అబద్ధం అందంగా, సత్యం కఠినంగా ఎందుకు ఉంటుది? ఈ చిన్న కథ చదివితే మీకే అర్థమవుతుంది
అబద్ధం అందంగా ఉంటుంది కానీ సత్యం మాత్రం చాలా కఠినంగా ఉంటుంది. ఇది చాలా సార్లు మనం వినే ఉంటాం. అయితే ఈ నానుడి వెనక ఒక చిన్న కథ ప్రాచుర్యంలో ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
అబద్ధాన్ని గొప్పగా చెప్పొచ్చు, కానీ నిజాన్ని మాత్రం గొప్పగా చెప్పలేం. ఎందుకంటే నిజం నిజంగానే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే సత్యం చాలా కఠినంగా ఉంటుంది. అందుకే అబద్ధం వినడానికి, చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది. సత్యం, అబద్ధం ఈ రెండింటి మధ్య తేడాను అద్భుతంగా వివరించే ఓ కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఒకరోజు సత్యం, అబద్ధం రెండూ నడుచుకుంటూ పోతుంటాయి. అబద్ధం మాయ మాటలు చెబుతూ.. ఎవరినీ మోసం చేయాలా.? ఎలా నమ్మించాలా అని చూస్తుంది. కానీ సత్యం మాత్రం నిజాలు మాట్లాడుతుంది. మోసం చేసే అలవాటు ఉన్న అబద్ధం సత్యాన్ని కూడా మోసం చేయాలని నిర్ణయించుకుంటుంది. అలా నడుస్తున్న సమయంలో ఓ సరస్సు వస్తుంది. వెంటనే అబద్ధం మాట్లాడుతూ.. 'చాలా వేడిగా ఉంది. మనం ఈ సరస్సులో స్నానం చేద్దాం' అని సత్యంతో చెబుతుంది.
అబద్ధం మోసం తెలియని సత్యం దుస్తులు తీసేసి నీటిలోకి దిగుతుంది. అయితే అబద్ధం మాత్రం నీటిలోకి దిగకుండా సత్యం దుస్తులను ఎత్తుకొని పారిపోతుంది. ఆ తర్వాత సత్యం దుస్తులు ధరించి బయట తిరడం మొదలు పెడుతుంది. దీంతో తర్వాతి రోజు నుంచి అబద్ధాన్ని ప్రజలు ఇష్టపడడం మొదలు పెడతారు. కానీ దుస్తులు లేకుండా ఉండే సత్యాన్ని చూడ్డానికి ఇష్టపడరు. అబద్ధాన్నే సత్యంగా నమ్మడం ప్రారంభిస్తారు. కానీ కొన్ని రోజుల తర్వాత అబద్ధం అసలు రూపం బట్టబయలు అవుతుంది. ప్రజలకు అసలు విషయం తెలిసి సత్యం గొప్పతనాన్ని తెలుసుకుంటారు.
ఈ కథ మనకు నేర్పే నీతి:
ఈ చిన్న కథ మనకు చెబుతోన్న నీతి ఏంటంటే. ప్రపంచంలో చాలా మంది అబద్ధాన్ని సత్యంగా నమ్మేస్తుంటారు. కానీ నిజమైన సత్యం మాత్రం నిశ్చలంగా నిలిచి ఉంటుంది. సమయం వచ్చినప్పుడు బయటకు వస్తుంది.
