Facebook Twitter
కలిసి ఉంటే కలదు సుఖం

ఒక గ్రామంలో రెండు వీధులు ఉండేవి. మధ్యలో ఓ చిన్న నీటి కొలను ఉండేది. దాని ముందు శ్రీకృష్ణుడి విగ్రహం ఒకటుంది. ఆ రెండు వీధుల మధ్య సఖ్యత లేకపోవడంతో.. ఎప్పుడో కానీ, ఆ విగ్రహానికి పూజలు చేసేవారు కాదు. ఈ విషయం ఆనోటా ఈనోటా వ్యాపించి పొరుగూరిలోని ఓ కృష్ణ భక్తుడికి చేరింది. 'ఒక పౌర్ణమి రోజు సాయంత్రం నేను మీ ఊరు వస్తాను. ఆ రోజు శ్రీ కృష్ణుడి విగ్రహానికి పూజ చేద్దాం. పాటలు పాడుదాం. పూజకు కావాల్సిన వస్తువులతోపాటు పూలహారం కూడా తీసుకురండి. పాటలు పాడే వారిని నేను తీసుకువస్తాను' అని గ్రామస్తులకు కబురు పంపాడు ఆ భక్తుడు.

పౌర్ణమి రోజు రానే వచ్చింది. ఒక సత్కార్యం చేయబోతున్నందుకు ఆ భక్తుడు ఎంతో సంతోషపడ్డాడు. 'ఎప్పుడెప్పుడు సాయంత్రం కాబోతుందా' అని ఆశగా ఎదురు చూసి పాటలు పాడే బృందంతో కలిసి ఆ గ్రామానికి చేరాడు. అయితే అక్కడ పరిస్థితి వేరుగా కనిపించింది. సఖ్యత లేని ఆ గ్రామస్తులు విగ్రహానికి పూలహారం తీసుకు రాలేదు. 'అది తూర్పు వీధి వారి పని, అది పడమటి వీధి వారి పని' అని రెండు వీధుల వారూ పంతాలకు పోయి హారం తీసుకు రాలేదని ఆ భక్తుడికి అర్థమయ్యింది. 'సరే, జరిగిందేదో జరిగింది. మీ ఇళ్లల్లో పూల మొక్కలు ఉన్నాయా?' అని గ్రామస్తులను అడిగాడు.

'ఎందుకు లేవు? అందరి ఇళ్లల్లోనూ ముద్దబంతి మొక్కలు ఉన్నాయి' అని ఒకేసారి బదులిచ్చారు. ఆ భక్తుడు తన బృందంతో కలిసి ప్రతి ఇంటికీ వెళ్లాడు. ఒక్కో ఇంటి నుంచి ఒక్కో ముద్దబంతి పుష్పాన్ని కోయించుకొని వచ్చాడు. గ్రామానికి చెందిన మహిళల సాయంతో పెద్ద పూలహారాన్ని అల్లించాడు. విగ్రహానికి పూలమాల వేస్తూ 'విడిగా ఉన్నప్పుడు ప్రతి పువ్వూ దేనికదే ప్రత్యేకం.

అన్నిటినీ దారంతో కలిపితే అది హారంగా మారింది. దేవుడి మెడలో అలంకారమైంది. మీరు పంతాలు, పట్టింపులకు పోయి 'ఎవరికి వారే యమునా తీరే' అన్నట్లుగా ఉండకండి. కలిసి పనిచేస్తే అందరూ బాగుపడతారు. కలహాలు కొనసాగిస్తే అందరూ ఇబ్బందిపడతారు. పూలహారంలో పూలు ఒదిగిపోయినట్లు మీరంతా కలిసి జీవించండి' అని హితవు చెప్పాడు. వాస్తవం గ్రహించిన గ్రామస్తులు ఆ సాయంత్రం అంతా శ్రీ కృష్ణుడి విగ్రహం ముందు ఆటపాటలతో ఆనందంగా గడిపారు.