కవిత టిఆర్ఎస్ పసుపు జెండా.. వ్యూహమేంటి?!
Publish Date:Jun 1, 2026
Advertisement
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త సంచలనం రేగుతోంది. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుమార్తె, కల్వకుంట్ల కవిత సరికొత్త రాజకీయ ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. ఆమె 'తెలంగాణ రక్షణ సమితి' (TRS) పేరుతో సరికొత్త ప్రాంతీయ పార్టీని అధికారికంగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే పార్టీ పేరు కంటే కూడా, ఆమె ఎంచుకున్న పార్టీ జెండా రంగు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల పొలిటికల్ సర్కిల్స్‌లో పెను దుమారం రేపుతోంది. కవిత తన టిఆర్ఎస్ పార్టీకి పసుపు రంగును అధికారిక రంగుగా ప్రకటించడం సంచలనం సృష్టించింది. పసుపు రంగు అనగానే అందరికీ గుర్తుకువచ్చేది తెలుగుదేశం పార్టీ. దీంతో రాజకీయ వర్గాల్లో రకరకాల కుట్ర సిద్ధాంతాలు, ఊహాగానాలు మొదలయ్యాయి. ఒకప్పుడు గులాబీ జెండాతో నడిచిన కవిత, ఇప్పుడు పసుపు జెండాను ఎంచుకోవడం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటనే దానిపై జోరుగా విశ్లేషణలు సాగుతున్నాయి. ఈ వివాదంపై.. పసుపు రంగు ఎంపికపై వస్తున్న విమర్శలపై కల్వకుంట్ల కవిత తాజాగా ఒక టీవీ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. పసుపు రంగు అనేది భూమి పుట్టినప్పటి నుండి ఉనికిలో ఉందనీ.. ఆ రంగు కేవలం తెలుగుదేశం పార్టీకి మాత్రమే సొంతం కాదని తేల్చి చెప్పారు. ఈ రంగు ఎంపిక వెనుక రాజకీయ వ్యూహాల కంటే బలమైన సెంటిమెంట్ దాగి ఉందని ఆమె వివరించారు. ముఖ్యంగా నిజామాబాద్ ప్రజలకు పసుపు రంగుతో విడదీయరాని, ఎమోషనల్ అటాచ్‌మెంట్ ఉందని గుర్తు చేసిన కవిత.. నిజామాబాద్ జిల్లాలో పండించే ప్రధాన పంట పసుపు (టర్మరిక్) అని, అక్కడి రైతులకు, ప్రజలకు ఈ రంగుతో విపరీతమైన సెంటిమెంట్ ఉందని వివరించారు. ఒకప్పుడు తాను పార్లమెంట్‌లో నిజామాబాద్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించానని, తన భర్త దేవనపల్లి అనిల్ కుమార్ సైతం నిజామాబాద్ జిల్లా బోధన్ అసెంబ్లీ సెగ్మెంట్‌లోని పోతంగల్ గ్రామానికి చెందినవారేనని చెబుతూ తన నిజామాబాద్ బంధాన్నిచెప్పుకొచ్చారు. కేవలం రైతు సెంటిమెంట్ మాత్రమే కాదు.. పసుపు రంగు ఎంపిక వెనుక ఒక బలమైన మహిళా సెంటిమెంట్ కూడా ఉందని కవిత చెప్పారు. . ఒక మహిళగా పుట్టినప్పటి నుండి చివరి శ్వాస వరకు ప్రతి ఆడబిడ్డ పసుపు కుంకుమ' ఆశీర్వాదాలను ఎంతో పవిత్రంగా భావిస్తుందని, పసుపు కుంకుమలను కోరుకుంటుందని అన్నారు. అందుకే ఒక మహిళగా పసుపు రంగు తన హృదయానికి ఎంతో దగ్గరైనదని, అందుకే తన కొత్త తెలంగాణ రక్షణ సమితి టీఆర్ఎస్ పార్టీకి ఈ రంగును ఎంచుకున్నానని స్పష్టం చేశారు. కవిత ఇంతటి స్పష్టమైన, భావోద్వేగ వివరణ ఇచ్చినప్పటికీ, రాజకీయాల్లో ఈ పసుపు రంగుపై సాగుతున్న మైండ్ గేమ్స్ అంత సులభంగా ఆగేలా కనిపించడం లేదు. ముఖ్యంగా బిఆర్ఎస్ శ్రేణులు ప్రతి చిన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీతో ముడిపెట్టే ప్రయత్నం చేస్తున్న తరుణంలో.. కేసిఆర్ సొంత రక్తమైన కవితను చంద్రబాబు ఏజెంట్ అని విమర్శించడం పరోక్షంగా కేసిఆర్‌ను అవమానించడమే అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
http://www.teluguone.com/news/content/yellow-flag-for-kavitha-trs-party-25-221419.html





