English | Telugu

ఒకే వేదికపై జనార్దన మహర్షి రచించిన నాలుగు పుస్తకాల ఆవిష్కరణ!

ప్రముఖ రచయిత– దర్శకుడు జనార్దన మహర్షి రచించిన నాలుగు పుస్తకాలను హైదరాబాద్‌లో గురువారం విడుదల చేశారు. ప్రముఖ దర్శకుడు, జాతీయ అవార్డు గ్రహీత సతీష్‌ వేగేశ్న ‘‘పరిమళాదేవి’’ పుస్తకాన్ని విడుదల చేయగా, ‘‘శుభలక్ష్మీ’’ పుస్తకాన్ని ప్రముఖ జర్నలిస్ట్ ప్రభు విడుదల చేశారు. యాంకర్‌గా మంచి పేరున్న అంజలి ‘‘సంస్కృత’’ పుస్తకాన్ని, ప్రఖ్యాత జర్నలిస్ట్‌– సినిమా పరిశోధకుడు రెంటాల జయదేవ ‘‘ సహస్త్ర’’ పుస్తకాన్ని విడుదల చేసి తమ అభినందనలను తెలియచేశారు. (Janardhana Maharshi)

పుస్తకాల విడుదల అనంతరం అతిథులందరూ మాట్లాడుతూ– ‘‘ఒక పుస్తకం రాసి దాన్ని బయటకు తీసుకురావటమే గగనం అవుతున్న ఈ రోజుల్లో నాలుగు పుస్తకాలను ఒకేసారి తీసుకువస్తున్న జనార్దనమహర్షి గారికి అభినందనలు’’ అన్నారు.

జనార్దనమహర్షి మాట్లాడుతూ– ‘‘ఇది ఎంతో శుభపరిణామం. పుస్తకాలను సపోర్టు చేయటానికి వచ్చిన జర్నలిస్ట్‌ మిత్రులందరూ నాకే కాకుండా నా తర్వాత వచ్చే రచయితలకు కూడా ఇలానే మీ సహాయ సహకారాలను, అక్షరాల మీద ప్రేమను పంచిపెడితే భవిష్యత్‌లో మరిన్ని పుస్తకాలు విడుదలవుతాయి. నేను రచించిన ‘వెన్నముద్దలు’ పుస్తకం పద్నాలుగవ ముద్రణకు వచ్చింది. గతంలో నేను రాసిన 16 పుస్తకాలతో పాటు ఈ నాలుగు పుస్తకాలు కలిపి మొత్తం 20 పుస్తకాలను ప్రచురించాను. ఈ పుస్తకాలు ఇంత గొప్పగా రూపుదిద్దుకోవటానికి కారణమైన ఆన్వీక్షికి సంపాదకులు వెంకట్‌ సిద్ధారెడ్డి, మహి బెజవాడలకు కృతజ్ఞతలు. వారు పాఠకలోకానికి చేస్తున్న సేవ చిరస్థాయిగా నిలిచిపోతుంది’’ అన్నారు.

ఈ నెల 19నుండి హైదరాబాద్‌లో జరిగే బుక్‌ ఎగ్జిబిషన్‌లోనే కాకుండా తన పుస్తకాలన్నీ ఆన్‌లైన్‌లో కూడా అందుబాటులో ఉంటాయని మహర్షి తెలిపారు.