మంత్రి అంబటికి స్థానభ్రంశం తప్పదా?
Publish Date:Jul 29, 2023
Advertisement
మంత్రి అంబటి రాంబాబు పరిచయం అక్కర్లేని పేరు. నిత్యం వివాదాలలో, వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తలలో ఉంటారు. ఆయన సత్తెనపల్లి ఎమ్మెల్యే కూడా. అయితే వచ్చే ఎన్నికలలో జగన్ పార్టీ నుంచి ఆయనకు సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి పోటీకి టికెట్ దొరికే అవకాశాలు అంతంత మాత్రమే అంటున్నారు. నియోజకవర్గంపై పట్టు సాధించినా అంబటిని అక్కడ నుంచి మార్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. అయితే అలా మార్చడానికి కారణం జగన్ సొంతంగా చేయించుకున్న సర్వేలలో ఆయన పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోందని వచ్చిన రిపోర్టు మాత్రం కాదని అంటున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ చార్జ్ గా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ చార్జ్ తీసుకోవడమే అంబటి స్థానభ్రంశానికి కారణమని అంటున్నారు. ఇదేమిటి.. తెలుగుదేశం ఇన్ చార్జ్ గా కన్నా లక్ష్మీనారాయణను ఆ పార్టీ నియమిస్తే.. వైసీపీ ఎమ్మెల్యే మంత్రి అంబటి టికెట్ కు ఎసరేమిటని అనుకుంటున్నారా? అక్కడే ఉంది రాజకీయం. ఏపీ రాజకీయాలలో రాయపాటి సాంబశివరావుకు ఉన్న ప్రాధాన్యత పెద్దగా చెప్పుకోవలసిన అవసరం లేదు. ఆయన ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కానీ కన్నాను సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్ చార్జ్ గా తెలుగుదేశం అధిష్ఠానం నిర్ణయించడంతో రాయపాటి అలిగారు. ఎందుకంటే కన్నా లక్ష్మినారాయణ రాయపాటికి చిరకాల ప్రత్యర్థి. అటువంటి కన్నాను తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడమే కాకుండా, సత్తెనపల్లి టికెట్ ఖరారు చేస్తూ ఆ నియోజకవర్గం ఇన్‌ఛార్జ్‌గా నియమించడంతో రాయపాటికి ఆగ్రహం వచ్చింది. ఈసారి తన కుమారుడికి, మరో ఇద్దరికీ తాను సూచించిన చోట తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వకుంటే తానే రంగంలోకి దిగుతానని రాయపాటి ప్రకటించారు. అయితే ఆయన హెచ్చరిక లాంటి ప్రకటనను పార్టీ అధినేత చంద్రబాబు ఇసుమంతైనా పట్టించుకోలేదు. దీంతో రాయపాటి అలిగారని అంటున్నారు. రాయపాటి అసంతృప్తిని గమనించిన వైసీపీ వెంటనే రంగంలోకి దిగి గుంటూరు లోక్‌సభ, సత్తెనపల్లి శాసనసభ సీటు ఆఫర్ చేసిన్నట్లు తెలుస్తోంది. గుంటూరు నుంచి లోక్‌సభకు రాయపాటి, సత్తెనపల్లి నుంచి శాసనసభకు ఆయన కుమారుడు పోటీ చేసే అవకాశం ఇస్తామన్నది వైసీపీ ఆఫర్ గా చెబుతున్నారు. ఆ ఆఫర్ ను రాయపాటి అంగీకరించే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని పరిశీలకులు చెబుతున్నారు. ఒక వేళ అదే జరిగితే ప్రస్తుతం సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న అంబటికి స్థానభ్రంతం తప్పదని అంటున్నారు. సత్తెనపల్లిలో బలమైన తెలుగుదేశం అభ్యర్థి కన్నాకు దీటుగా నిలవాలంటే అక్కడ రాయపాటి సాంబశివరావు అండ తప్పదని వైసీపీ హై కమాండ్ భావిస్తోందని చెబుతున్నారు. అందుకే ఆయనకు లోక్ సభ, ఆయన కుమారుడికి అసెంబ్లీ సీట్లు ఇచ్చేందుకు వైసీపీ రెడీ అయ్యిందని అంటున్నారు. దీంతో జగన్ ప్రాపకం కోసం విపక్ష నేతలపై ఎంతగా నోరు చేసుకున్నా పాపం అంబటి రాంబాబుకు నియోజకవర్గం మారకతప్పని పరిస్థితి ఎదురైందని వైసీపీ శ్రేణులే అంటున్నాయి.
http://www.teluguone.com/news/content/ycp-to-change-ambati-25-159163.html





