అవినాష్ చివరి ఆశ
Publish Date:May 22, 2023
Advertisement
అందితే జుట్టు అందకపోతే కాళ్లు అన్న సామెతను గుర్తు చేస్తున్నారు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి. గత నాలుగు నెలలుగా సీబీఐని ముప్పుతిప్పలు పెడుతూ.. తన ఇష్టం వచ్చినప్పుడు విచారించాలని హుకుం జారీ చేస్తూ వచ్చిన అవినాష్ రెడ్డి ఇప్పుడు దారులన్నీ ముగిసిపోయి బంతి సీబీఐ కోర్టులో ఉండటంతో కాళ్ల బేరానికి వచ్చారు. చివరి ఆశగా ముందస్తు బెయిలు కోసం సుప్రీం వెకేషన్ బెంచ్ లో వేసిన పిటిషన్ ను విచారించడానికి సర్వోన్నత న్యాయ స్థానం నిరాకరించింది. అవినాష్ ను కాపాడేందుకు కర్నూలు పోలీసులు శాంతి భద్రతల సాకు చూపితే సీబీఐ కేంద్ర బలగాలను రప్పించింది. దీంతో ఇక సీబీఐని అడ్డుకోవడం సాధ్యం కాదన్న నిర్ణయానికి వచ్చిన అవినాష్ రెడ్డి కేంద్ర దర్యాప్తు సంస్థతో కాళ్ల బేరానికి వచ్చారు. కనీసం ఈ నెల 27 వరకూ తనకు గడువు ఇవ్వాలనీ, ఆ తరువాత విచారణకు హాజరౌతాననీ పేర్కొంటూ తాజాగా మరో లేఖ రాశారు. ఆ లేఖలో తన తల్లి అనారోగ్యం గురించి ప్రస్తావించారు. తన తల్లి కోలుకోగానే విచారణకు రెక్కలు కట్టుకుని మరీ హాజరౌతానని పేర్కొన్నారు. అయితే అవినాష్ తాజా లేఖపై సీబీఐ నుంచి ఇంత వరకూ స్పందన రాలేదు. మరో వైపు హైదరాబాద్ నుంచి బయలు దేరిన కేంద్ర బలగాలు కర్నూలు చేరుకున్నాయి. సీబీఐ అధికారులు ఆదేశించగానే విశ్వభారతి ఆస్పత్రికి చేరడానికి సర్వ సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అవినాష్ లేఖపై సీబీఐ ఏ విధంగా స్పందిస్తుందన్న ఆసక్తి నెలకొంది. మరో వైపు పరిశీలకులు మాత్రం అవినాష్ తాజా లేఖలో 27 వరకూ గడువు కోరడానికీ.. జగన్ హస్తిన పర్యటనకూ లింకు ఉందని విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా అవినాష్ లేఖను సీబీఐ పరిగణనలోనికి తీసుకుంటుందా? లేదా అన్నది మరి కొద్ది సేపటిలో తేలిపోనుంది. దారులన్నీ మూసుకుపోక ముందు వరకూ సీబీఐపై కనీస మర్యాద చూపని అవినాష్ ఇప్పడు బేలగా రాసిన లేఖకు సీబీఐ సానుకూలంగా స్పందించే అవకాశాలూ దాదాపు మృగ్యమనే పరిశీలకులు అంటున్నారు. అన్నిటికీ మించి స్థానిక పోలీసులు సీబీఐ అధికారులకు సహకరించకపోవడం, సీబీఐని వాహనాలు కానీ, అధికారులు కానీ ఆస్పత్రిలోకి అడుగుపెట్టే అవకాశం లేకుండా ఆస్పత్రి ప్రధాన ద్వారం వద్ద అవినాష్ అనుచరులు, వైసీపీ కార్యకర్తలు బైఠాయించడం.. దీంతో గంటల తరబడి దర్యాప్తు సంస్థ అధికారులు కర్నూలులో నిస్సహాయంగా నిలబడిపోయే పరిస్థితి ఏర్పడటం ఇవన్నీ సీబీఐ ప్రతిష్టను దారుణంగా దెబ్బ తీసిన నేపథ్యంలో ఇంత వరకూ వచ్చాకా ఇక వెనకడుగు వేయవద్దని కేంద్ర దర్యాప్తు సంస్థ హెడ్ క్వార్టర్స్ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయని చెబుతున్న నేపథ్యంలో సీబీఐ అవినాష్ తాజా లేఖపై సానుకూలంగా స్పందించే అవకాశాలు లేవని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/avinash-writes-to-cbi-25-155741.html





