English | Telugu
ఉదయ్ కిరణ్ గురించి సంచలన విషయాలు చెప్పిన కౌశల్!
Updated : Jul 4, 2025
అప్పట్లో ఉదయ్ కిరణ్ ఓ సంచలనం. 'చిత్రం', 'నువ్వు నేను', 'మనసంతా నువ్వే' వంటి హ్యాట్రిక్ హిట్స్ తో కెరీర్ ప్రారంభించి.. యూత్ లో తిరుగులేని క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆ స్థాయి విజయాలను చూడనప్పటికీ.. పలు సినిమాల్లో నటించి.. హీరోగా తనదైన ముద్ర వేశాడు. అలాంటి ఉదయ్ కిరణ్.. 2014 లో ఆత్మహత్య చేసుకొని అందరికీ షాక్ ఇచ్చాడు. ఉదయ్ కిరణ్ మరణించి పదేళ్లు దాటిపోయినప్పటికీ.. అభిమానులు, సినీ పరిశ్రమలో ఆయన స్నేహితులు ఎప్పుడూ తలచుకుంటూనే ఉంటారు. తాజాగా బిగ్ బాస్ ఫేమ్ కౌశల్.. ఉదయ్ కిరణ్ తో తనకున్న అనుబంధం గురించి తెలుగువన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా రూపొందిన 'కన్నప్ప'లో కౌశల్ కూడా నటించాడు. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తెలుగువన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉదయ్ కిరణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు కౌశల్. "చిత్రం సినిమా రాకముందు నుంచే నాకు ఉదయ్ కిరణ్ తో పరిచయముంది. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి ఆ స్థాయికి వెళ్ళడం మామూలు విషయం కాదు. అందుకోసం ఉదయ్ ఎంతో కష్టపడ్డాడు. ఉదయ్ హీరోగా చేసిన చాలా సినిమాల్లో నేను నటించాను. చాలా మంచి వ్యక్తి. ఈ మాట అనకూడదు.. కానీ, అలాంటి మంచి వ్యక్తి.. ఇలాంటి సమాజంలో లేకపోవడమే మంచిది అనిపిస్తుంది. ఒక మనిషి జీవితంలో పైకి వెళ్తున్నా, ఏదైనా సాధిస్తున్నా కిందకి లాగడానికి ప్రయత్నిస్తారు. ఒక మనిషి ఎదుగుతుంటే హింసించి, డౌన్ చేయడానికి చూస్తారు." అంటూ కౌశల్ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు.