తెలంగాణలో బీఆర్ఎస్ కు ఎదురీతే.. ఇండియా టీవీ, సీఎన్ఎక్స్ సర్వే వెల్లడి
Publish Date:Jul 29, 2023
Advertisement
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏ ముహూర్తాన టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మార్చి జాతీయ పార్టీగా ప్రకటించారో కానీ.. ఆ క్షణం నుంచీ పార్టీకీ, ఆయనకు వరుస కష్టాలు తప్పడం లేదు. జాతీయ స్థాయిలో సత్తా సంగతేమిటో కానీ రాష్ట్రంలో ఆ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ సాధిస్తుందా అంటే పరిశీలకులు మాత్రం అనుమానమనే అంటున్నారు. అందుకు తగ్గట్టుగానే ఇండియా టీవీ, సీఎన్ఎక్స్ సంస్థలు కలిపి ఇటీవల దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో తెలంగాణలో అధికార బీఆర్ఎస్ గ్రాఫ్ వేగంగా పడిపోతున్నదని తేలింది. ఆ సర్వే పూర్తిగా లోక్ సభ నియోజకవర్గాలలో ఏ పార్టీకి విజయావకాశాలు అన్న విషయానికే పరిమితమైంది. ఆ సర్వేలో తెలంగాణలో ఉన్న 17 పార్లమెంటు నియోజకవర్గాలలో బీఆర్ఎస్ సగానికి పైగా సీట్లలో గడ్డుపరిస్థితి ఎదుర్కొంటున్నదని తెలింది. ప్రస్తుతం బీఆర్ఎస్ కు లోక్ సభలో తొమ్మిది స్థానాలు ఉన్నాయి. అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఆ స్థానాలలో కొన్నిటిని బీఆర్ఎస్ కోల్పోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని సర్వే పేర్కొంది. అదే సమయంలో బీజేపీ గెయిన్ అవుతుందని సర్వే తెలపింది. ప్రస్తుతం బీజేపీకి లోక్ సభలో నాలుగు స్థానాలు ఉంటే.. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో అదనంగా మరో రెండు లేదా మూడు స్థానాలలో గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని సదరు సర్వే పేర్కొంది. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే ప్రస్తుతం ఉన్న మూడు స్థానాలను నిలుపుకోవడం ఒకింత కష్టమేనని పేర్కొంది. మజ్లిస్ పార్టీకి తెలంగాణలో ఉన్న ఏకైక లోక్ సభ స్థానాన్ని నిలుపుకుంటుందని సర్వే తేల్చింది. తెలంగాణలో గతంలో కంటే ఎక్కువ లోక్ సభ స్థానాలలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ కు ఈ సర్వే ఫలితం ఒక రకంగా షాక్ అనే చెప్పవచ్చు. తెలంగాణలో మరింత బలపడి, మహారాష్ట్రలో కూడా గణనీయంగా లోక్ సభ స్థానాలను గెలుచుకుని జాతీయ స్థాయిలో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్న బీఆర్ఎస్ కు ఇండియా టీవీ, సీఎన్ఎక్స్ సంయుక్తంగా జరిపిన సర్వే ఫలితం కంగుతినిపించేలాగే ఉందని చెప్పడానికి సందేహం అవసరం లేదు. లోక్ సభ స్థానాలలో ఓటమి ఆ నిష్పత్తిలో అసెంబ్లీ స్థానాలలో ఓటమికి సూచనగా పరిశీలకులు చెబుతున్నారు. కేంద్రంలో ఈసారి ఏ కూటమి నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పాటు కావాలన్నా బీఆర్ఎస్ మద్దతు అనివార్యమని, కేసీఆర్ చక్రం తిప్పడం ఖాయమని మంత్రి హరీశ్‌రావు ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి విదితమే.అయితే తాజా సర్వేలో కేసీఆర్ కు జాతీయ స్థాయిలో ప్రాధాన్యత పెద్దగా ఉండే అవకాశం లేదని తేటతెల్లమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/hard-time-to-brs-in-telangana-25-159169.html





