ఎమర్జెన్సీ రోజులు...ఎంచక్కా యద్దనపూడి సులోచనారాణి ‘బహుమతి’ కథలూ, ఆదివిష్ణు ‘కలెక్టరూ! నన్ను క్షమించు కథలూ’, గొల్లపూడి మారుతీరావు ‘రోమన్ హాలిడే’ కథలూ చదువుకుంటున్నరోజులు. తెలియకుండానే జీవితం చంకనాకిపోతున్న రోజులు...ఆ రోజుల్లో ఒకరోజు మా అన్నయ్య గణపతిరావుగారు ఓ పాత స్వాతి మాసపత్రికను తీసుకొచ్చి నా చేతికిచ్చారు. దానికి కవర్ పేజీలేదు. చాలా పేజీలు చిరిగి, నలిగిపోయి ఉన్నాయి. ఇందులో ఓ కథ ఉంది ‘జీవధార’ అని. రచయిత కాళీపట్నం రామారావు మాస్టారు. ఆ పేజీలు చిరగలేదు. చదువు అన్నారు.
చదివాను. కథల్లో అలకలూ, అల్లర్లూ ఉండాలి. ముద్దులూ, ముచ్చట్లూ ఉండాలి. అలరింతలూ, కౌగలింతలూ ఉండాలి. అంతేగాని ఈ కథేమిటి ఇలా ఉంది? నిత్యం వీధికొళాయి దగ్గర జరిగిన గొడవలే ఇవి. వీధికొళాయిదగ్గర నీరు రాకపోతే అక్కడా ఇక్కడా దేవులాడడం చూస్తున్నదే! ఏమున్నది ఇందులో అనుకున్నాను. అనుకుంటూనే ఆలోచించాను. ఆలోచిస్తే...జీవధారలోని ప్రతి అక్షరం, ప్రతిపదం, ప్రతి వాక్యం నాకేవేవో కొత్త దృశ్యాలను చూపిస్తున్నట్టనిపించింది. దృశ్యం ఒకటే! కాకపోతే ఎదురుబొదురు అద్దాల్లో వందలు, వేలాది ప్రతిబింబాలు కనిపించినట్టుగా అనేక దృశ్యాలు కనిపించసాగాయి. అరికాళ్లలోంచి ఏదో సెగ బయల్దేరి గుండెల్లోంచి పాకి, మెదడుకెక్కి కూర్చున్నదక్కడ.
నీటి కోసం కింది తరగతులవారయితే గొడవపడతారు. కింది మధ్యతరగతివారయితే బతిమలాడుతారు. పొరుగింటివారినీ, ఇరుగింటివారినీ మంచిచేసుకుని, వారికి పచ్చళ్లూ, పొడులూ ఇచ్చి నీళ్లబిందె చంకనెత్తుకుంటారు. నీళ్లబిందె చంకనెత్తుకున్నప్పుడు ఆ ఇంటి మగవాళ్లు ఆడవారిని చూసే చూపులు నాకు తెలుసు. మా పిన్ని కూతురిని పొరుగింటి కుర్రాడు అలాగే చూసేవాడు. తమకాన్ని తమాయించుకోలేకపోయేవాడు. పిడికిళ్లు బిగించి, దంతాలు గిట్టకరచి నిల్చునేవాడు.
వాడి నిన్ను అదోలా చూస్తున్నాడే అక్కా అంటే...
చూణ్ణీనీరా! కాసేపుచూసుకుంటాడు, పోతాడు. నీళ్లెవరిస్తారు? కొళాయి మనింట్లో లేదుకదా? అనేది అక్క. అలా అంటున్నప్పుడు అక్కగొంతు జీరపోవడం నేను చాలాసార్లు గమనించాను. బాధపడ్డాను. అదిగో...ఆ బాధని బొమ్మగీసిపెట్టారు కాళీపట్నంమాస్టారు.
ఎలా ఆలోచించాలో కథకుడు చెప్పకూడదురా! ఆలోచించేందుకు అనేక ప్రశ్నలను సంధించాలంతే అనేవాడు మా అన్నయ్య. ఆ మాట ‘జీవధార’ నిజంచేసిందనిపించింది. గుండెల్లోంచి తన్నుకొస్తున్న అనేక ప్రశ్నలకు సమాధానాలు వెదుక్కుంటూ సాయంత్రం రైల్వేస్టేషన్ కి వెళ్లాను. మా ఊరిలో సాయంత్రాలు అంతా రైల్వేస్టేషన్స్ లోనే కూర్చునేవారు. సింగిల్ ట్రాక్. అప్పుడో రైలూ, అప్పుడో రైలూ వచ్చేవి. పెద్దగా ప్రయాణికులు ఉండేవారు కాదు. సాయంత్రం పొలాలమీదినుంచి వచ్చే చల్లనిగాలికోసం, కబుర్లకోసం యువతంతా అక్కడే తిష్టవేసేది.
పట్టాలకు అటూ ఇటూ పడిన బొగ్గును పేదింటిపాపలు ఏరుకునేవారు. చిరిగిన జాకెట్టు, చాలీచాలని లంగాలో ఉండేవారు. వారిని కుర్రకారు దొంగచూపులు చూసేది. నేనూ వారిలో ఒకణ్ణి. నేనేం శుద్ధుణ్ణికాను. కాకపోతే...జీవధార కథచదివిన సాయంత్రం బొగ్గు ఏరుకునే పాపలను అలా చూడకూడదనుకున్నాను. నా స్నేహితుడు చూస్తుంటే వద్దన్నాను. వినకపోతే...నెత్తిమీద ఒకటిచ్చాను. షాకయ్యాడు వాడు. విస్తుపోయిచూశాడునన్ను. వద్దంటే వద్దు! అంతే అన్నాను. ఇక అక్కడ కూర్చోవాలనిపించలేదు. లేచి బయల్దేరాను.
ఏదో అసహనం, కోపం, కసి. ఆ రాత్రి నిద్రలేదు నాకు. మర్నాడు అక్క నీళ్లబిందె చంకనెత్తుకుంటుంటే...ఎప్పటిలాగానే పొరుగింటికుర్రాడు అక్కని చూడసాగాడు. నేనది భరించలేకపోయాను. చాచిపెట్టి కొట్టానతన్ని. ఎందుకు కొట్టావని కుర్రాడు అడగలేదు. భయపడి పారిపోయాడక్కణ్ణుంచి.
చిన్నకథలు హ్యాండ్ గ్రెనేడ్ లాంటివి. ప్రయోగిస్తే పాఠకుడు నాలా కదిలిపోతాడనిపించింది. తర్వాత వరుసగా మాస్టారుగారి కథలన్నీ చదివాను. చాలా తెలుసుకున్నాను.
కథలకు ప్రయోజనం ఉంటుందా? ఉండాలా? అనుకునేవారికి నేనొకటే చెబుతాను. కథలకు ప్రయోజనం ఉంటుంది. ఉండాలి. అందుకు నేనే పెద్ద ఉదాహరణ. జీవధార కథ నన్ను బాగా మార్చింది. అలాంటి కథలు పదుల్లోవస్తే, వందలూ, వేలాదిమంది చదివి, లక్షలూ, కోట్లమందిలో మార్పులొస్తే...ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితులు అప్పుడు ఉండవు. నేల నేలలా ఉంటుంది. గాలి గాలిలా ఉంటుంది. ఆకాశం ఆకాశంలా ఉంటుంది. నీరు నీరులా ఉంటుంది. అందరికీ అన్నీ దొరుకుతాయి. కొందరికే అన్నీ దొరికే అవకాశం ఉండదుగాక ఉండదు. రాత్రి మాస్టారిని చూడాలనిపించింది. వారి కథలు చదువుతూ కూర్చున్నాను. కథకులకు మరణం ఉండదు. వారి కథల్లో వారు జీవిస్తూనే ఉంటారు. పిలిస్తే పలుకుతారు.
-జగన్నాథశర్మ
