Facebook Twitter
నీటిచుక్క

రెండేళ్లయింది. రాజ్యంలో వర్షాల్లేవు. నీరే తల్లి, నీరే తండ్రి, నీరే తిండి, నీరే జీవితం అయినప్పుడు, జీవితం లేదంటే...రాజ్యంలో ఎవరు ఉంటారు? ఉండరు కదా! అందుకే పక్షులూ, పశువులూ వలసపోయాయి. ప్రజలుకూడా చాలామంది వలసపోయారు. వెళ్లలేనివారు ఎండినచెట్లూ, నీరడుగంటిన చెరువులూ, బావులూ, బీటలువారిన భూమిసహా ఉండిపోయారు. ఉన్నవారు కూడా రోజుకి పదీ, పాతిక మందివరకూ ప్రాణాలు కోల్పోతున్నారు. 
ఎండని తట్టుకోలేకపోతున్నారు జనం. మాడి మసైపోతున్నారు. చనిపోతున్నారంతా. రాజ్యం అల్లకల్లోలంగా ఉంది. రాజుగారికి ఏం చెయ్యాలో తోచలేదు. 
 పొరుగురాజు మంచివాడు. అదృష్టవంతుడు. అతని రాజ్యంలో నీరున్నది.  దయతో వంద బళ్లతో ప్రతిరోజూ నీరు పంపుతున్నాడు. దాంతో గట్టెక్కుతున్నారుగాని, లేకపోతే ఇరుగు రాజుగారు ఏనాడో వలస పోయే పరిస్థితి.  
 నోములు నోచారు. వ్రతాలు చేశారు. యజ్ఞాలూ, యాగాలూ చేశారు. అయినా ఫలితం లేదు. వాన రాలేదు. తప్పని సరైంది. జాంగులిని పిలిచారప్పుడు. అతను ఓ పెద్ద తాంత్రికుడు. 
 ‘‘నువ్వు ఏ తంత్రం చేస్తావో చెయ్యి. రాజ్యంలో వాన పడాలి. పారితోషికంగా ఎన్ని వరహాలు కావాలో తీసుకెళ్లు.’’ చెప్పారు రాజుగారు. 
 ‘‘ఈ వేడి నశించాలి. చల్లగా చినుకుపడాలి. ఎప్పటిలాగే నా మందిరం మేలుకట్టుమీద పావురాలు ఎగరాలి.’’ అన్నారు రాజుగారు. 
 ‘‘జాంగులికి కావాల్సినవన్నీ ఏర్పాటుచేయండి.’’ రాజసేవకులకు ఆజ్ఞాపించారు. 
 అనేక తత్వశాస్త్రాలను శోధించాడు జాంగులి. తాంత్రికవిద్యలను పునః పరిశీలించాడు. వారంరోజులపాటు కిందుమీదులయి, తొమ్మిదేళ్లపాపను అమ్మవారికి బలి ఇస్తే వర్షం పడుతుందని తెలుసుకున్నాడాఖరికి. ఆ మాటే విన్నవించాడు రాజోద్యోగులకు. 
 ‘‘అయ్యా! మర్రిచెట్టు దగ్గరి అమ్మవారికి తొమ్మిదేళ్ల పాపను బలిస్తే వర్షం పడుతుంది. ముందు మనకి పాప కావాలి.’’ అన్నాడు జాంగులి. 
 తొమ్మిదేళ్లపాప కావాలి? ఎక్కడ ఉంది?
*                                   *                                   
 గుడిసె బయటకు వచ్చింది పాప. ఆ పాపకి తొమ్మిదేళ్లు. చుట్టూ ఉన్న శ్మశానాన్ని కలయజూసింది. 
 అయ్య ఎక్కడ ఉన్నాడు?
 వెదకింది. శవాన్ని కాలుస్తూ కనిపించాడు కాటికాపరి శివపాడు. 
 కట్టుకున్న లంగాని ఎత్తిపట్టుకుని పరుగుదీసింది అతని దగ్గరకి. 
 ‘‘అయ్యా’’ అని పిలిచింది. ఆ పిలుపుకి ఇటు తిరిగి పాపను చూశాడు శివపాడు. 
 మధ్యపాపిడితీసి తలదువ్వుకున్నది పాప. లంగా, జాకెట్టుమీద ఉన్నది. బొమ్మలా ఉన్నది.
 ‘‘ఏటమ్మా?’’ అడిగాడు. 
 ‘‘కాసేపు అమ్మోరి దగ్గర ఆడుకుని వస్తానేఁ.’’ అన్నది పాప.
 ‘‘ఎల్లిరా’’ అన్నాడు శివపాడు. కాలుతున్న శవం కాలు పైకిలేస్తే, కర్రతో దానిని అదిమాడు. మంటలోకి ఎగదోశాడు. 
 పాడెకు వేలాడుతున్న కొబ్బరి ఆకును తీసుకున్నది పాప. దానిని బూరచేసింది. ఊదుతూ పరుగుదీసింది అక్కణ్ణుంచి. దగ్గరగా ఉన్న మర్రిచెట్టును చేరింది.
 మర్రిచెట్టు మొదలు ఓ రాయి ఉంది. ఆ రాయికి పసుపూ, కుంకుమా, కాటుకా పూసి ఉన్నాయి. పువ్వులూ, ప్రసాదాలూ భక్తులు సమర్పించినట్టున్నారు. రాయిచూట్టూ ఉన్నాయవి. 
 వాటిని తొలగించింది పాప. అమ్మవారిని నిండుగా చూసింది. చేతులు జోడించింది. నమస్కరించింది. 
 ‘‘అమ్మోరూ! నువ్వే నా తల్లివి! నీ ఒళ్లో పడుకోవాలని ఉంది. నా కోరిక తీర్చవూ.’’ అని ప్రార్థించింది. 
 నేస్తురాళ్ళొచ్చారు ఆసరికి. వారితో ఆటలాడుకోసాగింది పాప. 
 *                                *                                    *
 ‘‘కాటికాపరి శివపాడుకి ఓ పాప ఉంది. ఆ అమ్మాయికి సరిగ్గా తొమ్మిదేళ్లు. ఆ పిల్లను బలి ఇస్తే చాలనేగా మీరు చెప్పేది.’’ వేగులను అడిగారు రాజుగారు. 
 ‘‘అంతే మహారాజా’’ చేతులు కట్టుకున్నారు వేగులు. 
 ‘‘ఎంత కాటికాపరి అయినా కన్నకూతురిని బలిచేయమంటే...చేస్తాడా?’’ అడిగారు రాజుగారు.
 ‘‘ఆ పాప వాడి కన్నకూతురు కాదు మహారాజా! తొమ్మిదేళ్ల క్రితం ఎవరో పాపని శ్మశానంలో వదిలేస్తే దగ్గరగా తీసుకున్నాడు వాడు. పెంచాడు అనడం పెద్దమాట! గాలికి పుట్టింది. ధూళికి పెరిగింది. అదీ అసలు సంగతి.’’
 ‘‘అయితే వాడితో మాట్లాడండి. అడిగినన్ని వరహాలూ, మాడలూ అందజేయండి.’’ ఆజ్ఞాపించారు రాజావారు. 
 *                                   *                                *
 వడగాలి వీస్తున్నది. ఆ గాలికి కొన్ని చితులు రగులుతున్నాయి. మరికొన్ని చిందుతున్నాయి. 
 ఏ మూలికలు నమిలాడో, ఏ తీగరసం చవిచూశాడో మత్తుగా ఉన్నాడు శివపాడు. తూగుతున్నాడు. వాణ్ణి పట్టి కూర్చోబెట్టారు సైనికులు.  
 ‘‘సెప్పండి సామీ’’ చేతులు జోడించాడు శివపాడు. 
 సేనాపతిసహా సైనికులు రాత్రివేళ శ్మశానానికి రావడం, తనతో గౌరవంగా మాట్లాడడం వింతగా ఉంది శివపాడుకి. 
 ‘‘పాపని బలి ఇస్తే బంగారు వరహాలూ, వెండి మాడలూ ఇస్తారా? ఏయి?’’ చూపించమన్నట్టుగా అడిగాడు శివపాడు. 
 పెద్దపెద్ద ముఖమల్ సంచుల్లో ఉన్న వరహాలనూ, మాడలనూ కాగడాల వెలుగులో చూపించారు సైనికులు. 
 ‘‘ఇయన్నీ నాకే.’’ ఆశ్చర్యపోయాడు శివపాడు. 
 ‘‘నీకే! ఇందాక మేము నీకు చెప్పినట్టుగా...ఈ రాత్రి పన్నెండుగంటలకి అమ్మవారికి నువ్వు పాపని బలివ్వాలి.’’
 ‘‘సచ్చినోళ్లను కాల్సినప్పుడు బయపళ్లేదుగాని, అమ్మో! బతికున్నోళ్లను సంపడం...అదే బలివ్వడం అంటే బయంగా ఉందిసామీ! అయినా రాజావోరికోసం, మీకోసం పాపని బలిచ్చేత్తాను, ఎళ్రండి.’’ అన్నాడు శివపాడు. వరహాలూ, మాడల సంచుల్ని దగ్గరగా తీసుకున్నాడు. గట్టిగా కౌగలించుకున్నాడు వాటిని. 
 తనని బలి ఇచ్చేందుకు సైనికులదగ్గరనుంచి అయ్య డబ్బు తీసుకున్నాడు. చంపేస్తాడు తనని అనుకున్నది పాప. సైనికులతో శివపాడు సంభాషణంతా చాటుగా విన్నదా పిల్ల. 
 అమ్మోరే తనని కాపాడాలనుకున్నది. పరుగుదీసింది పాప. మర్రి చెట్టుదగ్గరకు చేరింది. 
 పొద్దున చూసినప్పటిలా అమ్మోరు శాంతంగా లేదప్పుడు. నూనెదీపం వెలుగులో భయంకరంగా ఉన్నది. భయపెడుతున్నది. 
 భయపడ్డది పాప. ఆ భయంతో ఊపరాడలేదు ఆ పిల్లకి. శరీరం అంతా చెప్పలేనంత నొప్పి. మెలికలు తిరిగింది. అడుగుతీసి అడుగు వేయలేకపోయింది. చెమటలుపట్టింది. 
 ‘‘అమ్మా’’ అన్నది. అమ్మోరు అని పూర్తిగా పిలవలేకపోయింది. కుప్పకూలిపోయింది. 
 పాప అలా కూలినప్పుడు, ఆ పిల్ల తల అమ్మోరికి తగిలింది. గాయం అయింది. నెత్తురు కారింది. ఆ నెత్తురు తాగి, అమ్మోరు పిచ్చిగా నవ్వింది. పెద్దగా నవ్వింది. 
 అప్పుడది అర్థరాత్రి. 
 అమ్మోరినవ్వు శివపాడుకి వినవచ్చింది. వణకిపోయాడు వాడు.  
 పాపను బలి ఇవ్వడం తర్వాతి సంగతి. ముందు తానందుకున్న వరహాలనూ, మాడలనూ జాగ్రత్తగా దాచాలి. మారాజు మనసుమారి ఇచ్చిన డబ్బు, తిరిగి ఇమ్మంటే..ఇవ్వలేడు. ఇవ్వకూడదు అనుకున్నాడు శివపాడు. అందుకని అందుకున్న వరహాలనూ, మాడలనూ శ్మశానం అంతటా గోతులు తవ్వి దాచసాగాడు. చాలా వరకూ దాచేశాడు. మిగినవి కొన్నే! ఆ కొన్నింటినీ గోతిలో పాతి పెడుతుంటే...అమ్మోరు నవ్వు వినవచ్చిందింతలో. 
 ఎలాంటి ఏడుపునైనా తట్టుకోగలడు శివపాడు. ఏడుపులు అలవాటే! కాని, ఇప్పుడు వినవస్తున్న ఈ నవ్వు భయంకరంగా ఉన్నది. శ్మశానాన్ని కుదిపేస్తున్నది. భూకంపం వచ్చినట్టుగా ఉంది. 
 మొదటిసారిగా ప్రాణభయం అంటే ఏమిటో తెలిసింది శివపాడుకి. పరుగందుకున్నాడు అక్కణ్ణుంచి. శ్మశానం దాటాడు. రాజ్యం పొలిమేర దాటాడు. పారిపోయాడు. 
 ఆ రాత్రి వానపడ్డది. తెల్లార్లూ పడ్డది. మర్నాడూ...ఆ మర్నాడూ పడ్డది. ముసురు పట్టింది. 
 రాజుగారు ఆనందించారు. ప్రజలు హర్షించారు. 
 అక్కడ ఇక్కడసహా శ్మశానంలో నేల కూడా మెత్తబడింది. మొలకలొచ్చాయి. చూస్తూండగానే ఆ మొలకలు, మొక్కలయ్యాయి. చెట్లయ్యాయి.   
 శ్మశానంలో వరహాలచెట్లూ, మాడలమొక్కలూ మొలిచాయి. కొమ్మలనిండా డబ్బే! కోసినకొద్దీ కాస్తున్నాయి.
 శివపాడు ఏమయ్యాడు? పాప ఎలా చనిపోయిందీ ఎవరికీ పట్టలేదు. శ్మశానంలో డబ్బుచెట్లగురించే అంతటా చర్చ. అది ఆ నోటా ఈ నోటా పాకి పొరుగురాజుగారి చెవివరకూ వెళ్లింది. అతను మంచివాడే! దయగలవాడే! కాని డబ్బుకి ఆ రెండు గుణాలూ లేవుకదా! అందుకని అది ఆ రాజుగారిని ఈ రాజ్యం మీదికి దండెత్తి రమ్మంది. 
 వచ్చాడతను. 
 వందలాది ఏనుగులతో, వేలాది గుర్రాలతో, లక్షలాది సైనికులతో దండెత్తి వస్తున్న పొరుగురాజుని చూసి, ఇరుగురాజు బెంబేలెత్తాడు. 
 నీరూ డబ్బూ రెండూ వేర్వేరు కాదు. రెండూ ఒకటే! కాకపోతే...నీటిరూపంలో ఉన్న డబ్బుని ఎవరూ పెద్దగా పట్టించుకోరు. అదే ఘనీభవించి, బంగారు వరహా అయితే, వెండి మాడయితే యుద్ధం తప్పదు. ఆ యుద్ధాన్ని ఏ తాంత్రికులూ నిలువరించలేరు. 
 సైన్యంకన్నా ఎడారిలో నీటిచుక్క చాలా శక్తివంతం అయినది. 

- జగన్నాథశర్మ