English | Telugu

నాకు మెగాస్టార్‌ అనే బిరుదు వచ్చిందీ అంటే.. అది ఆయన వల్లే!

‘నేను స్టార్‌గా ఎదగడానికి యండమూరి రచనలు ఎంతగానో ఉపయోగపడ్డాయి, నా సినిమా విజయాల్లో సింహభాగం యండమూరి రచనలదే. ఆయన సినిమాలతోనే నాకు మెగాస్టార్‌ బిరుదు వచ్చింది. ఆయన నా బయోగ్రఫీ రాస్తానని చెప్పడం చాలా సంతోషాన్ని కలిగించింది’ ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌ గురించి మెగాస్టార్‌ చిరంజీవి చెప్పిన మాటలివి.

ఇటీవల విశాఖలో లోక్‌నాయక్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ 28వ పుణ్యతిథి, ఎఎన్నార్‌ శత జయంతి కార్యక్రమం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మెగాస్టార్‌ చిరంజీవి హాజరయ్యారు. ఈ సందర్భంగా యండమూరి వీరేంద్రనాథ్‌ను ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌ తదితరులతో కలిసి సత్కరించి సాహిత్య పురస్కారం, రూ.2 లక్షల చెక్కును అందించారు. ఈ సందర్భంగా చిరంజీవి చేసిన ప్రసంగంలో యండమూరి వీరేంద్రనాథ్‌ గురించి, ఆయన రచనలతో తను చేసిన సినిమాల గురించి ప్రస్తావించారు.

‘‘నేను స్టార్‌గా ఎదగడానికి యండమూరి రచనలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఆయన సినిమాలతోనే నాకు మెగాస్టార్‌ బిరుదు వచ్చింది. ‘అభిలాష’ నవల గురించి నాకు మొదట మా అమ్మ చెప్పింది. అదే నవలను కేఎస్‌ రామారావుగారు నన్ను హీరోగా పెట్టి సినిమా తీశారు. కోదండరామిరెడ్డి దర్శకత్వం, ఇళయరాజా పాటలు మంచి పేరు తెచ్చాయి. కెరీర్‌లో నేను సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకోవడానికి ఉపయోగపడ్డాయి. ‘ఛాలెంజ్‌’ ఎంతో మంది యువతను ప్రభావితం చేసింది. నా సినిమా విజయాల్లో సింహభాగం యండమూరి వీరేంద్రనాథ్‌ రచనలదే. ఆయన నా బయోగ్రఫీ రాస్తాననడం నిజంగా సంతోషంగా ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమకు రెండు కళ్లుగా భావించే ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌ నాకు గురు సమానులు. వారితో కలిసి పనిచేయడం నా అదృష్టం. ‘తిరుగులేని మనిషి’ చిత్రంలో రామారావుగారితో కలిసి నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమా షూటింగ్‌లో ఫైట్‌ సీన్స్‌ను నేనే స్వయంగా చేస్తుంటే ఆయన నాకు ఓ సూచన చేశారు. ‘ఆర్టిస్ట్‌లది ఎంతో విలువైన జీవితం. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా జరగరానిది జరిగితే నష్టపోయేది నిర్మాతే’ అని అన్నారు. అప్పుడు ఉడుకు రక్తం కావడంతో డూప్‌ లేకుండా రియల్‌గా చేసే బాగుంటుందనే ఉత్సాహం ఉండేది. కానీ, ఆ తర్వాత సంవత్సరమే ‘సంఘర్షణ’ చిత్రం షూటింగ్‌లో గాయపడ్డాను. ఆరునెలలు ఏ షూటింగ్‌ చేయకుండా రెస్ట్‌ తీసుకోవాల్సి వచ్చింది. పెద్దలు ఏది చెప్పినా మన మంచి కోసమే ఆలోచించి చెబుతారని నాకు అప్పుడు అర్థమైంది. ఇక ఏయన్నార్‌ చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. ఏదైనా సరదాగా మాట్లాడేవారు. తనలోని బలహీనతలు ఎలా బలాలుగా మార్చుకున్నారో చెప్పారు. అలా వాళ్లిద్దరి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను’’ అని చిరంజీవి అన్నారు.