Facebook Twitter
అప్రశిఖ

ధారా నగరం లో మాధవుడు,నందుడు అనే ఇద్దరు మిత్రులు వుండేవారు. వారిద్దరూ దూరంగా వుండే గురుకులం లో విద్య అభ్యసించదానికి వెళ్ళారు. వారిలో మాధవుడు అత్యంత మేధావి. నందుడు కాస్త మందుడు.(తక్కువ తెలివి గలవాడు)

వారు విద్యాభ్యాసము పూర్తి చేసుకొని తమ వూరికి బయల్దేరారు. మధ్య దారిలో వచ్చే రాజుల దగ్గర తమ విద్య ప్రదర్శించి డబ్బు గడించారు. 

అందులోఎక్కడికి వెళ్ళినా మాధవుడికి ఎక్కువ గౌరవం డబ్బు లభించేవి. అతని కవిత్వాన్ని అందరూ  మెచ్చుకునే వారు. నందుడి కవిత్వం కాస్త పేలవంగా వుండి ఎక్కువ ధనము లభించేది కాదు. 

వారిద్దరూ కలిసి ధారా నగరానికి దగ్గరలో వున్న అడవిగుండా ప్రయాణం చేస్తున్నారు. దారిలో ఒక చెట్టు నీడన విశ్రాంతి తీసుకోడానికి పడుకున్నారు. మాధవుడికి బాగా నిద్ర పట్టింది కానీ నందుడు మాత్రం అసూయతో రగిలి పోతున్నాడు. వూరికి వెళ్ళినా మాధవుడినే అంతా గౌరవిస్తారు. వాడే ఎక్కువ డబ్బు సంపాదిస్తాడు. వీడినెలాగైనా యిక్కడే చంపేసి నేను ఒక్కడినే నగరానికి వెళ్తాను. 

పులి వాడిని చంపేసిందని వాడి తల్లిదండ్రులకు చెప్పేస్తాను అని అనుకోని మాధవుడి తలను కాళ్ళ తో నొక్కి పట్టి గొంతు నులమ సాగాడు. మాధవుడికి మెలుకువ వచ్చి నన్ను చంప వద్దని,ఈ విషయము ఎవ్వరికీ చెప్పనని నా ధన మంతా తనకే యిచ్చేస్తానని బ్రతిమాలినా నందుడు పట్టు సడలించ లేదు. వీడు తనను చంపక మానడని సరే మా తల్లిదండ్రులకు నా మాటగా 'అప్రశిఖ' అనే మాటను మాత్రం చెప్పు అని చెప్పాడు. 

నందుడు మాధవుడిని చంపి  ధారా నగరానికి వెళ్లి దొంగ ఏడుపు ఏడుస్తూ వాడి తల్లిదండ్రులకు పులి మాధవుడిని తిని వేసిందని వాడు చనిపోయే టప్పుడు మీకు 'అప్రశి ఖ' అనే మాటను చెప్ప మన్నాడని చెప్పాడు. వారికి వీడే తమ కొడుకును  చంపేసి ఆపద్ధ మాడు తున్నాడని అనిపించింది. వారు భోజరాజు దగ్గరికి వెళ్లి ఫిర్యాదు చేశారు. కానీ మా దగ్గర సాక్ష మేమీ లేదు.

 కానీ వాడు చనిపోయే టప్పుడు 'అప్రశిఖ' అనే మాటను మాకు చెప్పమని చెప్పాడట. దాని అర్థం మీ ఆస్థానంలోని కవులేమైనా వివరించగలరేమోనని వచ్చామని అన్నాడు. భోజరాజు కాళిదాసును దీని అర్థమేమో మీకు తెలిసిన వివరించమన్నాడు.

అప్పుడు కాళిదాసు వృద్దు లారా మీ కొడుకును మానవ మృగమే చంపినది . మీ కొడుకు తెలివిగా శ్లోకము లోని ప్రతి పదములోని మొదటి అక్షరమును మీకు సందేశం గా పంపినాడు ఆ శ్లోకము

"అనేన తవ పుత్రస్య
ప్రసుప్త వనాంత రే
శిఖా మాక్రమ్య పాదేవ
ఖడ్గే నాభి హతం శిరః 

అర్థము:-- మీకొడుకు వనాంతరామున నిద్రించునప్పుడు ఈ నందుని చే కాలితో తొక్కిచంప బడినాడు.

అక్కడి పండితులు యెక్కడో  జరిగినది మీకెలా తెలుసును?నిరూపించండి అని వాదించిరి. అపుడు కాళిదాసు అడవి నుండి ఆ మాంస ఖండములను తెప్పించి భువనేశ్వరీ దేవిని ప్రార్థించి మాధవుడిని బ్రతికించెను. అపుడు అందరూ 'అప్రశిఖ'అను దానికి అర్థ మేమని అడిగిరి. మాధవుడు కాళిదాసు చెప్పిన శ్లోకమునే చెప్పెను. అప్పుడు రాజు నందుడిని శిక్షించి, మాధవుడిని తన ఆస్థాన కవిగా నియమించాడు. . అప్పటినుండి ఏదైనా రహస్య మైన మాటకు కవులందరూ 'అప్రశిఖ'అని సంకేతముగా వాడు చుండే వారు.