ఇరాన్ ఇజ్రాయెల్ వార్.. ప్రాణ, ఆస్తి నష్టమెంత?
Publish Date:Mar 4, 2026
Advertisement
ఇరాన్ ఇజ్రాయెల్ వార్ లో ఇప్పటి వరకూ జరిగిన ప్రాణ ఆస్తి నష్టమెంత? అసలీ యుద్ధ ప్రభావం ఏయే దేశాలపై ఉంది? ఈ యుద్ధం ఎవరెవరిని ఎక్కువగా బాధిస్తోంది? అంటే.. గత నాలుగు రోజులుగా జరుగుతున్న యుద్ధంలో ఇరాన్ లో 780 నుంచి 1200 వరకూ మరణాలు సంభవించినట్టుగా తెలుస్తోంది. ఇరాన్ లోని ఇరానియన్ రెడ్ క్రెసెంట్, ఇతర వర్గాల ఈ సమాచారం వెలుగులోకి వచ్చింది. వీరిలో సామాన్య పౌరులతో పాటు 48 మంది కీలక సైనికాధికారులు ఉన్నారు. జనవరిలో జరిగిన అంతర్గత నిరసనల్లో చనిపోయిన కొన్ని వేల మంది కాకుండా.. కేవలం ఈ యుద్ధం వల్లే ఇప్పటి వరకూ వెయ్యి మంది చనిపోయినట్టు తెలుస్తోంది. ఇక ఇరాన్ జరిపిన ప్రతీకార క్షిపణి దాడుల్లో.. ఇజ్రాయెల్లో సుమారు 40 మంది వరకూ మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. ఇక లెబనాన్ లో హిజ్బుల్లా దాడుల్లో 50 మందికి పైగా చనిపోగా.. యూఏఈ, కువైట్, బహ్రెయిన్ వంటి గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడుల కారణంగా.. పది మంది వరకూ మరణించారు. అందుకే బెహ్రయిన్ హోం మంత్రి ఇక్కడి నుంచి ఇరాన్ కి మద్దతు ఇచ్చేవారు ఆ దేశానికే వెళ్లిపోండి ఇక్కడ ఉండకండని పిలుపు నిచ్చారు. ఇరాన్.. దాడుల్లో పది మందికి పైగా అమెరికా సైనికులు మరణించారు. ఈ యుద్ధం ప్రస్తుతం రెండు దేశాల మధ్య జరుగుతున్నట్లు కనిపించినా, దీని ప్రభావం దాదాపు 10 దేశాల ప్రత్యక్షంగా పడుతోంది. ఇరాన్ లోని టెహ్రాన్, క్వామ్ అణు కేంద్రం గల నతాంజ్ పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త సైనిక దాడులు చేస్తోంది. ఇక ఇజ్రాయెల్ పై ఇరాన్ నేరుగా క్షిపణి వర్షం కురిపిస్తోంది. ఇజ్రాయెల్ ఇక్కడి హిజ్బుల్లా స్థావరాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. అయితే అమెరికా సైనిక స్థావరాలకు చోటిచ్చారనే నెపంతో ఇరాన్.. దుబాయ్, అబుదాబి, కతార్, కువైట్, బహ్రెయిన్, ఒమన్, సౌదీ అరేబియాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడి చేస్తోంది. సిరియా, ఇరాక్ లోని ఇరాన్ అనుకూల ముఠాలపై ఇజ్రాయెల్ సైతం అంతే స్థాయిలో దాడులు చేస్తోంది.. ఈ యుద్ధం వల్ల ప్రాణ నష్టం పరిస్థితి అలా ఉంటే, ఆస్తి నష్టం భారీ ఎత్తున జరిగింది. ఇరానియన్ అణు సైనిక మౌలిక సదుపాయాలపై భారీగా దాడి చేస్తోంది ఇజ్రాయెల్. ఇరాన్ అణు రియాక్టర్లు, ఐఆర్జీసీ హెడ్ క్వార్టర్స్, క్షిపణి తయారీ కేంద్రాలు.. పెద్ద ఎత్తున దెబ్బ తిన్నాయి. ఇన్నాళ్ల పాటు ఇరాన్ సమకూర్చుకుంటూ వచ్చిన వీటిని ధ్వంసం చేస్తూ వస్తోంది ఇజ్రాయెల్. ఇక చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి గుండా రవాణా నిలిచిపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఎమిరేట్స్, ఖతార్ ఎయిర్ వేస్, ఎయిరిండియా వంటి సంస్థలు గల్ఫ్ దేశాలకు వెళ్లే వందలాది విమానాలను రద్దు చేశాయి. వేలాదిమంది భారతీయులు ఎయిర్ పోర్టుల్లో చిక్కుకు పోయిన పరిస్థితులు. ఈ యుద్ధ వాతావరణం క్షణక్షణం మారుతూ వస్తోంది. ఖమేనీ మరణంతో మరింత రెచ్చిపోతున్న ఇరాన్ ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరిన్ని పెద్ద దాడులు తప్పవని హెచ్చరిస్తున్న వేళ.. ఇప్పుడిప్పుడే ఈ యుద్ధం ముగిసేలా కనిపించడం లేదు.
http://www.teluguone.com/news/content/what-is-the-loss-in-isreal-36-214966.html





