చేవ చచ్చిందా? రోషం తగ్గిందా? జగన్‌రెడ్డి పౌరుషం ఏమైపోయింది?
Publish Date:Jun 25, 2021
Advertisement
వైఎస్ జగన్ సీమ బిడ్డ. కడప పౌరుషానికి ప్రతీక. ప్రాణాలైనా వదిలేస్తారు, అవసరమైతే ప్రాణాలైనా తీస్తారు కానీ.. రోషాన్ని మాత్రం వదులుకోరు. అందులోనూ, ఫ్యాక్షనిస్ట్‌గా పేరున్న రాజారెడ్డి రక్తం జగన్‌లో ప్రవహిస్తోంది. వైఎస్సార్ తనయుడిగా రాజకీయంగా రాటుదేలారు. కేసులు, జైలు శిక్షలతో జగజ్జంత్రీగా మారారు. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో మరింత పవర్‌ఫుల్‌గా ఎదిగారు. అలాంటి జగన్‌రెడ్డిని పట్టుకొని తెలంగాణ మంత్రులు అంతంత మాటలు అంటుంటే.. ఆయనలో చేవ చచ్చిందా? అనే అనుమానం రాకమానదు. జగన్‌తో పాటు చనిపోయిన ఆయన తండ్రి వైఎస్సాఆర్‌నూ నోటికొచ్చినట్టు దుర్భాషలాడుతుంటే.. జగన్‌లోని పౌరుషం, రోషం ఏమైపోయిందని ఆశ్చర్యపోతున్నారు. వైఎస్ కుటుంబాన్నే కాదు.. లంకలో పుట్టిన వాళ్లంతా రాక్షసులేనంటూ ఏపీ ప్రజలందరినీ తెలంగాణ మంత్రి దారుణంగా నిందిస్తే.. నోరు మెదపని ఏపీ ముఖ్యమంత్రిని ఏమనాలి? ఆ మాటలు వింటుంటే ప్రజలకే ఒళ్లు మండుతోంది.. మరి, జగన్‌రెడ్డికి ఇంకెంతగా రక్తం మరగాలి? తెలంగాణ మంత్రులకు జగన్‌రెడ్డి ఎందుకంతలా భయపడుతున్నారు? మంత్రుల నోటికే తాళం వేయలేని వారు.. ఇక కేసీఆర్ నోరు తెరిస్తే అదుపు చేయగలరా? అసలు సీఎం జగన్‌రెడ్డి తెలంగాణకు ఎందుకంతలా బెదిరిపోతున్నారు? తనను, తన తండ్రిని, తన రాష్ట్ర ప్రజలను అంతేసి మాటలు అంటుంటే.. జగన్‌రెడ్డి నోరు మూసుకొని పడుతుండటం దేనికి నిదర్శనం? తాజాగా, తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వైఎస్ కుటుంబంపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డిపై నోటికొచ్చినట్టు దూషించారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. మావోయిస్టుల పేరుతో ఎంతో మందిని బలి తీసుకున్నారని.. తెలంగాణకు చెందిన భూములు, ఆస్తులు దోచుకున్నారని.. అక్రమ కేసులతో అమాయకులను వేధించారని.. గ్రూప్ 1 పోస్టుల్లో ఏపీకి అనుకూలంగా అక్రమాలకు పాల్పడ్డారంటూ సంచలన ఆరోపణలు చేశారు. దొంగను దొంగ అనకుండా దొర అంటారా? అంటూ మరో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి వ్యాఖ్యలను సమర్థించేలా మరింత మంట రాజేశారు మంత్రి శ్రీనివాస్‌గౌడ్. వైఎస్సార్‌ను మాత్రమే కాదు.. ఏపీ సీఎం జగన్‌రెడ్డిపైనా విమర్శలకు దిగారు ఆయన. ఏపీలో బలహీన వర్గాలను జగన్ అణగదొక్కుతున్నారంటూ డైరెక్ట్ అటాక్ చేశారు. ఇటీవల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి.. వైఎస్సార్ నీళ్ల దొంగ, జగన్ గజదొంగ అంటూ సంచలన కామెంట్లు చేయడం కలకలం రేపింది. ఇలా తెలంగాణ మంత్రులు ఇటు జగన్‌ను అటు వైఎస్సార్‌ను టార్గెట్ చేస్తూ అంతేసి మాటలు మాట్లాడుతున్నా.. జగన్ తరఫు నుంచి స్ట్రాంగ్ కౌంటర్ పడకపోవడం ఆశ్చర్యంగా ఉందంటున్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల సైతం.. చాలా సౌమ్యంగా., కేసీఆర్‌తో చర్చలకు జగన్ సిద్దమంటూ సరెండర్ అయ్యేలా మాట్లాడటం మరింత విడ్డూరం. తెలంగాణ మంత్రులు నేరుగా జగన్‌ను టార్గెట్ చేసి మాటలతో తూట్లు పొడుస్తున్నా.. ఎలాంటి నొప్పి లేదన్నట్టు మౌనంగా ఉండటం అనుమానాలకు తావిస్తోంది. వైసీపీ శ్రేణులంతా మహానేతగా చెప్పుకునే వైఎస్సార్‌ను సైతం దారుణంగా అవమానించేలా విమర్శలు చేస్తున్నా.. తన తండ్రిని అంతేసి మాటలు అంటున్నా.. సీమ బిడ్డ, రాజారెడ్డి మనువడు.. జగన్‌రెడ్డిలో ఏమాత్రం రోషం, పౌరుషం పొడుచుకు రాకపోవడం వెనుక ఏదో తెలీని భయం ఉండి ఉంటుందని అంటున్నారు. చంద్రబాబు, లోకేశ్ మీద అదే పనిగా విరుచుకుపడే జగన్ బ్యాచ్.. నిత్యం బూతులు మాట్లాడే మంత్రి కొడాలి నానిలాంటి వాళ్లు సైతం.. తెలంగాణ మంత్రులను పళ్లెత్తి మాట అనకపోవడం ఆశ్చర్యంగా లేదు? తెర వెనుక ఏదో బలమైన కారణమో.. వ్యూహమో ఉందనే అనుమానం రావడం లేదు? ఏదిఏమైనా.. ఎంత అవసరం ఉన్నా.. చనిపోయిన తన తండ్రి వైఎస్సార్‌ను తెలంగాణ నాయకులు అంత ఘోరంగా అవమానిస్తుంటే కూడా.. జగన్‌రెడ్డి మౌనంగా ఉండటం మాత్రం దారుణం అంటున్నారు ఆయన అభిమానులు.
http://www.teluguone.com/news/content/why-cm-jagan-silent-on-telangana-ministers-hot-comments-25-118345.html





