ఏపీలో బీఆర్ఎస్ ఎక్కడ? అసలుందా?
Publish Date:May 22, 2023
Advertisement
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆంధ్రప్రదేశ్ మీద చాలా హోప్స్ పెట్టుకుంది. తెలంగాణలో పార్టీ కమిటీలను ఏర్పాటు చేయకముందే ఏపీ శాఖకు అధ్యక్షుడిని ఎంపిక చేసింది. అక్కడి నుంచి బీఆర్ఎస్ లో చేరికలను పెద్ద ఎత్తున ప్రోత్సహించడమే కాకుండా..అలా చేరేవారికి వాహనాలు ఏర్పాటు చేసి మరీ హైదరాబాద్ కు తోలుకు వచ్చింది. నగరమంతటా వారికి స్వాగతం చెబుతూ ఫ్లెక్సీలూ ఏర్పాటు చేసింది. అంతే కాదు ఏపీలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం. విశాఖ స్టీల్ ప్రైవేటుపరం కాకుండా బీఆర్ఎస్ అడ్డుకుంటుంది.. బిడ్ వేసి అవసరమైతే ఫ్యాక్టరీని సొంతం చేసుకుంటుందంటూ చాలా చాలా కబుర్లు చెప్పింది. అంతే ఆ తరువాత ఏపీలోని బీఆర్ఎస్ శాఖ అసలు ఉందో లేదో తెలియనంతగా సైలెంట్ అయిపోయింది. ఎంతా ఆర్భాటంగా విశాఖ స్టీల్ బిడ్ లో పాల్గొంటామంటూ సింగరేణి అధికారులను పంపి పరిశీలించిన తరువాత ఏమైందో ఏమో మిన్నకుండిపోయింది. దాంతో ఏపీలో బీఆర్ఎస్ పట్ల భ్రమలు.. ఏమైనా ఉంటే అవి పూర్తిగా అడుగంటిపోయాయి. అలాగే ఏపీ సీఎం జగన్‌ది అప్పుల ప్రభుత్వం. కేసీఆర్ సంక్షేమ-అభివృద్ధి ప్రభుత్వాన్ని చూసి జగన్ చాలా నేర్చుకోవాలి అంటూ ఏపీ బీఆర్‌ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్, అనేక సందర్భాల్లో విమర్శలు చేశారు. ఇక తెలంగాణ మంత్రులు కూడా అవకాశం ఉన్నా లేకపోయినా.. సందర్భం ఉన్నా లేకపోయినా ఏపీ అభివృద్ధి లేమి గురిచి విమర్శలూ వ్యాఖ్యలూ చేశారు. అవన్నీ పక్కన పెడితే ఇంతని అంతని గుంటూరులో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయ ప్రారంభోత్సవానికి కేసీఆర్ వస్తున్నారంటూ బిల్డప్ ఇచ్చారు. హడావుడీ, హంగామా చేశారు. చివరకు ఆ కార్యాలయ ప్రారంభ కార్యక్రమం ఎవరికీ పుట్టిన బిడ్డరా ఎక్కెక్కి ఏడుస్తోంది అన్న చందంగా ఎవరికీ పట్టని ఒకె ప్రైవేటు కార్యక్రమంగా చప్పగా సాగిపోయింది. కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని చేసిన ప్రచారమూ ఉత్తుత్తిదేనని తేలిపోయింది.
http://www.teluguone.com/news/content/where-is-brs-in-ap-25-155735.html





