ముదురుతున్న వాటర్ వార్.. ఏపీ రియాక్షన్ పవర్ ఫుల్..
Publish Date:Jun 25, 2021
Advertisement
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం మరింత ముదురుతోంది. కృష్ణా జలాలను తరలించుకుపోయేందుకు ఏపీ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులు కడుతుందని కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేయడం.. వెంటనే స్పందించిన కృష్టా బోర్డు ప్రాజెక్టులు ఆపాలని ఏపీ సర్కార్ కు లేఖ రాయడం జరిగిపోయింది. ఇక ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్ నేతలు తీవ్రంగా మాట్లాడుతున్నారు. జగన్ తో పాటు దివంగత వైఎస్సార్ ను టార్గెట్ చేస్తున్నారు. అటు వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తుండటంతో వాటర్ వార్ హీటెక్కింది. తమపై తెలంగాణ సర్కార్ ఫిర్యాదు చేయడంతో... అదే స్థాయిలో కౌంటరిచ్చింది ఏపీ ప్రభుత్వం. శ్రీశైలం జలాశయం నుంచి విద్యుదుత్పత్తి పేరుతో తెలంగాణ నీటిని వాడుకుంటోందని ఆరోపిస్తూ కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డుకు ఫిర్యాదు చేసింది. ఇది ఏపీ నీటి ప్రయోజనాలకు తీవ్ర విఘాతమని అభ్యంతరం చెప్పింది. వెంటనే విద్యుత్ ఉత్పత్తిని ఆపించాలని డిమాండ్ చేస్తూ.. ఆంధ్రప్రదేశ్ జల వనరులశాఖ ఇంజినీరు ఇన్ చీఫ్ (ఈఎన్‌సీ) సి.నారాయణరెడ్డి లేఖ రాశారు. కృష్ణా బోర్డు అనుమతి లేకుండానే శ్రీశైలం జలాలతో ఎడమ గట్టు విద్యుత్కేంద్రంలో విద్యుత్తు ఉత్పత్తి చేసి నీటిని దిగువకు వదిలేస్తున్నారని చెప్పారు. ఇప్పటికే ఒకసారి ఈ విషయాన్ని కృష్ణా బోర్డు దృష్టికి తీసుకొచ్చినా విద్యుదుత్పత్తి కొనసాగుతూనే ఉందని ఏపీ ఈఎన్‌సీ గుర్తు చేశారు. ఇప్పటికే పలుమార్లు చెప్పినా వినే పరిస్థితి లేదని, శ్రీశైలంలో ప్రస్తుతం 808 అడుగుల్లోనే నీరు ఉందని, అయినా తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి పేరుతో నీటిని వాడుకుంటోందని కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శికి రాసిన లేఖలో ఈఎన్సీ నారాయణరెడ్డి ఆరోపించారు. 834 అడుగులు ఉంటేనే విద్యుత్ ఉత్పత్తి చేయాలన్న నిబంధన ఉన్నా దాన్ని పాటించడం లేదని వివరించారు. కృష్ణా బోర్డ్ అనుమతి లేకుండానే నీటిని విడుదల చేస్తోందని పేర్కొన్నారు. జూన్ 1 నుంచి ప్రారంభమైన నీటి ఏడాదిలో ఇప్పటి వరకు శ్రీశైలంలోకి 8.98 టీఎంసీలే వచ్చాయని, అందులో 3.09 టీఎంసీలను తెలంగాణ వాడుకుందని ఏపీ ఈఎన్‌సీ లేఖలో పేర్కొన్నారు. మొత్తం నీటి ప్రవాహా౦లో ఇది 34 శాతం తెలంగాణ వాడుకుందని తెలిపారు. విద్యుత్ ఉత్పత్తి ఆపకపోతే శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం పడిపోతుందని, అదే జరిగితే పోతిరెడ్డిపాడుకు నీటి సరఫరా కష్టమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. జలాశయంలో 854 అడుగులు ఉంటేనే పోతిరెడ్డిపాడుకు నీటిని సరఫరా చేసే పరిస్థితి ఉందన్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా చెన్నైకి, మిగిలిన ప్రాజెక్ట్‌లకు నీటి సరఫరా కష్టంగా మారుతుందన్నారు. ఈ నేపథ్యంలో వెంటనే విద్యుత్ ఉత్పత్తిని ఆపించాలని కృష్ణా బోర్డును ఏపీ ఈఎన్‌సీ నారాయణరెడ్డి కోరారు. వరదల సమయంలో తప్ప శ్రీశైలం, నాగార్జున సాగర్ ఉమ్మడి జలాశయాల నుంచి కృష్ణా బోర్డు అనుమతి లేకుండా నీటిని తీసుకోవడానికి వీలు లేదని, తెలంగాణ విద్యుదుత్పత్తికి ఎలాంటి అనుమతులు లేవని ఏపీ ఈఎన్సీ నారాయణ రెడ్డి తన లేఖలో వివరించారు.
http://www.teluguone.com/news/content/ap-govt-complaint-on-ts-govt-over-krishna-water-use-25-118341.html





