Facebook Twitter
లౌక్యమూ లేక సౌఖ్యమూ లేదు....

ముక్కుసూటిగా మాట్లాడడం, మొహమ్మీద గుద్దినట్టుగా మాట్లాడడం తప్పురా! అంత నిర్మొహమాటంగా మాట్లాడకూడదు. అలా మాట్లాడితే కష్టం. జీవితంలో పైకి రాలేవు. సుమతిశతకకారుడు ఏం చెప్పాడు?
 ఎప్పటి కెయ్యది ప్రస్తుత
 మప్పటి కా మాటలాడి అన్యుల మనముల్ 
 నొప్పింపక తానొవ్వక 
 తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నాడు. 
 అంటే అర్థం ఏమిటి? ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలుసుకోవాలి. అప్పటికది మాట్లాడాలి. మాట్లాడి, తాను బాధపడక, ఇతరులను బాధించక తప్పించుకుని తిరగాలి. అలా తిరిగినవాడే ధన్యుడు అన్నాడు.  
 ధన్యుడు అంటే ఎవరనుకున్నావు? పొగడదగినవాడు. సుఖాన్ని పొందినవాడు. పుణ్యాత్ముడు. ధనాన్ని చేజిక్కించుకున్నవాడు. ఇష్టకార్యం నెరవేర్చుకున్నవాడు. 
 మాయచేసో, మర్మంచేసో మూడోకంటికి తెలియకుండా మనపని మనం చక్కదిద్దుకోవాలి. అంతేగాని, యాగీలుచేస్తూ కూర్చుంటే...అంతే సంగతి అని తెలుసుకో!
 తనువున విరిగిన యలుగుల
 ననువున బుచ్చంగవచ్చు నతి నిష్ఠురతన్
 మనమున నాటిన మాటలు
 విను మెన్ని యుపాయములను వెడలునె యధిపా! అన్నాడు విదురుడు. మహాభారతం ఉద్యోగపర్వంలోనిది ఈ పద్యం. ధృతరాష్ట్రునికి మంచిచెడులు చెబుతున్నాడు విదురుడు. ఈ పద్యం అర్థం ఏమిటో తెలుసా?
 శరీరంలో దిగిన బాణాలను అతి కష్టమ్మీద బయటకు తీయొచ్చు. ఆ బాణాలు చేసిన గాయాలను మాన్పవచ్చు. కాని, ఇతరులకు కష్టాన్ని కలిగించేట్టు మాట్లాడిన  మాటలను, అవీ,  సూటిగా మనస్సులో గుచ్చుకున్న మాటలను ఎన్ని ఉపాయాలు ప్రయోగించినా తొలగించడం కష్టం అన్నాడు విదురుడు. ఈ బోధకూడా ధృతరాష్ట్రుని చెవికెక్కలేదు. అప్పుడు ఇంకో మాటన్నాడు. ఏఁవన్నాడంటే...  
 ఎదిరికి హితమును బ్రియమును మదికింపును గాగ బలుకు మాటలు పెక్కై
 యొదవినను లెస్స యటుగా 
 కిది యది యన కూరకునికి ఎంతయు నొప్పున్! 
 దీని అర్థం ఏమిటో తెలుసా? ఎదుటివాడికి మేలయినవి, ఇష్టమైనవి, వాడి మనసును సంతోషపరిచే మాటలు మాత్రమే మనం మాట్లాడాలి. అలా మాట్లాడితేనే మంచిది. మనకలా మాట్లాడడం ఇష్టంలేదూ, ఊరకే ఉండడం ఇంకా మంచిదన్నాడు విదురుడు. వేదాలు ఏమన్నాయి? వాక్శక్తిని వృధాచేసుకోకూడదు అన్నాయి. భగవద్గీత ఏమన్నది? వాక్కును తపస్సులా భావించాలన్నది. 
 చెప్పినవన్నీ గుర్తుపెట్టుకో! మనసుకు పట్టించుకో! పట్టించుకోలేదనుకో! నిన్ను ‘మూర్ఖుడు’ అంటుంది ఈ సమాజం. నీలాంటి మూర్ఖుణ్ణీ, ఎండుకట్టెనీ వంచడం నా వల్లకాదు. పైగా ప్రమాదం కూడా. వంచితే ఎండుకట్టె విరిగిపోతుంది. నీలాంటివాడు పేట్రేగిపోతాడు. 
 ఇంత చదువుకున్నావు. చదువుతోపాటు సంస్కారం రావాలి కదరా? రాలేదంటే...నిన్నేమనాలి? పడగమీది మణి అనాలి. 
 లౌక్యం నేర్చుకోరా! లౌక్యాన్ని ప్రదర్శించు. హాయిగా ఉంటుంది. ఏ గొడవలూ ఉండవు. మనుషులూ, మహరాజులూ లౌక్యంగా ఎలా నెట్టుకు రావాలో కణికుడు ఏనాడో చెప్పాడ్రా! కణికుడు ఎవరంటావా? మహాభారతంలో దుర్యోధనుని కొలువులోని మంత్రి. కణికుడు ఏం చెప్పాడూ?
 ఫలానావాడు నమ్మదగినవాడూ, ఫలానావాడు నమ్మదగనివాడూ అని మనం అనకూడదు. ఎవరినీ మనం నమ్మకూడదు. ఎవరినీ నమ్మకుండా ఓ మహరాజులా మన రక్షణ మనమే చూసుకోవాలి. అలాగే మన రహస్యాలోచనను కూడా మనమే రక్షించుకోవాలి. ఏనాడూ ఎవరికీ ఏదీ చెప్పకూడదు. అంతా రహస్యంగా దాచుకోవాలి. దాచుకుంటేనే నువ్వు అనుకున్నది సాధించగలవు. లేనిపక్షంలో అది సాధించలేవుసరిగదా, నువ్వు నవ్వులపాలవుతావు. 
 అలాగే...తిట్టడానికైనా, కొట్టడానికైనా సమయం సందర్భం చూసుకోవాలిరా! తగిన సమయం వచ్చేంత వరకూ శత్రువును భుజాలమీద మొయ్యాలి. సమయం వచ్చిందీ మట్టికుండను రాతిమీద వేసి కొట్టునట్టుగా శత్రువును నాశనం చెయ్యాలి.  గతంలో చేసింది చెప్పుకోదగిన అపకారంకాదని శత్రువును చేరదీయకూడదు. ముల్లు చిన్నదే అయినా అది పాదంలో గుచ్చుకుంటే...నడక సాధ్యం అవుతుందా? కాదుకదా! అలాగే వీడి వల్ల ఏమవుతుంది? వీడేం చేస్తాడని శత్రువును చిన్న చూపు చూడకూడదు. అలాగే వాడితో కలసి మెలసి తిరగకూడదు. శత్రువును ఎప్పుడూ సామదానభేదోపాలయాలతో లేదా దయచూపించినట్టుగా నటించి, హెచ్చరిస్తూ...నమ్మకం కలిగించి, సమయం వచ్చినప్పుడు మట్టుబెట్టాలి. మట్టుబెట్టడం అంటే...చంపమనికాదురొరేయ్! పదిమందిలో వాడి పరువుతియ్యాలి. స్నేహితుడైనా, బంధువైనా వాడు మనకి శత్రువు అనుకున్నప్పుడు, చెయ్యాల్సింది చేసేయ్యాలి. చేతులు దులుపుకోవాలన్నాడు కణికుడు.   
 పని కావాలి గాని, మాటలు అనవసరం. లౌక్యాన్ని ఎలా ప్రదర్శించాలో చిన్న ఉదాహరణ చెబుతాను, విను.
 పొద్దున్నే ఫ్రెండింటికి వెళ్లి ఓ అయిదు వేలు కావాలని అడుగు. లేవంటాడు ఫ్రెండు. లేవనుకు! అర్జంట్! అయిదువేలు ఎలాగైనా కావాల్సిందే! లేకపోతే చాలా ప్రమాదంలో పడతాను. నా కష్టాలు నీకు చెప్పుకోలేనను. అయినా ఫ్రెండ్ కరగలేదనుకో! అప్పుడు పోనీ! ఓ అయిదు వందలు ఇవ్వుగురూ! నీ మేలు మరచిపోలేనను. కన్నీరు పెట్టుకో! అప్పుడు నీకు చప్పున అయిదువందలిచ్చేస్తాడు నీ ఫ్రెండు. ఇక్కడే అసలు కిటుకు ఉంది. నీకు కావాల్సింది అయిదువందలే! కాని, అయిదు వేలంటూ అడిగి, ఆఖరికి అయిదువందలని లౌక్యాన్ని ప్రదర్శించావు. సక్ససయ్యావు. నేర్చుకోరా! చాలా విషయాలు చెబుతాను, నేర్చుకో!
 నేర్చుకుంటానుగానీ, దీన్ని లౌక్యం అని ఎలా అంటాం? మోసం కదా అంటారు. అడిగాన్నేను. 
 నీ మొహం! నమ్మినచోట చేసిన దానిని మోసం అంటారు. నమ్మనిచోట చేసిన దానిని లౌక్యం అంటారు. ఉప్పూ, కర్పూరంలా రెండూ ఒకేలా ఉంటాయిగాని, వేర్వేరు. అర్థం చేసుకో! అలాగే మనం చేస్తే దానిని లౌక్యం అనాలి. అదే ఇతరులు చేస్తే మోసం అనాలి. బుర్రలోపెట్టుకో! గందరగోళం పడకు! గాభరాపడకు. మెల్లిగా మాట్లాడు. అవకాశం దొరికిందీ కుర్చీమడతబెట్టేయ్!!
 ఆఖరిగా ఓ మాట! ‘లౌక్యం’ అని టైటిల్ పెట్టినందుకే ఓ సినిమా సూపర్ డూపర్ హిట్టయింది. మరి దానిని అనుసరిస్తే...ఆలోచించుకో! నీకు తిరుగులేదు. తిరుగుండదు.  

- జగన్నాథశర్మ