స్త్రీ ఆత్మ‌, సారాన్ని కంగ‌న సూచిస్తుంటారు. ప్ర‌తి విష‌యంలోనూ స‌మాన‌త్వాన్ని సెల‌బ్రేట్ చేయ‌డానికి మ‌నం అడుగులు వేయాల్సిన స‌మ‌యం వ‌చ్చింది." అని ఆమె వెల్ల‌డించారు.

ఈ సినిమాకు వి. విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ స్క్రిప్టును అందిస్తున్నారు. కంగ‌న‌కు సీత పాత్ర ల‌భించ‌డానికి కార‌ణం విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ అని స‌మాచారం. 'త‌లైవి' పాత్ర సైతం ఆయ‌న‌వ‌ల్లే ఆమెకు ద‌క్కింద‌నే విష‌యం ఇక్క‌డ ప్ర‌స్తావ‌నార్హం. రామాయ‌ణంలో సీత క‌థ మొత్తం ఈ సినిమాలో ఉంటుంద‌ని తెలుస్తోంది.

కంగ‌న ఇటీవ‌ల త‌న 'ఏక్ నిరంజన్' హీరో ప్ర‌భాస్‌తో మ‌ళ్లీ క‌లిసి న‌టించాల‌నే కోరిక‌ను వెల్ల‌డించారు. దాంతో సీతావ‌తారంలో రాముని పాత్ర‌కు మ‌రోసారి ప్ర‌భాస్‌ను సంప్ర‌దించ‌నున్న‌ట్లు వినిపిస్తోంది. ఇప్ప‌టికే ఓం రౌత్ సినిమా 'ఆదిపురుష్‌'లో శ్రీ‌రామునిగా ప్ర‌భాస్ న‌టిస్తున్నాడు. 'సీతావ‌తారం'లోనూ ఆ పాత్ర‌ను న‌టించ‌డానికి ఆయ‌న ఒప్పుకుంటే, చాలా కాలం త‌ర్వాత ఆ జంట ప్రేక్ష‌కుల‌కు క‌న్నుల‌పంట అవుతుంది.