రక్షించి.. భక్షించారు..?
Publish Date:Oct 3, 2016
Advertisement
మన సినిమాల్లో నిజాయితీ గల పోలీసు అధికారులు స్మగర్లతో పోరాడి వారి వద్ద నుంచి అక్రమ సొత్తును స్వాధీనం చేసుకుంటారు. కాని సదరు డిపార్ట్‌మెంట్‌కి చెందిన కొందరు అవినీతి అధికార్లు తిరిగి వాటిని స్మగ్లర్ల చెంతకే చేరుస్తారు. అచ్చం ఇప్పుడు అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటోంది ప్రపంచం. ప్రాణాలకు తెగించి అటవీ అధికారులు స్మగ్లర్ల నుంచి కాపాడిన వేలాది అటవీ జంతువులు మాయం కావటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. 2010 నుంచి 2014 వరకు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో అక్రమ తరలింపుదారుల నుంచి స్వాధీనం చేసుకున్న దాదాపు 64 వేలకు పైగా జంతువుల ఆచూకీ నేడు లభించటం లేదని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ వన్యప్రాణుల పరిరక్షణ పరిశోధన విభాగం, ప్రపంచ జంతు పరిరక్షణ సంస్థల పరిశోధనలో తేలింది. స్మగ్లర్ల బారి నుంచి వాటిని కాపాడినట్లు ఆయా దేశాల్లోని వన్యప్రాణుల పరిరక్షణ విభాగాలు అప్పట్లో స్వాధీనం చేసుకున్నవాటిని మీడియా సాక్షిగా వివరించినప్పటికి ప్రస్తుతం మాత్రం తాజా గణాంకాలను వివరించలేకపోతున్నాయని పేర్కొంది. అంటే దీనిని బట్టి అవి మళ్లీ స్మగ్లర్ల చేతిలోకే వెళ్లాయా..? లేదంటే వాటి భద్రత దృష్ట్యా గుర్తు తెలియని ప్రాంతాల్లో పునరావాసం కల్పించారా అన్నది తెలియాల్సి ఉందని స్పష్టం చేసింది. ఈ సంస్థలు ఇలా అనుమానం వ్యక్తం చేయటానికి అనేక కారణాలున్నాయి. మిగతా దేశాల సంగతి పక్కన బెడితే మనదేశంలో లంచంతో అవ్వని పనంటూ ఏది లేదు. అనేక విభాగాల్లో నిజాయితీ గల అధికారులతో పాటు అవినీతి అధికారులు కూడా ఉన్నారు. ఆ అవినీతి అధికారులు చాలా సులభంగా స్మగ్లర్ల ఎరకు చిక్కుతారు. ఇంకేముంది లంచం తీసుకున్న కృతజ్ఞతతో స్మగ్లర్లు చెప్పింది చెప్పినట్లు చేయటమే పనిగా పెట్టుకుంటున్నారు సదరు అవినీతి అధికారులు. ఏకంగా అధికారులే తమతో కుమ్మక్కవడంతో స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. దీనికి ఎన్నో ఉదాహరణలు మనం నిత్యం వార్తల్లో చూస్తూ ఉంటాం. అధికారుల అవినీతితో పాటు కొందరు రాజకీయ నాయకుల అండదండలు కూడా పుష్కళంగా ఉండటంతో స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. అందుకే ఒకసారి పట్టుకున్న జంతువులను కూడా తిరిగి తమ వద్దకే రప్పించుకోగలుగుతున్నారు. ఫలితంగా ఎన్నో అటవీ ప్రాణులు అంతరించిపోతున్నాయి. ఈ నేపధ్యంలో తమ పరిశీలనలో తేలిన ఈ అంశాలను వన్యప్రాణుల పరిరక్షణ అంశమై ఈ నెల 27న జోహాన్స్‌బర్గ్‌లో ప్రారంభం కానున్న సదస్సులో వెల్లడిస్తామని సదరు సంస్థలు ప్రకటించాయి.
http://www.teluguone.com/news/content/wildlife-conservation-research-unit-45-67329.html





