English | Telugu

చరణ్‌ కారును వెంబడించిన అభిమానులు.. షాక్‌ ఇచ్చిన చెర్రీ!

తమ అభిమాన తారలను కలుసుకోవాలని, వారితో మాట్లాడాలని, కలిసి ఫోటోలు దిగాలని కోరుకోవడం అభిమానులకు సర్వసాధారణం. ఫంక్షన్స్‌లో కనిపించినా లేదా బహిరంగ ప్రదేశాల్లో కనబడినా అభిమానులు సెలబ్రిటీలను ఇబ్బంది పెట్టడం మనం చూస్తుంటాం. అభిమానులను కలుసుకోవడం తారలకు కూడా ఆనందాన్నిచ్చే అంశమే. అయితే కొన్ని సందర్భాల్లో అభిమానుల అత్యుత్సాహం వారికి ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. అలాంటి అనుభవమే ఇటీవల రామ్‌చరణ్‌కి ఎదురైంది. అభిమానుల కోసం కొంత సమయం కేటాయించాల్సి వచ్చింది.

రామ్‌చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన తాజా షెడ్యూల్‌ హైదరాబాద్‌ శివారులోని ఇస్నాపూర్‌లో జరుగుతోంది. ఈ విషయం తెలుసుకున్న రామ్‌చరణ్‌ అభిమానులు అతన్ని కలుసుకోవడం కోసం ప్రయత్నించారు. షూటింగ్‌ పూర్తయిన తర్వాత చరణ్‌ బయటికి వచ్చే సమయం కోసం ఎదురు చూశారు. చరణ్‌ బయటికి రాగానే అతని కారును బైక్‌లపై వెంబడిరచారు. తన కారును ఫ్యాన్స్‌ ఫాలో అవుతున్నారని తెలుసుకున్న చరణ్‌ విండో ఓపెన్‌ చేసి వారిని విష్‌ చేశాడు. డ్రైవింగ్‌ విషయంలో జాగ్రత్తగా ఉండమని కోరాడు. కొద్దిదూరం అలాగే వెళ్లిన తర్వాత కారును పక్కకు ఆపి అభిమానులను కలుసుకున్నాడు. వారిని విష్‌ చేసి అక్కడి నుంచి బయలుదేరి క్షేమంగా ఇంటికి చేరుకోవాలని కోరాడు చరణ్‌.

తమ అభిమాన హీరో కారు ఆపి తమను కలుసుకోవడంతో అభిమానులు షాక్‌ అయ్యారు. సాధారణంగా హీరోలు ఆ సందర్భంలో కారు స్పీడ్‌ని పెంచి వారికి అందకుండా వెళ్లిపోతుంటారు. కానీ, చరణ్‌ అలా చేయకుండా అభిమానుల పట్ల ఎంతో హుందా ప్రవర్తించడం పట్ల నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. చరణ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చిరంజీవి కూడా అభిమానుల పట్ల అంతే ప్రేమగా ఉండేవారని గుర్తు చేసుకుంటున్నారు. మరి కొంతమంది.. అలా కారును వెంబడిరచడం సరికాదని, వారి ప్రైవసీకి భంగం కలిగించడం సరైన పద్ధతి కాదని అంటున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ మీడియలో వైరల్‌గా మారింది.