English | Telugu

నీకే ఎందుకు ఇలా.. తమ్ముడు అసలు తేడా ఎక్కడ ఉంది  

నితిన్ ఈ రోజు 'తమ్ముడు' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 'దిల్ రాజు' లాంటి ఎంతో అనుభవమున్న వ్యక్తి తమ్ముడికి నిర్మాత కావడం, ఏంసిఏ, వకీల్ సాబ్ వంటి హిట్ సినిమాలని తెరకెక్కించిన 'వేణు శ్రీరామ్' దర్శకుడు కావడంతో తమ్ముడు హిట్ అవుతుందని అభిమానులతో పాటు ప్రేక్షకులు భావించారు. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచి నితిన్ వరుస ప్లాప్ లకి 'ముగింపుని ఇవ్వకలేకపోయింది.

తెలుగు సినిమా పరిశ్రమతో 'నితిన్' కి ఉన్న అనుబంధం రెండు దశాబ్డలపై మాటే. 2003 లో 'తేజ' దర్శకత్వంలో వచ్చిన 'జయం' తో తెలుగు తెరకి పరిచయమయ్యాడు. తొలి సినిమాతోనే ఘన విజయాన్ని అందుకోవడమే కాకుండా, మంచి నటుడుగా కూడా ప్రేక్షకుల దృష్టిలో ప్రత్యేక పొందాడు. ఆ తర్వాత 'వినాయక్' దర్శకత్వంలో వచ్చిన 'దిల్' తో మరో భారీ విజయాన్ని అందుకొని యాక్షన్, లవ్, సెంటిమెంట్,డాన్స్ లలో తిరుగులేదని నిరూపించాడు. కానీ ఆ వెంటనే 'దశరధ్' దర్శకత్వంలో వచ్చిన 'సంబరం'తో తొలి ప్లాప్ ని అందుకున్నాడు. ఆ ప్లాప్ ని మర్చిపోయేలా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'సై' సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. దీంతో నితిన్ అగ్ర హీరోగా మారడానికి ఎంతో సమయం లేదని అందరు భావించారు. కానీ అనూహ్యంగా 'సై' మూవీ తర్వాత సుమారు పన్నెండు సినిమాలు ప్లాప్ అయ్యాయి. ఆ ప్లేస్ లో ఇంకో యువ హీరో ఉండి ఉంటే కనుమరుగై పోయేవాడు.

కానీ నితిన్ కి ప్రేక్షకులని థియేటర్ కి రప్పించగలిగే సత్తా ఉంది. అందుకే బాగా ఆలోచించి 2012 లో 'ఇష్క్' తో తన జైత్రయాత్ర ని ప్రారంభించి 'గుండె జారీ గల్లంతయ్యిందే', అ,ఆ' తో విజయాల్ని అందుకున్నాడు. దీంతో నితిన్ టైం స్టార్ట్ అయ్యిందని అనుకున్నారు. కానీ ఆ తర్వాత చేసిన పదకొండు సినిమాల్లో 'భీష్మ' ఒక్కటే హిట్ గా నిలిచి మిగతావన్నీ ప్లాప్ గా నిలిచాయి. వీటిల్లో మిగతా సినిమాల విషయం ఎలా ఉన్నా, 'తమ్ముడు' కి ముందు వచ్చిన ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్, రాబిన్ హుడ్ లు ఎన్నో అంచనాలతో, హిట్ టాక్ తో వచ్చాయి. ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ ని నితిన్ మరో సంస్థతో కలిసి భారీ కాస్టింగ్, భారీ వ్యయంతో నిర్మించగా, రాబిన్ హుడ్ ని పుష్ప 2 తో భారీ హిట్ ని అందుకున్న మైత్రి సంస్థ భారీ వ్యయంతో నిర్మించింది. దీంతో ఆ రెండు సినిమాలు హిట్ ని అందుకోవడం ఖాయమని అందరు అనుకున్నారు. కానీ భారీ డిజాస్టర్ గా నిలిచి అభిమానులతో పాటు,ప్రేక్షకులకి షాక్ ని ఇచ్చాయి. ఇప్పుడు 'తమ్ముడు' కూడా మంచి అంచనాలతో వచ్చి డిజాస్టర్ గా నిలిచింది. అన్ని సినిమాల్లో లాగానే నటన పరంగా నితిన్ పై వచ్చిన విమర్శలేమి లేవు. సరైన కథని ఎంచుకోకపోవడం వల్లే నితిన్ కి ప్లాప్ లు ఎదురవుతున్నాయని అభిమానులతో పాటు ప్రేక్షకులు నమ్ముతున్నారు. ఈ విషయంలో నితిన్ ప్రత్యేక శ్రద్ధ వహించాలని కూడా వాళ్ళు కోరుకుంటున్నారు. ఈ విషయంలో కూడా నితిన్ ఇటీవల మాట్లాడుతు కథల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం నితిన్ ఖాతాలో 'ఎల్లమ్మ' అనే చిత్రం ఉంది. బలగం వేణు దీనికి దర్శకుడు.