మా పిన్నికూతురు పెళ్లిలో మొదటిసారి పూర్ణని చూశాను. తెల్లగా, పొడుగ్గా ఉంది. రెండు జడలతో ఉంది. లంగా, ఓణీ మీద ఉంది. ఇంతలేసికళ్లతో, అంత లేతమొహంతో ఊరిస్తున్నట్టుగా ఉంది. కుర్రకారంతా ఎవర్రా? ఎవరీ అమ్మాయి? అని వాకబులో పడింది. వాకబు చేయగా చేయగా ఆఖరికి తెలిసిందేమిటంటే...
పూర్ణ వంట బ్రాహ్మణుని కూతురు.
దాంతో కుర్రకారంతా చూపులు మరల్చుకున్నది. ఆ రోజుల్లో వంట బ్రాహ్మణుల్నీ, వారి పిల్లల్నీ తక్కువగా చూసేవారు. పదిమందికీ వండిపెట్టుకునేవాడితో కబుర్లేమిటని వారిని పలకరించేవారు కాదు.
పూర్ణ వంటబ్రాహ్మణుని కూతురే కాదు, తల్లి కూడా లేదామెకు. దానాదీనా పూర్ణని అగ్రహారంలో పట్టించుకునేవారు కాదు. అరకొరా దొంగ చూపులుచూసి, చొంగకార్చుకోవడమే తప్ప, తెగించి పూర్ణతో మాట్లాడే మనిషే లేడు. నేను మాట్లాడేవాణ్ణి. తెగించి జోకులు కూడా వేసేవాణ్ణి. నా జోకులకు తెగనవ్వేది పూర్ణ. పాడమంటే సినిమా పాటలు పాడేది. రాయమంటే లలితగీ తాలు రాసేది. గీయమంటే బొమ్మలు గీసేది.
ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావు? ఎవరు నేర్పారు? అంటే...నాన్నంటూ నవ్వేది పూర్ణ.
వంట చేయడాన్ని తక్కువ చేసి చూస్తారుగాని, వంట చేయడం అంటే పాట రాయడం లాంటిది. బొమ్మ గీయడం లాంటిదంటూ పూర్ణకి వాళ్లనాన్న ఎప్పుడో చెప్పాట్ట! పాటకి గమకాలూ, బొమ్మకి రంగులూ ఉన్నట్టే వంటకి వంద రుచులు ఉంటాయి అన్నాట్ట! చేసిన వంటకి రుచి నెలా కల్పించాలన్నదే ధ్యేయం కావాలి. బాగా వంట చేయడం వస్తే...బొమ్మలు వేయడం, పాటలు రాయడం వాటంతటవే వస్తాయి అన్నాట్ట.
నేను వంటలు బాగా చేస్తాను. అందుకే నాకు పాటలు పాడడం, రాయడం, బొమ్మలు గీయడం ఇట్టే వచ్చేశాయి అనేది పూర్ణ.
డిగ్రీ చదివేరోజుల్లో పూర్ణ టిఫిన్ బాక్స్ దొంగిలించేవాణ్ణి. రోజుకో స్పెషల్ ఉండేది అందులో. మసాలా వడలూ, మిర్చీబజ్జీలూ, మిక్చర్, కారప్పూస, మైసూర్ పాక్...రకరకాల చిరుతిళ్లుండేవి. తినేసి, ఖాళీ బాక్స్ ఇస్తూ సారీ చెబితే...నువ్వు సారీ చెప్పడం దేనికి? నీకోసమే తెచ్చాననేది పూర్ణ. పగలబడి నవ్వేది.
టెన్త్ ఫస్ట్ క్లాస్. ఇంటర్ ఫస్ట్ క్లాస్. డిగ్రీలో కూడా పూర్ణకి ఫస్ట్ క్లాస్ తప్పనిసరి. బాగా చదివేదామె. నావన్నీ అత్తెసరు మార్కులే! ఎలాగోలా గట్టెక్కేవాణ్ణి.
ఒకసారి వాళ్లింటి కానుగు చెట్టు నీడలో అడిగిందిలా.
నీకు చదువు మీద పెద్దగా ఇంట్రస్ట్ లేదుకదూ?
లేదన్నాను.
మరి దేనిమీద ఉంది?
ఏదేని వ్యాపారం చెయ్యాలి. లక్షలూ కోట్లూ ఆర్జించాలన్నాను.
ఏదేని కాదు. ఏ వ్యాపారం చెయ్యాలో త్వరగా తేల్చుకో! లేకపోతే మనిద్దరి భవిష్యత్తూ అగమ్యగోచరం అవుతుందన్నది పూర్ణ.
మనిద్దరి భవిష్యత్తు?!
ఆ మాట నాకు అర్థంకాలేదు. తర్వాత మెల్ల మెల్లగా అర్థమయింది. పూర్ణ నన్ను ప్రేమిస్తున్నది. అమ్మో అనుకున్నాను. భయపడ్డాను. తాతగారింట ఉండి, అగ్రహారంలో చదువుకుంటున్నాను. పిచ్చిపిచ్చివేషాలేస్తే పుచ్చులు లేచిపోతాయి. తాతా, మామా తోలు తీస్తారనుకున్నాను. ఆనాటి నుంచీ జాగ్రత్తపడ్డాను. పూర్ణని దూరం చేశాను. డిగ్రీ పరీక్షలు రాశానో లేదో...అగ్రహారాన్ని వదిలేశాను. ఒకరకంగా పారిపోయి, ఇక్కడకి వచ్చేశాను.
పదేళ్లు గడచిపోయాయి.
ఉద్యోగినయ్యాను. పెళ్లయిపోయింది. తండ్రినయ్యాను. ఓ పాప నాకు. మా బావగారికూతురి పెళ్లికి విశాఖ వచ్చాను. బావగారు డిప్యూటీ కలెక్టర్. బాగానే సంపాదించారు. కూతురి పెళ్లి ఘనంగా చేస్తున్నారు. జిల్లాలో పేరెన్నికగన్న ‘పూర్ణా క్యాటరర్స్’ తో వంటంటే...పూర్ణ గుర్తొచ్చిందప్పుడు. ఎక్కడ ఉన్నదో? ఎలా ఉన్నదో అనుకున్నాను.
వంటశాల ఘుమఘుమలాడిపోతున్నది. పాతిక మంది పైబడే ఉన్నారు వంటవాళ్లు. ఉప్మా, కొబ్బరిచట్నీ చేశారు. అదిరిపోయింది. వడా, సాంబార్, పూరీ, కూర కూడా వేడివేడిగా వడ్డించారు. అన్నీ బాగున్నాయి. బ్రేక్ ఫాస్ట్ కి వంకపెట్టేదిలేదన్నారు పెళ్లివారు.
లంచ్ సిద్ధమవుతున్నది. వెయ్యిమందికి ఆతిథ్యం ఇచ్చేందుకు ఆయితమవుతున్నారు.
వేళకి భోజనాలవ్వాలి. ఆలస్యం కాకూడదు. క్యాటరర్స్ కి చెప్పక్కరలేదనుకో, అయినా మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది. అందుకని అప్పుడప్పుడూ వారిని హెచ్చరించడం నీ వంతు అన్నారు బావగారు. ఓ బాధ్యతను నాకు అప్పగించారు. దాంతో కిచెన్ లో తచ్చాడడం మొదలెట్టాను. కాసేపటికి తెలియని హడావుడి ప్రారంభమయింది. ఏమయింది? ఏమయింది అంటే...మా మేడంగారు వస్తున్నారు అన్నారు వంటవాళ్లు. వేళపట్టున వంటలవ్వాలి. వంటశాల శుభ్రంగా ఉండాలి. కచ్చకచ్చాగా ఉంటే కోపగిస్తారామె అన్నారు. అబ్బో అనుకున్నాను. అంతలో ఆ మేడం రానేవచ్చారు. చూసి, షాకయ్యాను.
పూర్ణ!!
మిసమిసలాడిపోతున్నది. మెళ్లో బంగారు గొలుసులూ, చేతికి బంగారు గాజులూ...కళకళలాడిపోతున్నది. ఖరీదైన చీరలో ప్రత్యక్షమయింది. వస్తూనే ముందుగా స్థాలీపులాకన్యాయంగా వంటలన్నీ రుచి చూసింది. బాగున్న వాటిని మెచ్చుకున్నది. రుచి తక్కువగా ఉన్నవాటిని, ఏం చేస్తే వాటి రుచి ఎక్కువవుతుందో చెప్పింది. టైం చూసింది.
లంచ్ రెడీ కదా? అడిగింది. రెడీ అంటే రెడీ అన్నారు వంటవాళ్లు. పెళ్లివారికి చెప్పండి మరి అన్నది.
అప్పుడు కేకేశారు నన్ను. అంతవరకూ పూర్ణ కంటబడక, చాటుగా ఉన్న నేను తప్పనిసరై బయటపడ్డాను. నన్ను చూస్తూనే పూర్ణ ముఖం విప్పారుకున్నది. ఆనందించింది.
బాగున్నావా? అడిగింది. బాగున్నట్టుగా తలూపాను. మాటాడలేదు.
ఏం చేస్తున్నావు? అడిగింది.
చేస్తున్న ఉద్యోగం గురించి మెల్లమెల్లగా చెప్పాను.
డిప్యూటీ కలెక్టర్ గారు నీకు ఏమవుతారు?
బావగారవుతారు. వారి చెల్లెల్నే నేను పెళ్లిచేసుకున్నాను అన్నాను.
పిల్లలా? అడిగింది పూర్ణ.
ఓ పాప అన్నాను.
తాను ఇబ్బంది పడకుండా, నన్ను ఇబ్బంది పెట్టకుండా పూర్ణ అలా మాట్లాడుతుంటే ధైర్యం వచ్చింది. ఫంక్షన్ హాల్లో ఉన్న నా శ్రీమతిని పిలిచాను. పరిచయంచేశాను పూర్ణకి. అంతలో ‘మమ్మీ’ అంటూ పాపవ చ్చిందక్కడకి. దానిని కూడా పరిచయం చేశాను.
పేరు...పేరు...పూర్ణ అని చెప్పాను. సంతోషించింది పూర్ణ. పాపని దగ్గరగా తీసుకుని ముద్దుపెట్టుకున్నది. తన మెళ్లో గల ఒంటపేట గొలుసు ఒకటి తీసి, పాప మెళ్లో వేసింది.
ఆశ్చర్యంగా చూస్తున్న నా శ్రీమతితో అన్నదిలా పూర్ణ.
మీ ఆయన డిగ్రీలో నా క్లాస్ మేటమ్మా! ఆయనిచ్చిన సలహానే ఈ వ్యాపారం. ఇందులో లక్షలూ, కోట్లూ ఆర్జించాలని నాకు లేదు. కాకపోతే పదిమందికీ ఆదరవు అవుతుందని, అచ్చొచ్చిందేనని పెద్ద ఎత్తున ప్రారంభించాను. సక్సెసయ్యాను. అందుకు మీ ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకోవాలిగా! అదే మీ పాపమెళ్లో వేసిన గొలుసు.
ఆనందించింది నా శ్రీమతి.
పూర్ణా క్యాటరర్స్...చాలా పెద్దపేరు మీది? పూర్ణని పొగిడింది నా శ్రీమతి. ఎవరో పిలిస్తే...వస్తానండీ అంటూ వెళ్లిపోయింది.
మీ ఆవిడా, నీ కూతురూ ఇద్దరూ బాగున్నారు అన్నది పూర్ణ.
సరేగానీ! నీ సంగతి చెప్పలేదు, మీవారూ...పిల్లలూ... అని నేనడుగుతుంటే మాట మధ్యలోనే అందుకుని అన్నదిలా పూర్ణ.
నాకు పెళ్లికాలేదు, కాదు, నేను పెళ్లి చేసుకోలేదు.
ఏం మట్లాడాలో తెలియక వెర్రిచూపులు చూశాన్నేను.
కూరలకీ పచ్చళ్లకీ వ్యక్తిత్వాలు ఉండవు. కాని, మనసుపెట్టి చేస్తే వాటికే వ్యక్తిత్వాలు ఏర్పడినప్పుడు, మనసుపెట్టి అభిమానించిన వ్యక్తులకి వ్యక్తిత్వాలు లేకపోతే ఏం చెయ్యాలి? అందుకే ఒంటిరిగా ఉండిపోయాను అన్నది పూర్ణ. గబగబా నాలుగడుగులు వేసి, కారెక్కి వెళ్లిపోయింది.
ఎందుకో ప్రేమకీ, వంటకీ, సినిమాలకీ భావోద్వేగాలే ప్రధానం అనిపించింది. వడ్డనలకు సిద్ధమయ్యాను.
-జగన్నాథశర్మ
