తల్లి, భార్యను చంపి.. పిల్లలతో సహా ఆత్మహత్య.. తిరుపతి జిల్లాలో ఘోర విషాదం
Publish Date:Apr 22, 2026
Advertisement
తిరుపతి జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా ఓ వ్యక్తి ఉన్మాదిగా మారి, కన్నతల్లిని, కట్టుకున్న భార్యను దారుణంగా హత్య చేశాడు. అనంతరం తన ఇద్దరు చిన్నారులతో కలిసి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృత్యువాత పడటంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగుతోంది. తిరుపతి జిల్లా నారాయణవనం మండలం వెంకటకృష్ణపాలెంలో మోహన్ అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కుటుంబంతో సహా నివాసం ఉంటున్నాడు, బుధవారం అర్థరాత్రి దాటిన తరువాత కుటుంబ సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది. దీంతో ఆగ్రహానికి లోనైన మోహన్.. తన తల్లి చంద్రకళ , భార్య హరితను గొంతు నులిమి హత్య చేశాడు. వారిద్దరూ ప్రాణాలు విడిచాక, తన ఇద్దరు పిల్లలు కౌశిక్ , హరిణి ని తీసుకుని ఇంటి నుంచి వేపకుంట రైల్వే ట్రాక్ వద్దకు చేరుకున్నాడు. అక్కడ వేగంగా వస్తున్న రైలు కింద పిల్లలతో సహా దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఉదయం పట్టాలపై ఛిద్రమైన మృతదేహాలను గమనించిన స్థానికులు వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను మోహన్, పిల్లలుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు మోహన్ ఇంటికి వెళ్ళగా, అక్కడ తల్లి మరియు భార్య విగతజీవులుగా పడి ఉండటం చూసి విస్తుపోయారు. ప్రాథమిక విచారణ ప్రకారం, కుటుంబంలో గత కొంతకాలంగా నెలకొన్న మనస్పర్థలే ఈ ఘోరానికి దారితీసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మోహన్ తన తల్లి, భార్యను చంపిన తర్వాత పిల్లలను కూడా బలితీసుకోవడం చూస్తుంటే అతను తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. సాఫ్ట్‌వేర్ వృత్తిలో ఉన్న మోహన్ ఇలాంటి అఘాయిత్యానికి ఎందుకు ఒడిగట్టాడనే కోణంలో విచారణ జరుపుతున్నారు. కేవలం కుటుంబ కలహాలే కారణమా లేక ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అనే అంశాలను కూడా పరిశీలిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/kills-mother-and-wife-36-218015.html





