నాడు ఊస్టింగ్.. నేడు పోస్టింగ్ !
Publish Date:Jun 17, 2023
Advertisement
ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మాజీ మంత్రి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత భర్త మేకతోటి దయాసాగర్‌కు వైయస్ జగన్ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఆయన్ని మచిలీపట్నం పోర్ట్ డవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా నియమించినట్లు తెలుస్తోంది. దీంతో మేకతోటి సుచరిత, ఆమె భర్త పార్టీ మార్పుపై జరుగుతోన్న ఊహాగానాలకు ఇక తెరపడినట్లే అంటున్నారు. జగన్ తొలి కేబినెట్‌లో హోం మంత్రిగా ఆమెకు పదవి కట్టబెట్టినా.. నామ్ కా వాస్తే అన్నట్లుగా మంత్రి పదవి నిర్వహించారని.. అంతా సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణరెడ్డే.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్.. ఓ ఆర్డర్‌లో ఉండేలా చూసేవారు. అలాగే హోం శాఖ వ్యవహారాలు తెలియజేయడానికి ప్రెస్ మీట్ సైతం ఆయన నిర్వహించేవారు. అయితే ముఖ్యమంత్రి జగన్ .. తన మలి కేబినెట్ కసరత్తులో భాగంగా సుచరిత పోస్టింగ్‌ను కోవ్వూరు ఎమ్మెల్యే తానేటి వనితకు కట్టబెట్టిన విషయం విదితమే. దీంతో మేకతోటి సుచరిత అలిగారు... బుంగమూతి పెట్టుకొన్నారు. ఇక ఫ్యాన్ పార్టీకి మేకతోటి సుచరిత రాజీనామా చేస్తున్నారంటూ ఆమె కుటుంబ సభ్యులు స్వయంగా మీడియా ముందుకు వచ్చి మరీ ప్రకటించారు. ఆ క్రమంలో సుచరిత నివాసానికి ఫ్యాన్ పార్టీ ఎంపీ, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ వెళ్లి మంత్రాంగం నెరిపినా.. ఆమె ఎక్కడా తగ్గేదే లే అన్నట్లుగా వ్యవహరించడంతో.. ఈ పంచాయతీ కాస్తా తాడేపల్లి ప్యాలెస్‌కు చేరింది. ఆ క్రమంలో సదరు ప్యాలెస్‌లోని అగ్రనేతల నుంచి సుచరితకు పిలుపు రావడంతో.. ఆమె వెళ్లక తప్ప లేదు. అందులోభాగంగా వీరి మధ్య చర్చలు జరిగినా.. ఆమె మాత్రం తీవ్ర అసంతృప్తితోనే ఉన్నారన్న విషయం అందరికీ తెలిసిందే. ఇటీవల ఓ సమావేశంలో మేకతోటి సుచరితతోపాటు ఆమె భర్త పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన భర్త ఏ పార్లీలోకి వెళ్లినా ఆయన వెంట అడుగులో అడుగు వేసుకొంటూ వెళ్తానని క్లియర్ కట్‌గా చెప్పేశారు. దీంతో తాను పార్టీ మారుతున్నానని సుచరిత క్లారటీ ఇచ్చేశారని పార్టీ శ్రేణులే చెప్పాయి. అయితే మేకతోటి సుచరిత భర్త మేకతోటి దయాసాగర్‌కు తాజాగా వైసీపీ పోస్టింగ్ ఇవ్వడంతో సుచరిత అలిగి, ఆగ్రహం వ్యక్తం చేసి తాను కావాలనుకున్నది సాధించుకున్నారని పార్టీ వర్గాలే అంటున్నాయి. ఎందుకంటే... రాష్ట్ర హోం మంత్రిగా మేకతోటి సుచరిత ఉండగా.. ఆమె భర్త మేకతోటి దయాసాగర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆ క్రమంలో వైసీపీలోని పలువురు కీలక నేతలు విజయవాడలోని ఆయన కార్యాలయానికి క్యూ కట్టి మరీ పుప్పగుచ్ఛాలు అందించి.. ఆయన్ని అభినందించి మరీ వచ్చారు. అందుకు సంబంధించిన ఫొటోలు సైతం అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియలో అప్పట్లో వైరల్ అయినాయి. మరోవైపు ఉమ్మడి గుంటూరు జల్లాలోని ఓ లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికల బరిలో దిగేందుకు మేకతోటి దయాసాగర్.. ముందు చూపుతో ఏపీకి బదిలీపై వచ్చారంటూ అప్పట్లో వైసీపీలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దీంతో ఈ విషయాన్ని పసిగట్టిన.. సొంత పార్టీలోని అదే జిల్లాకు చెందిన కీలక నేతలు.. హుటాహుటిన దేశ రాజధాని ఢిల్లీ చేరుకొని.. ఓ రాష్ట్రానికి హోం శాఖ మంత్రిగా ఉన్న వ్యక్తి భర్త అదే రాష్ట్రానికి ఐటీ చీఫ్ కమిషనర్‌గా ఉండడం చట్ట విరుద్దమంటూ.. కేంద్ర హోం, ఆర్థిక శాఖ మంత్రులతో పాటు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఉన్నతాధికారులకు వరుసపెట్టి ఫిర్యాదులు చేయడమే కాకుండా.. మేకతోటి దయాసాగర్‌ను ఆంధ్రప్రదేశ్ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేసే వరకు.. ఆ కీలక నేతలు ఢిల్లీలోనే ఉండి.. ఆయన బదిలీ ఫైల్‌ను అనుక్షణం ఫాలో ఆప్ చేసి.. దయాసాగర్‌ను మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌కు పోస్టింగ్ వేసే వరకు ఓ మహా యజ్జమే చేశారనే ఓ చర్చ అప్పట్లో జోరుగా సాగింది. అయితే ఆయన అక్కడ ఆ ఉద్యోగ బాధ్యతలు చేపట్టి.. కొద్ది రోజుల తర్వాత.. తన ఉద్యోగానికి రాజీనామా చేసి దయాకరరావు ఏపీకి వచ్చేసిన విషయం తెలిసిందే. ఆ క్రమంలో వీరిద్దరు పార్టీ మార్పుపై ఊహగానాలు ఊపందుకొన్నా.. ఈ దంపతులు మాత్రం.. ఎన్నికలకు ఇంకా టైమ్ ఉంది అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని చర్చ సైతం సాగుతోంది. అలాంటి వేళ జగన్ ప్రభుత్వం.. మేకతోటి సుచరిత భర్తకు ఈ పోస్టింగ్ ఇచ్చినట్లు సమాచారం. అయితే మేకతోటి దయాసాగర్ మాత్రం ఉమ్మడి గుంటూరు జిల్లాలోని లోక్‌సభ స్థానంపై ఆశలు పెట్టుకొన్నారు. మరి ఆ స్థానాన్ని ఆయనకు కట్టబెట్టాలంటే.. ప్రస్తుతం ఉన్న లోక్ సభ సభ్యుడిని కూల్ కూల్ చేయాల్సి ఉంటుందని.. అయితే సదరు ఎంపీగారు కూల్ అయే పరిస్థితి ప్రస్తుతానికి లేదనే ఓ టాక్ సైతం వాడి వేడిగా నడుస్తోంది. మరి అలాంటి వేళ.. మేకతోటి వారు ఫ్యాన్ పార్టీలోనే ఉంటారా? లేకుంటే జంప్ జిలానీ రాగం ఆలపించి.. జనసేన లేదా తెలుగుదేశం గూటికి చేరిపోతారా అంటే కొద్ది రోజులు మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది.
http://www.teluguone.com/news/content/ycp-gives-a-posting-to-mekatota-dayasagar-39-157001.html





